సోమవారం 25 జనవరి 2021
Mahabubnagar - Nov 21, 2020 , 03:13:27

తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం

తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం

  • అలంపూర్‌ ఘాట్‌ వద్ద అధికారికంగా ప్రారంభించిన దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
  • హాజరైన మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌
  • శాస్ర్తోక్త కార్యక్రమాలు నిర్వహించిన పీఠాధిపతులు
  • కొవిడ్‌ నిబంధనలతో తొలిరోజు ప్రశాంతంగా పుష్కరాలు

శుక్రవారం మధ్యాహ్నం 1.23గంటలకు..బృహస్పతి మకరరాశిలోకి ప్రవేశించిన అనంతరం అలంపూర్‌ ఘాట్‌ వద్ద తుంగభద్ర పుష్కరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ జోగులాంబ పుష్కర ఘాట్‌ వద్ద ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అధికారికంగా ప్రారంభించగా, తొగుట పీఠాధిపతి మాధవానంద స్వామి, హిందూ దేవాలయ ప్రతిష్టాన్‌ పీఠాధిపతి కమలానంద భారతి స్వామిజీ తుంగభద్ర నదికి శాస్ర్తోక్తంగా పూజలు చేశారు. మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ముందుగా పుష్కరుడికి పూజలు నిర్వహించారు. అనంతరం తుంగభద్ర నది లో పుణ్యస్నానాలు ఆచరించి, జోగుళాంబ అమ్మవారు, బాల బ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

- మహబూబ్‌నగర్‌ ప్రతినిధి,నమస్తే తెలంగాణ


మహబూబ్‌నగర్‌ ప్రతినిధి నమస్తే తెలంగాణ: తుంగభద్ర పుష్కరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలోని ఐదో శక్తిపీఠం అలంపూర్‌ పుష్కరఘాట్‌ వద్ద పుష్కరాలను రాష్ట్ర ప్రభుత్వ పక్షాన దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధికారికంగా ప్రారంభించారు. మధ్యాహ్నం 1.23 గంటలకు బృహస్పతి మకరరాశిలోకి ప్రవేశించాక అలంపూర్‌ ఘాట్‌ వద్ద  తొగుట పీఠాధిపతి మాధవనందస్వామి, హిందూ దేవాలయ ప్రతిష్టాన్‌ పీఠాధిపతి కమలానందభారతి స్వామిజీ తుంగభద్ర నదికి శాస్ర్తోక్తంగా పూజలు చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎక్సైజ్‌ శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ముందుగా పుష్కరునికి పూజలు నిర్వహించారు. అనంతరం తుంగభద్ర నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం మంత్రులు జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. 


అన్ని ఏర్పాట్లు చేశాం : మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పుష్కరాలకు అన్ని ఏర్పాటు చేసినట్లు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కృష్ణా, గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించామన్నారు. అదే తరహాలో తుంగభద్ర పుష్కరాలను కూడా నిర్వహించేందుకు అన్ని సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు. కొవిడ్‌ను దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్లు చేశామని, జిల్లా యంత్రాంగంతోపాటు, మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ అబ్రహంతో కలిసి పుష్కరాల నిర్వహణపై సమీక్షించినట్లు చెప్పారు. భక్తులు ప్రశాంతవాతావరణంలో పిండ ప్రదానాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించుకొని దర్శనం చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలో ప్రతిఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఆర్థికంగా బలపడి జీవించాలని ఆయన ఆకాంక్షించారు.


కొవిడ్‌ జాగ్రత్తలు పాటించాలి : మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి

పుష్కరాలకు వచ్చే భక్తులు కొవిడ్‌ జాగ్రత్తలు పాటించి పుష్కరస్నానాలు చేయాలని మంత్రి నిరంజన్‌రెడ్డి కోరారు. 70ఏండ్లలో ఎన్నడూ చేయని విధంగా కృష్ణా, గోదావరి పుష్కరాల కోసం నదీపరీవాహక గ్రామాల్లో పుష్కరఘాట్లు, రోడ్ల నిర్మాణం తదితర ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం చేసిందని గుర్తు చేశారు. కొవిడ్‌ నేపథ్యంలో తుంగభద్ర పుష్కరాలకు అనేక జాగ్రత్తలు తీసుకుంటూ.. కట్టుదిట్టమైన పరిమితమైన ఏర్పాట్లు చేశామన్నారు. భౌతికదూరం, పరిశుభ్రత పాటిస్తూ.. సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణ విలసిల్లుతున్నదని ఆయన అన్నారు. 

పుష్కరాలంటే విజయవాడ మాత్రమే కాదు:ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

పూర్వం పుష్కరాలు అంటే విజయవాడ, రాజమండ్రి వంటి ప్రాంతాలకు మాత్రమే వెళ్లేవారని, పుష్కరాలు అంటే తెలంగాణ కూడా అని చాటి చెప్పినట్లు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. కృష్ణా, గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించామన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి నిర్వహిస్తున్న తుంగభద్ర పుష్కరాలలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా కొవిడ్‌ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఏర్పాట్లు చేశామని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ యాదాద్రి దేవాలయ నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టారని, ప్రపంచంలోనే  అద్భుతమైన ఆలయంగా నిర్మిస్తున్నారని తెలిపారు. తుంగభద్ర పుష్కరాలలో భాగంగా నదీ పరీవాహక గ్రామాల్లో దారిపొడవునా రోడ్ల నిర్మాణం చేపట్టామని, తుంగభద్ర పుష్కరాలను విజయవంతం చేసేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ అబ్రహం, దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌, ఆలయ కమిటీ చైర్మన్‌ రవిప్రకాశ్‌ గౌడ్‌, కలెక్టర్‌ శృతి ఓఝా, ఎస్పీ రంజన్‌ రతన్‌ కుమార్‌, ఆలయ ఈవో ప్రేమకుమార్‌రావు తదితరులు పాల్గొన్నారు.


logo