శుక్రవారం 04 డిసెంబర్ 2020
Mahabubnagar - Oct 27, 2020 , 04:10:08

ఇది పేదోళ్ల సర్కార్‌

ఇది పేదోళ్ల సర్కార్‌

  • ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

మహబూబ్‌నగర్‌: టీఆర్‌ఎస్‌ పేదోళ్ల సర్కార్‌, అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ నిరంతరం కృషి చేస్తున్నారని అబ్కారీ, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. విజయదశమిని పురస్కరించుకొని వీరన్నపేటలో ఉన్న డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల లబ్ధిదారులకు ఆదివారం జెడ్పీ పరిషత్‌ సమావేశ మందిరంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై పట్టాలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదవాడి సొంత ఇంటి స్వప్నాన్ని నిజం చేయాలని సీఎం కేసీఆర్‌ డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల పథకాన్ని చేపట్టినట్లు తెలిపారు. పట్టాలు పంపిణీ చేసిన అనంతరం మంత్రి స్వయంగా లభ్దిదారులను మాట్లాడించడానికి ప్రయత్నించగా.. భావోద్వేగానికి లోనైన మహిళ శ్రీనివాస్‌గౌడ్‌ వంటి నాయకుడు ఉన్నందు వల్లే తమకు ఇండ్లు వచ్చాయని, అలాంటి నాయకుడు దేవుడితో సమానం అని పేర్కొన్నారు. స్పందించిన మంత్రి తమ అందరికీ దేవుడు కేసీఆర్‌ అని అన్నారు. డబుల్‌రూం విషయంలో దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో దసరా పండుగా సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఆర్యసమాజంలో జరిగిన దసరా ఉత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి సతీమణి శారద, మున్సిపల్‌ చైర్మన్‌ కేసీ నర్సింహులు, వైస్‌ చైర్మన్‌ తాటిగణేశ్‌, నాయకులు గోపాల్‌యాదవ్‌, కేఎస్‌ రవికుమార్‌, కౌన్సిలర్లు రామ్‌, కోట్ల కిశోర్‌ తదితరులు పాల్గొన్నారు.