e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 25, 2021
Home జిల్లాలు జల దృష్యం

జల దృష్యం

శ్రీశైల జలాశయం వద్ద నీలవేణి సోయగం
మల్లన్నను దాటుతూ.. మది పులకరింపజేస్తూ..
10 గేట్ల ద్వారా సాగర్‌కు నీటి విడుదల
పాల సముద్రాన్ని తలపిస్తున్న వరద
జూరాల డ్యాంకు 4.52 లక్షల క్యూసెక్కులు
టీబీ, సుంకేసుల ప్రాజెక్టులకూ ఇన్‌ఫ్లో

మహబూబ్‌నగర్‌, జూలై 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/శ్రీశైలం;శ్రీశైలం జలాశయం వద్ద అద్భుత జలదృశ్యం ఆవిష్కృతమైనది. గురువారం 15 అడుగుల మేర 10 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేయడంతో పాల సముద్రాన్ని తలపిస్తుంది. మల్లన్నను దాటుతూ గేట్ల నుంచి సాగర్‌కు నీలవేణి పరుగులు పెడుతున్నది. ఎగువ ప్రాజెక్టుల నుంచి 4,72,766 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ఏపీ పవర్‌హౌస్‌కు 29,815, తెలంగాణ పవర్‌హౌస్‌కు 31,783 క్యూసెక్కులు వినియోగించి అధికారులు విద్యుదుత్పత్తి చేపట్టారు. డ్యాం సైట్‌ వద్ద సోయగాన్ని తిలకించేందుకు సందర్శకులు తరలివచ్చారు.సెల్ఫీలు దిగుతూ ప్రవాహంలో తడుస్తూ సరదాగా గడిపారు. అలాగే జూరాల ప్రాజెక్టుకు 4,52,150 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. 47 గేట్లు ఎత్తి 4,68,059 క్యూసెక్కులు దిగువకు వదిలారు. ఆల్మట్టి, నారాయణపూర్‌, సుంకేసుల, టీబీ డ్యాంల నుంచి నీటి విడుదల కొనసాగుతున్నది.

శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణ మ్మ పరుగులు పెడుతున్నది. వరద భారీగా వస్తుండడంతో గురువారం రాత్రి 9 గంటలకు 10 గేట్లు 10 మీటర్ల చొప్పున ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. స్పిల్‌వే ద్వారా 3,76,670 క్యూసెక్కులు, ఏపీ పవర్‌హౌజ్‌ ద్వారా 29,815, తెలంగాణ పవర్‌హౌజ్‌ ద్వారా 31,783 క్యూసెక్కులు మొత్తం 4,38,268 క్యూసెక్కులు సాగర్‌ వైపు వెళ్తున్నాయి. శ్రీశైలానికి జూరాల నుంచి 4,67,537, సుంకేసుల నుంచి 69,088 క్యూసెక్కులు వస్తున్నాయి. ఏపీ పవర్‌హౌజ్‌ ద్వారా 17.658, టీఎస్‌ పవర్‌హౌజ్‌ ద్వారా 16.084 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి చేసినట్లు అధికారులు తెలిపారు. గేట్లు తెరవడంతో పర్యాటకులు భారీగా తరలివచ్చారు. వ్యూ పాయింట్‌ వద్ద నుంచి దిగువకు వెళ్తున్న పాలపొంగులాంటి వరదను చూసి ఆస్వాదించారు. దీంతో ప్రాజెక్టు పరిసరాల్లో సందడి నెలకొన్నది. సుమారు 10 వేలకు పైగా వాహనాలు రావడంతో పోలీసులు ట్రాఫిక్‌ ను నియంత్రించారు. గురువారం తొలి రోజు కావడంతో పర్యాటకుల సంఖ్య కాస్త తక్కువేనని.. నేటి నుంచి రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌ నుంచి శ్రీశైలానికి వచ్చే భక్తులు ఘాట్‌ రోడ్డు కావడంతో వాహనాలను జాగ్రత్తగా నడపాలని సూచించారు. ప్రాజెక్టు పరిసరాల్లో ఎక్కడపడితే అక్కడ వాహనాలను నిలిపి ట్రాఫిక్‌ జాం కాకుండా చూడాలని కోరారు.

- Advertisement -

ఆల్మట్టి, నారాయణపూర్‌ నుంచి..
కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్‌ ప్రాజెక్టుల నుంచి అవుట్‌ఫ్లో భారీగా నమోదైంది. ఆల్మట్టి ప్రాజెక్టుకు 4,23,240 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 3,91,141 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది. నారాయణపూర్‌కు 4,10,000 ఇన్‌ఫ్లో, 4,06,600 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది. జూరాల ప్రాజెక్టుకు సైతం భారీ వరద వస్తున్నది. సాయంత్రం జూరాలకు 4,52,150 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. 47 గేట్లు ఎత్తి 4,68,059 క్యూసెక్కులు శ్రీశైలానికి వదిలారు. భారీ వరద కారణంగా జూరాలలో పవర్‌ జనరేషన్‌ నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ఎగువ నుంచి వరద కొనసాగుతున్న తరుణంలో ఆల్మట్టి, నారాయణపూర్‌, జూరాల ప్రాజెక్టులను పూర్తి స్థాయి కంటే తక్కువలో నీటి నిల్వ ఉంచి వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్‌ నుంచి జూరాలకు.. అక్కడి నుంచి శ్రీశైలం వరకు సుమారు 5 లక్షల క్యూసెక్కుల వరద కొనసాగుతున్నందున నదీ తీర ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. నారాయణపేట, జోగుళాంబ గద్వాల, వనపర్తి జిల్లాల పరిధిలోని కృష్ణాతీర ప్రాంత ప్రజలకు టాంటాం ద్వారా సమాచారం అందిం చి నది వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జూరాల ప్రాజెక్టుకు దిగువన నదీ అగ్రహారం, బీచుపల్లి వద్ద వరద పుష్కరఘాట్లు ఎక్కి ప్రవహిస్తున్నందున ప్రజలు అక్కడకు వెళ్లకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వరద పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహ న్‌ రెడ్డి కోరారు. నది పక్కన ఉన్న పంట పొలాల రైతులు మోటర్లు తీసేయాలన్నారు. పశువుల ను ఇంటి వద్దనే కట్టేసుకోవాలన్నారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు.

ఆర్డీఎస్‌ ఆనకట్టకు..
ఆర్డీఎస్‌ ఆనకట్టకు 48,370 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 48,300 క్యూసెక్కులు ఆనకట్టపై నుంచి దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి చేరుతుందని ఏఈ శ్రీనివాస్‌ తెలిపారు. ప్రస్తుతం ఆనకట్టలో 11 అడుగుల మేర నీటి మట్టం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana