శుక్రవారం 04 డిసెంబర్ 2020
Mahabubnagar - Oct 31, 2020 , 01:47:57

ప్రారంభానికి సిద్ధంగా రైతు వేదికలు

 ప్రారంభానికి సిద్ధంగా రైతు వేదికలు

  • రైతులకు, అధికారులకు వారధిలా రైతు వేదికలు
  • తప్పనున్న వ్యవ ప్రయాసలు
  • ఉమ్మడి జిల్లాలో 476 రైతు వేదికలు
  •  259 నిర్మాణాలు పూర్తి..
  • వివిధ దశల్లో మరో 217 వేదికలు 
  • వనపర్తిలో 100 శాతం రైతు వేదికల నిర్మాణాలు పూర్తి

మహబూబ్‌నగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : రైతులకు, వ్యవసాయాధికారులకు వారధులుగా ఉండేందుకు ప్రభుత్వం రైతువేదికలు నిర్మిస్తున్నది. రైతులు తమ క్లస్టర్‌ పరిధిలో ఏర్పాటు చేసే రైతువేదికకు వెళ్తే సందేహాలన్నింటికీ సమాధానం లభించనున్నది. గతంలో మండలం, డివిజన్‌ కేంద్రాలకే పరిమితమైన వ్యవసాయ కార్యాలయాలు రైతు వేదికల రూపంలో నేడు ప్రతి 5వేల ఎకరాలు సాగుచేస్తున్న క్లస్టర్లకు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రభుత్వం రూపొందించే కార్యక్రమాల నిర్వహణ, విత్తనాలు, ఎరువుల రాయితీలు, అన్నదాతలకు సలహాలు, సూచనలు అందించేందుకు ఓ వేదిక లేక ఇన్నాళ్లు ఇబ్బందులు పడ్డారు. రైతులు అధికారుల కోసం పట్టణాలకు వెళ్తే.. సకాలంలో అందుబాటులో లేకుంటే పడిన ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. వాటన్నింటికీ చెక్‌ చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికలు నిర్మిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా రైతువేదికలు ప్రారంభానికి ముస్తాబయ్యాయి. రైతులందరూ ఒక్కచోట చేరి తమ సాదకబాధకాలను చర్చించుకొనే రైతు వేదికలు సిద్ధమయ్యాయి. జనగామ జిల్లా కొడకండ్లలో నిర్మించిన రైతు వేదికను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుక్రవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులకు మరో సరికొత్త కానుక అందుబాటులోకి రానున్నది. ఇప్పటికే రైతుబంధు, రైతుబీమా, నిరంతర ఉచిత విద్యుత్‌ అందిస్తూ రైతులకు ఎంతో మేలు చేస్తున్న సీఎం కేసీఆర్‌.. రైతు వేదికల ప్రారంభంతో మరో సరికొత్త అవకాశాన్ని రైతులకు అందించినైట్లెంది. 

అందంగా ముస్తాబవుతున్న వేదికలు..

ఉమ్మడి జిల్లాలో రైతు వేదికలు అందంగా ముస్తాబవుతున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన మేరకు నిర్మిస్తుండగా.. కొన్నిచోట్ల సర్పంచులు, దాతల సహకారంతో మరింత సొబగులు అద్దుతున్నారు. రైతులకు అదనపు సౌకర్యాలు కల్పిస్తున్నారు. మల్దకల్‌ మండలం కుర్తి రావులచెర్వు గ్రామంలోని రైతువేదిక సైతం అందరినీ ఆకట్టుకుంటోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల రైతు వేదికలు ఆకట్టుకుంటున్నాయి. 

వనపర్తిలో 100 శాతం పూర్తి..

రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నాటికి జగిత్యాల, ఖమ్మం, వనపర్తి జిల్లాల్లో వందశాతం రైతువేదికలను పూర్తి చేశారు. వనపర్తి జిల్లాలో 71 రైతు వేదికలను నిర్మిస్తుండగా.. అన్నింటినీ పూర్తి చేయడం విశేషం. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వనపర్తిలో రైతువేదికలన్నింటినీ పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేశారు. ఇక జోగులాంబ గద్వాల జిల్లాలో 97 రైతు వేదికలకు గానూ 79, నారాయణపేట జిల్లాలో 77కు గానూ 62 నిర్మాణాలు పూర్తయ్యాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో మాత్రమే రై తు వేదికల నిర్మాణంలో పురోగతి తక్కువగా ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 476 రైతు వేదికలకు గానూ ఇప్పటి వరకు 259 రైతువేదికల నిర్మాణాలు పూర్తయ్యాయి. మరో 217 వివిధ దశల్లో ఉన్నాయి. 

