గురువారం 04 మార్చి 2021
Mahabubnagar - Jan 14, 2021 , 00:34:34

సంక్రాంతి వచ్చింది... టీకా తెచ్చింది

సంక్రాంతి వచ్చింది...  టీకా తెచ్చింది

  • వ్యాక్సిన్‌ తెచ్చిన సంబురం
  • 10నెలల నుంచి అవస్థలు పడుతున్న జనం
  • 16 నుంచి ప్రారంభంకానున్న వ్యాక్సినేషన్‌
  • తొలిఫలితం హెల్త్‌ కేర్‌ వర్కర్లకే..

మానవ జీవనాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి పీడ మరికొన్ని రోజుల్లో తొలగనున్నది. దాదాపు 10నెలలకు పైగా ఎన్నో అవస్థలు పడుతూ..కరోనా మహమ్మారి బారిన పడి జీవితాలు చిన్నాభిన్నమవుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తీపికబురు అందించాయి. వ్యాక్సిన్‌ విడుదల చేస్తూ ప్రకటన చేయడంతో సంక్రాంతి కీడు పండుగ కాస్త..తీపి పండుగలా మారింది. శనివారం నుంచి వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభంకానున్నది. ఈ మేరకు బుధవారం రాత్రి ‘టీకా’ హైదరాబాద్‌ నుంచి పాలమూరుకు చేరుకున్నది. ఉమ్మడి జిల్లాలోని 22,658 మందికి టీకా వేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. 

  • పది నెలలుగా అవస్థలు పడుతున్న జనం
  •  రేపటి నుంచి ప్రారంభం కానున్న వ్యాక్సినేషన్‌
  • తొలి ఫలితం హెల్త్‌ వర్కర్లకే..

మహబూబ్‌నగర్‌, జనవరి 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గతేడాది ఇదే సమయంలో ప్రజలు ఎంతో సంతోషంగా సంక్రాంతి పండుగను జరుపుకొన్నారు. అంతా సాఫీగా సాగుతున్న క్రమంలో కొన్ని రోజులకే కరోనా మహమ్మారి ప్రభావం చూపింది. చూస్తుండగానే కేసులు పెరిగిపోవడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ప్రపంచమంతా లాక్‌డౌన్లు విధించారు. వైరస్‌ సోకకుండా ప్రధాని మోడీ గతేడాది మార్చి 22న జనతా కర్ఫ్యూ ప్రకటించారు. సుమారు 10 నెలల పాటు జనం అతలాకుతలమయ్యారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 37 వేల మందికి కరోనా వైరస్‌ సోకగా.. దాదాపు 400 వరకు మృత్యువాత పడ్డారు. కరోనా పేరెత్తితేనే వణికిపోయిన జనం క్రమంగా మహమ్మారిపై పోరాటం ప్రారంభించారు. వైరస్‌ ప్రభావం సైతం క్రమంగా తగ్గితూ వస్తున్నది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఈ నెల 16 నుంచి తొలి టీకా ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌ నుంచి వ్యాక్సిన్‌ ఏసీ అంబులెన్స్‌ల్లో బుధవారం జిల్లాలకు చేరింది. తొలి విడుతలో హెల్త్‌కేర్‌ వర్కర్స్‌కు మాత్రమే వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు. సంక్రాంతి వచ్చే.. టీకా తెచ్చే అని ప్రజలు సంబురపడుతున్నారు. 

జిల్లాలకు చేరుకున్న వ్యాక్సిన్‌..

కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి ముహూర్తం ఖరారైంది. శనివారం నుంచి కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేపట్టింది. తొలి విడుతలో కరోనా వారియర్స్‌ అయిన మెడికల్‌ ఆఫీసర్లు, హెల్త్‌ వర్కర్లకు.. ఆ తర్వాత ఫ్రంట్‌లైన్‌లో ఉన్న ఆశ, అంగన్‌వాడీ, పోలీసు, పుర, పంచాయతీ పారిశుధ్య సిబ్బందికి వ్యాక్సిన్‌ వేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. వారానికి నాలుగు రోజులు మాత్రమే కొనసాగే టీకా పంపిణీలో మొత్తం ఉమ్మడి జిల్లాలోని 22,658 మందికి వేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే వ్యాక్సినేషన్‌ కేంద్రాల గుర్తింపు పూర్తయింది. బుధవారం జిల్లా కేంద్రాలకు వ్యాక్సిన్‌ చేరుకున్నది. అక్కడి నుంచి ఎంపిక చేసిన దవాఖానలకు వ్యాక్సిన్‌ సరఫరా కానున్నది. 

అన్ని ఏర్పాట్లు చేశాం..

16 నుంచి కరోనా వారియర్స్‌కు వ్యాక్సిన్‌ ఇవ్వనున్నాం. వనపర్తి జిల్లాలో 2,883 మం దిని గుర్తించాం. తొలి విడుతగా జిల్లా కేంద్ర దవాఖాన, ఆత్మకూరు, రేవల్లి, ఖిల్లాఘణపురం దవాఖానల్లో ఒక్కో చోట 30 మంది చొప్పున రోజుకు మొత్తం 120 మందికి టీకా ఇవ్వనున్నాం. అన్ని పీహెచ్‌సీల్లో వ్యాక్సిన్‌ నిల్వ చేసేందుకు ఏర్పాట్లు చేపట్టాం. 

- శ్రీనివాసులు, డీఎంహెచ్‌వో, వనపర్తి

తొలి రోజు 90 మందికి..

నారాయణపేట జిల్లాలో 3,178 మంది కరోనా వారియర్లను గుర్తించాం. 16న వీ రిలో 90 మందికి వ్యాక్సిన్‌ ఇ వ్వనున్నాం. 16న మక్తల్‌, మ రికల్‌, నారాయణపేట ప్రభు త్వ దవాఖానల్లో ఎంపిక చేసిన వారియర్లకు టీకా ఇస్తాం. ఆ తర్వాత ఈ నెల 18 నుంచి మిగతా వారియర్లకు సైతం టీకాలు వేస్తాం. ఇందుకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. 

- జయచంద్ర మోహన్‌, డీఎంహెచ్‌వో, నారాయణపేట

VIDEOS

logo