గురువారం 03 డిసెంబర్ 2020
Mahabubnagar - Oct 31, 2020 , 01:32:46

సొంత జాగుంటే డబుల్‌ ఇల్లు

సొంత జాగుంటే డబుల్‌ ఇల్లు

  • నిరుపేదలకు ఇల్లు కట్టివ్వాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యం
  • కేంద్రం.. పోలవరం ప్రాజెక్టుకు డబ్బులు ఇస్తూ..‘పాలమూరు’కు ఎందుకివ్వరూ..?
  • ఎల్‌ఐసీ, బీఎస్‌ఎన్‌ఎల్‌, రైల్వేలను ప్రైవేటు పరం చేసేందుకు యత్నం
  • రైతులకు మద్దతు ధర అందించడంలోనూ కేంద్రం విఫలం 
  • ‘పాలమూరు’కు బీజేపీ జాతీయ హోదా ఎందుకివ్వలె..?
  • ఇందిరమ్మ పేరిట కాంగ్రెస్‌ నాయకులు లక్షల ఇండ్లు కాజేసిండ్రు..
  • దేవరకద్ర నియోజకవర్గంలో డబుల్‌ బెడ్రూం ఇండ్లప్రారంభోత్సవంలో మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌

రాష్ట్రంలో ఇండ్లు లేని పేదలందరికీ ‘డబుల్‌' ఇండ్లు కట్టించి ఇవ్వడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని రహదారులు, భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ప్రతి ఏడాది కొన్ని డబుల్‌ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో ఇల్లు లేని వారు ఉండకుండా చూడాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ మండలం అన్నాసాగర్‌,మూసాపేట మండలం నిజాలాపూర్‌ గ్రామాల్లో రూ.8కోట్ల 80 లక్షలతో నిర్మించిన 164 డబుల్‌ బెడ్రూం ఇండ్లను ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ప్రారంభించారు. ఎమ్మెల్యే ఆల విజ్ఞప్తి మేరకు దేవరకద్ర నియోజకవర్గానికి మరో 1500 ఇండ్లు ఇచ్చే ఏర్పాటు చేస్తామని వేములప్రశాంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.

 మహబూబ్‌నగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: రానున్న రోజుల్లో సొంత స్థలం ఉన్న వారికి కూడా డబుల్‌ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇచ్చే ఆలోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నారని రాష్ట్ర రహదారులు, భవనాలు మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ మండలం అన్నాసాగర్‌, మూసాపేట మండలం నిజాలాపూర్‌ గ్రామాల్లో రూ.8కోట్ల 80లక్షలతో 164డబుల్‌ బెడ్రూం ఇండ్ల ప్రారంభోత్సవం కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టుకు డబ్బులు ఇస్తూ..తెలంగాణలోని వెనకబడిన జిల్లాలో నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్రం జాతీయ హోదా ఇవ్వకపోవడం ఎంత వరకు సబబని బండి సంజయ్‌, కిషన్‌రెడ్డిని ప్రశ్నించారు. రాష్ట్రం కోసం అహోరాత్రులు పనిచేస్తున్న కేసీఆర్‌ కాళ్లలో కట్టెలు ఎందుకు పెడుతున్నారని అన్నారు. తెలంగాణ చెల్లిస్తున్న రూ.60వేల కోట్ల పన్నుల్లో రూ.25 వేల కోట్లు మాత్రమే రాష్ర్టానికి ఇస్తూ మిగతా రూ.35 కోట్లను ఇతర రాష్ర్టాలకు పంపిణీ చేస్తూ రాష్ర్టానికి బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తున్నదన్నారు. రాష్ట్రం పన్నులు తీసుకుంటూ రైతుల ధాన్యం మాత్రం కొనుగోలు చేయడం లేదని బీజేపీ నేతలను ప్రశ్నించారు. డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణం కోసం సీఎం కేసీఆర్‌ సిద్ధమైన రోజున అంత ఖర్చుతో ఎలా సాధ్యమని తామంతా ఆశ్చర్యపోయామని.. కానీ నేడు పేదల కళ్లల్లో ఆనందం చూస్తే ముఖ్యమంత్రి ముందుచూపు అర్థమవుతుందన్నారు. 

