మంగళవారం 26 జనవరి 2021
Mahabubnagar - Dec 06, 2020 , 03:01:17

కమతానికి కన్నీటి వీడ్కోలు

కమతానికి కన్నీటి వీడ్కోలు

 • అశ్రునయనాల మధ్య అంతిమయాత్ర
 •   అధికారిక లాంఛనాలతో నిర్వహణ 
 •    నివాళులర్పించిన మంత్రులు సబితారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి,   ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ప్రముఖులు
 • పాడె మోసిన కొప్పుల బ్రదర్స్‌
 •  తరలివచ్చిన నాయకులు, అభిమానులు

  మాజీ మంత్రి కమతం రాంరెడ్డి అనారోగ్యంతో శనివారం ఉదయం హైదరాబాద్‌లో కన్ను మూశారు. ఆయన పార్థివ దేహాన్ని అంత్యక్రియల నిమిత్తం స్వగ్రామమైన గండీడ్‌ మండలం మహమ్మదాబాద్‌కు తీసుకొచ్చారు.  విషయం తెలియగానే మంత్రులు సబితారెడ్డి,  శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ మనోహర్‌రెడ్డి, మాజీ మంత్రి చిన్నారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు హరీశ్వర్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి గ్రామానికి చేరుకొని నివాళులర్పించారు. నాయకులు, అభిమానులు వందలాదిగా తరలిరాగా.. గ్రామం కన్నీటి సంద్రమైంది. అనంతరం అధికార లాంఛనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. 

-   గండీడ్‌ 

గండీడ్‌: మాజీ మంత్రి కమతం రాంరెడ్డి అనారోగ్యంతో శనివారం ఉదయం కన్నుమూశారు. మూడు నెలలుగా గొంతు క్యాన్సర్‌తో బాధపడుతూ హైదరాబాద్‌లోని దవాఖానలో చికిత్స పొందుతూ ఈ మధ్యనే డిశ్చార్జి అయ్యారు. శనివారం ఉదయం రాష్ట్ర రాజధానిలోని తన నివాసంలో కన్నుమూశారు. ఆయన పార్థివ దేహాన్ని అంత్యక్రియల నిమిత్తం స్వగ్రామమైన మహబూబ్‌నగర్‌ జిల్లా గండీడ్‌ మండలం మహమ్మదాబాద్‌కు తీసుకొచ్చారు. ఆయన మృతి చెందిన వార్త వినగానే వికారాబాద్‌తోపాటు తాండూరు, పరిగి, మహబూబ్‌నగర్‌కు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు మహమ్మదాబాద్‌కు చేరుకున్నారు. తమ ప్రియతమ నేతను కడసారి చూసి నివాళులర్పించారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. 

నివాళులర్పించిన మంత్రులు

మాజీ మంత్రి కమతం రాంరెడ్డి పరమపదించారనే విషయం తెలియగానే ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి, మాజీ మంత్రి చిన్నారెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ మనోహర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి మహమ్మదాబాద్‌కు చేరుకున్నారు. ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. 

పాడె మోసిన ‘కొప్పుల’

కమతం రాంరెడ్డి ఇక లేరని తెలియగానే మాజీ డిప్యూటీ స్పీకర్‌ హరీశ్వర్‌రెడ్డి తనయులు, ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి, అనిల్‌కుమార్‌రెడ్డి మహమ్మదాబాద్‌కు చేరుకుని కార్యక్రమాలన్నింటినీ చూసుకున్నారు. అంత్యక్రియల్లో పాల్గొని ఇద్దరూ పాడెమోసారు.

పరిగి రాంరెడ్డిగా ..

మాజీ మంత్రి కమతం రాంరెడ్డి తన ఇంటిపేరు కమతం అయినప్పటికీ రాష్ట్ర రాజకీయాల్లో కీలక వ్యక్తిగా ఉండటంతో నాయకులు కమతానికి బదులుగా పరిగి రాంరెడ్డిగా పిలిచేవారు. 

 • ‘కమతం’ ప్రస్థానం

  • మాజీ మంత్రి కమతం రాంరెడ్డి పరిగి నియోజకవర్గం నుంచి మూడుపర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 
  • 1967లో స్వతంత్ర అభ్యర్థిగా 1972లో, 1989లో కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. 
  • 1980లో ఎమ్మెల్సీగా, 1969లో ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా పనిచేశారు. 
  • 1977లో వెంగల్‌రావ్‌ మంత్రివర్గంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా..
  • 1991లో జనార్దన్‌రెడ్డి మంత్రివర్గంలో మార్కెటింగ్‌, గిడ్డంగుల శాఖ మంత్రిగా..
  • 1992లో కోట్ల విజయభాస్కర్‌రెడ్డి మంత్రివర్గంలో రెవెన్యూశాఖ మంత్రిగా పనిచేశారు. 
  • 2014లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి టికెట్‌ లభించకపోవడంతో బీజేపీ అభ్యర్థిగా పోటీచేశారు. 
  • 2018 ఎన్నికల సమయంలో కేసీఆర్‌ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. 


logo