ఉత్తనూరు రైతు వేదికను మోడల్‌గా తీర్చిదిద్దారు. రైతు వేదికలో అత్యాధునిక సౌకర్యాలను కల్పించారు. ప్రభుత్వ నిధులు రూ. 22 లక్షలు కాగా.. అదనంగా రూ.18.50 లక్ష లను దాతల సహకారంతో పోగు చేసి రైతు వేదికకు అదనపు సొబగులు అద్దారు. 

హైటెక్‌ వేదిక..

ఉత్తనూరు గ్రామంలో నిర్మించిన రైతు వేదికలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించారు. రైతువేదిక ప్రాంగణంలోకి అడుగిడిన రైతన్నకు ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించేలా పచ్చికబయళ్లు ఏర్పాటు చేశారు. అందమైన పూల మొక్కలు, ఆహ్లాదం పంచే విధంగా వివిధ రకాల మొక్కలు నాటారు. రైతువేదికకు ఇరువైపులా అన్నదాతను సూచించేలా అరకను పట్టిన రైతన్నతోపాటు రెండు ఎద్దులు, ఎడ్ల బండిని ఏర్పాటు చేశారు. వ్యవసాయాధికారులు సమావేశాలు నిర్వహించుకునేందుకు అనువుగా అత్యాధునిక డిజిటల్‌ సౌండ్‌ సిస్టం, ప్రొజెక్టర్‌, డిజిటల్‌ స్క్రీన్‌, 6 డిజిటల్‌ సౌండ్‌తో కూడిన స్పీకర్లు ఉంచారు. హాల్‌లో రైతులకు ఉపయోగపడే సమాచారం, వ్యవసాయాధికారుల సూచనలు, సలహాలతో కూడిన మ్యాప్‌లను చక్కగా ఏర్పాటు చేశారు. సమావేశాల నిర్వహణకు ప్రత్యేకంగా స్టేజీ ఏర్పాటు, రైతులకు 150 కుర్చీలను రైతు వేదికలో ఏర్పాటు చేశారు.

అదనంగా రూ. 18.50 లక్షల ఖర్చు..

ఉత్తనూర్‌ రైతు వేదికలో రూ.1.50 లక్షలతో ప్రొజెక్టర్‌, రూ.లక్షతో డిజిటల్‌ స్క్రీన్‌, సౌండ్‌ సిస్టం, జిప్సం పాప్‌, రూ. లక్షతో స్టీల్‌ రేయిలింగ్‌, రూ.5 లక్షలతో పచ్చిక బయళ్లు, మొ క్కలు, పాపప్స్‌, రూ.2 లక్షలతో ఎద్దులు, ఫార్మర్‌ స్టాచ్యూస్‌, రూ.1.50 లక్షలతో 150 కుర్చీలు, రూ.2 లక్షలతో ఫినిషింగ్‌ పనులు, రూ.2లక్షలతో గ్రౌండ్‌ పనులు, రూ.30వేలతో ఎద్దుల బండి, రూ.2లక్షలతో చిత్రపటాలు, లోగోలు తదితర వస్తువులకు ఖర్చు చేశారు. మొత్తంగా రూ.18.50లక్షల అదనపు నిధులను గ్రామస్తులు సేకరించి రైతువేదికకు అదనపు సొబగులు అద్దారు.

సమగ్ర సమాచార కేంద్రాలు..

రైతులు వ్యవసాయంపై సమగ్ర సమాచారం తెలుసుకోవాలంటే మండల, జిల్లా స్థాయి కార్యాలయాలకు వెళ్తే తప్ప సాధ్యం కాదు. వ్యవసాయ రంగానికి సంబంధించి ఎలాంటి సమాచారం కావాలన్నా అక్కడికే వెళ్లాల్సిందే. దీంతో రైతుల సమయం వృథా అవడంతో పాటు దూరభారం తప్పడంలేదు. ఈ నేపథ్యంలో నాలుగైదు గ్రామాలను కలిపి క్లస్టర్‌ పరిధిలో రైతువేదికలు నిర్మిస్తున్నారు. రైతులకు అవసరమైన సమగ్ర సమాచారాన్ని రైతువేదిక ద్వారా అందించడం వల్ల బహుళ ప్రయోజనాలు ఉంటాయని ప్రభుత్వం భావిస్తున్నది. రైతువేదికలు సిద్ధమైన తర్వాత రైతుబంధు సమితుల ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. ప్రభుత్వ రాయితీలు, రైతుబంధు, రైతుబీమా, ఇతర పథకాల పర్యవేక్షణ తదితర కార్యక్రమాలకు కేంద్రం కానున్నది. ఈ వానకాలం సీజన్‌ నుంచి అమలవుతున్న నియంత్రిత సాగు పద్ధతిపై రైతులకు అవగాహన కల్పించడమే కాకుండా.. ఏఈవోలు క్లస్టర్‌ పరిధిలోని వ్యవసాయంపై పూర్తిస్థాయిలో పట్టుసాధించే అవకాశం ఏర్పడుతుంది.