అంతా ప్రైవేటు పరం  చేస్తున్న కేంద్రం..

ఇప్పటికే బీఎస్‌ఎన్‌ఎల్‌ను ఖతం చేసిన కేంద్రం అదే దిశగా ఎల్‌ఐసీ, రైల్వే శాఖలను కూడా చేసేందుకు ప్రయత్నిస్తుందని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని మహబూబ్‌నగర్‌ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రులు ఎన్నో సార్లు హామీలు ఇచ్చారని కానీ తర్వాత మాట మరిచిపోయారని గుర్తుచేశారు. పాలమూరు ప్రాజెక్టుకు కేంద్రం ఒక్క పైసా ఇవ్వలేదన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పేరిట లక్షల ఇండ్లు నిర్మించినట్లు చూపి కాంగ్రెస్‌ పైసలు కాజేసిందని దుయ్యబట్టారు. పేదలు సైతం విశాలమైన డబుల్‌ బెడ్రూం ఇండ్లలో ఉండేలా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. సాగునీటి ప్రాజెక్టుల ద్వారా పాలమూరులో వలసలు తగ్గాయన్నారు. 

భాగోద్వేగానికి గురైన ఎమ్మెల్యే ఆల

సొంతూరులో డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణం కోసం తన తండ్రి దివంగత రఘుపతి రెడ్డి స్మారకార్థం స్థలం ఇవ్వడం, 40ఏండ్ల తన తండ్రి రాజకీయ జీవితం తమకు ఎంతో గుర్తింపునివ్వడమే కాకుండా బాధ్యతను నేర్పిందని గుర్తుచేసుకున్నారు. తన తండ్రిని గుర్తుకు చేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. భావోద్వేగానికి గురైన ఎమ్మెల్యేను మంత్రులు ఓదార్చారు. జై తెలంగాణ అన్నందుకే చంద్రబాబు తనను ఎగాదిగా చూశారని మరుసటి రోజే పార్టీని వీడి ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్‌లో చేరినట్లు గుర్తుచేశారు. నియోజకవర్గానికి మరో 1500 ఇండ్లు కేటాయించాలని మంత్రి ప్రశాంత్‌రెడ్డిని కోరారు. 

పండుగ వాతావరణం: ఎంపీ మన్నె 

డబుల్‌ బెడ్రూం ఇండ్ల గృహప్రవేశాలు పండుగ వాతావరణాన్ని తలపిస్తున్నాయని ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిశాయని మిషన్‌ కాకతీయ ద్వారా మరమ్మతులు చేసిన చెరువులు వర్షపు నీటితో కళకళలాడుతున్నాయని అన్నారు. దూరదృష్టితో ప్రజలకు అవసరమైన పథకాలను తీసుకువచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌ కే దక్కుతుందని ఎంపీ అన్నారు.  

దివగంత రఘుపతిరెడ్డి విగ్రహావిష్కరణ

ఎమ్మెల్యే ఆల తన సొంతూరు అన్నాసాగర్‌ లో నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి తన తండ్రి దివంగత రఘుపతి రెడ్డి జ్ఞాపకార్థం నాలుగున్నర ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. డబుల్‌ బెడ్రూం ఇండ్ల వద్ద పార్కులో దివంగత రఘుపతి రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహాన్ని మంత్రులు వేముల ప్రశాంత్‌ రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌ ఆవిష్కరించారు. దివంగత రఘుపతిరెడ్డి ప్రజాసేవను మంత్రులు కొనియాడారు.  కార్యక్రమంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, జెడ్పీ చైర్‌ పర్సన్‌ స్వర్ణ సుధాకర్‌ రెడ్డి, సాట్స్‌ చైర్మన్‌ అల్లిపురం వెంకటేశ్వర్‌ రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా అధ్యక్షుడు రాజేశ్వర్‌గౌడ్‌, భూత్పూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ బస్వరాజుగౌడ్‌, ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి, జెడ్పీటీసీలు రాజశేఖర్‌ రెడ్డి, ఇంద్రయ్య సాగర్‌ ఉన్నారు.