బుధవారం 27 జనవరి 2021
Mahabubnagar - Nov 11, 2020 , 01:43:21

అర్హులందరికీ డబుల్‌ బెడ్రూంలు

 అర్హులందరికీ డబుల్‌ బెడ్రూంలు

మహబూబ్‌నగర్‌ రూరల్‌ : అర్హులందరికీ డబుల్‌బెడ్రూం ఇండ్లు ఇస్తామని, ఎవరూ ఆందోళన చెందొద్దని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సూచించారు. మంగళవారం మహబూబ్‌నగర్‌ రూరల్‌ మండలం మాచన్‌పల్లి తండాలో 64 డబుల్‌బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి కలెక్టర్‌ వెంకట్రావుతో కలిసి మంత్రులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ గత పాలనలో పేదలను పట్టించుకోలేదని, తెలంగాణ వచ్చాకే వారి ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టినట్లు వివరించారు. మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంలో దివిటిపల్లి, వీరన్నపేట్‌, క్రిస్టియన్‌పల్లిలో డబుల్‌ ఇండ్లు నిర్మించి ఇచ్చామని చెప్పారు. మరిన్ని నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కండ్లకు కట్టినట్లు కనిపిస్తున్నదన్నారు. ఎవరికి ఏ కష్టమొచ్చినా తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు. అనంతరం ఏనుగొండలోని బైపాస్‌ రోడ్డులో పీఏసీసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి, మక్క కొనుగోలు కేంద్రాలను విండో అధ్యక్షుడు కొరమోని వెంకటయ్యతో కలిసి మంత్రులు ప్రారంభించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజేశ్వర్‌గౌడ్‌, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్‌ యాదవ్‌, డీపీవో వెంకటేశ్వర్లు, ఆర్డీవో శ్రీనివాసులు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కడాం ఆంజనేయులు, ఎంపీపీ సుధాశ్రీ, జెడ్పీటీసీ వెంకటేశ్వరమ్మ, రైతుబంధు డైరెక్టర్‌ మల్లు నర్సింహారెడ్డి, మండల అధ్యక్షుడు మల్లే దేవేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌ యాదవ్‌, రూరల్‌ తాసిల్దార్‌ కిషన్‌ నాయక్‌, ఎంపీడీవో వేదావతి, సర్పంచులు మంగమ్మ, శ్రీనివాస్‌నాయక్‌, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌గౌడ్‌, ప్రజాప్రతినిధులు, నాయకులు రాఘవేంద్రగౌడ్‌, పాండురంగారెడ్డి,  రవీందర్‌రెడ్డి, రంగన్న, రైతులు పాల్గొన్నారు.


logo