మంగళవారం 24 నవంబర్ 2020
Mahabubnagar - Oct 24, 2020 , 00:19:58

పండుగ వేళ.. వాహనయోగం

పండుగ వేళ.. వాహనయోగం

  • ఆఫర్లతో ఆకట్టుకుంటున్న కంపెనీలు
  • వ్యక్తిగత వాహనాల కొనుగోలుకు మొగ్గు
  • సంక్షోభంలోనూ ఫర్వాలేని విక్రయాలు 
  • ఆశాజనకంగా ఉందంటున్న వ్యాపారులు

లాక్‌డౌన్‌ తర్వాత వాహనరంగం కోలుకుంటోంది. కొనుగోళ్లు క్రమంగా ఊపందుకుంటున్నాయి. కరోనా నేపథ్యంలో బస్సులు, ఆటోల్లో ఎక్కేందుకు భయపడుతున్న నేపథ్యంలో వ్యక్తిగత వాహనాల  కొనుగోలుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు.  దీనికితోడు పండుగ వేళ ఆఫర్లతో వాహనయోగం కలుగుతోంది. ఈనెలలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2,275 ద్విచక్ర వాహనాలు, 203 కార్లు అమ్ముడయ్యాయి. గత నెలలో 3,807  బైక్‌లు, 322 కార్ల విక్రయాలు జరిగాయి.  దీంతో సంక్షోభంలోనూ విక్రయాలు ఫర్వాలేదనిపిస్తుండగా.. ఆశాజనకంగా ఉన్నాయంటూ వ్యాపారులు పేర్కొంటున్నారు.

-  మహబూబ్‌నగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ 

  ‘మహబూబ్‌నగర్‌కు చెందిన వెంకటేశ్‌ హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. నిత్యం రైల్లో ప్రయా ణించేవాడు. ప్రస్తుతం బస్సుల్లో వెళ్తున్నా.. కరోనా భయం వెంటాడుతున్నది. చివరికిలోన్‌ తీసుకొని ఓ కారు కొనుగోలు చేశాడు. ఇప్పుడు కారులో దర్జాగా వెళ్తున్నాడు. కాస్త భారమైనా కారు తప్పనిసరి అని చెబుతున్నాడు’..


మహబూబ్‌నగర్‌కు చెందిన రజిత ఓ ప్రైవేట్‌ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నది. నిత్యం ఆఫీసుకు ఆటోలో వెళ్లేది. కరోనా వల్ల ఆటోలో ప్రయాణించేందుకు ఇబ్బంది పడింది. కుటుంబ సభ్యుల సలహా మేరకు ఓ స్కూటీ కొనుక్కున్నది. సొంతంగా డ్రైవింగ్‌ చేసుకుంటూ ఆఫీసుకు వెళ్తున్నది..

మహబూబ్‌నగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కరోనా వేళ అన్ని వ్యాపారాలూ దెబ్బతిన్నాయి. కనీసం అద్దె, జీతాలు కూడా చెల్లించేందుకు ఇబ్బంది పడిన పరిస్థితి. క్రమంగా అన్ని వ్యాపారాలు కోలుకుంటున్నాయి. వాహనరంగం సైతం కోలుకుని ముందుకు సాగుతున్నది. అని చెప్పేందుకు రజిత ఓ ఉదాహరణగా చెప్పవచ్చు. లాక్‌డౌన్‌కు ముందు ఉన్న పరిస్థితి క్రమంగా అదుపులోకి వస్తోందని వాహనాల విక్రయాలు నిరూపిస్తున్నాయి. కరోనా వల్ల వ్యక్తిగత వాహనాల వినియోగం పెరగడంతో కొనుగోళ్లు ఊపందుకున్నాయని వాహనరంగ వ్యాపారులు అంటున్నారు. ద్విచక్ర వాహనాలు, కార్ల దుకాణాలు వినియోగదారులతో నిత్యం రద్దీగా ఉంటున్నాయి. కరోనా భయంతో బస్సులు, ఆటోలు ఎక్కడానికి ప్రజలు భయపడుతుండటంతో ప్రత్యామ్నాయంగా వ్యక్తిగత వాహనాలు కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. మహబూబ్‌నగర్‌ పట్టణంలోని ఓ ద్విచక్ర వాహనాల దుకాణంలో దసరా, దీపావళి సీజన్‌కు సుమారు 4వేల వరకు వాహనాలు విక్రయించాలని లక్ష్యంగా ఉంచుకున్నట్లు తెలిపారు. దీన్ని బట్టి చూస్తే ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు మరోవైపు రవాణా శాఖకు ఆదాయం గణనీయంగానే సమకూరుతున్నది. 

మహబూబ్‌నగర్‌లో అధికంగా..

ఉమ్మడి జిల్లాలో మహబూబ్‌నగర్‌ ఆర్టీఏ పరిధిలోనే పెద్ద ఎత్తున వాహనాలు విక్రయిస్తున్నారు. కొవిడ్‌ సీజన్‌ నేపథ్యంలో గత నెలలో మహబూబ్‌నగర్‌ (నారాయణపేట సహా) జిల్లాలో 1,664 ద్విచక్రవాహనాలు, 188 కార్లు అమ్ముడుపోయాయి. నాగర్‌కర్నూల్‌లో 828 బైక్‌లు, 59 కార్లు, వనపర్తిలో 554 బైక్‌లు, 32కార్లు, జోగుళాంబ గద్వాల జిల్లాలో 761 బైక్‌లు, 43కార్లు అమ్ముడుపోయాయి. ఈ అక్టోబర్‌లో ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2,275 ద్విచక్రవాహనాలు, 203కార్లు అమ్ముడయ్యాయి. కొన్ని రోజులుగా విక్రయించిన వాహనాల రిజిస్ట్రేషన్లు పూర్తి కానందున ఈ అక్టోబర్‌లోనూ వాహనాల రిజిస్ట్రేషన్లు గత నెలను దాటిపోయే అవకాశం ఉందని తెలుస్తున్నది. 

పండుగ సెంటిమెంట్‌..


కరోనా వల్ల వాహనాల విక్రయాలు మందగతికి చేరుకున్న విషయం వాస్తవమే. అయితే వ్యక్తిగత భద్రత కోసం చాలామంది సొంతంగా వాహనాలు కొనుగోలు చేస్తన్నారు. గతంలో బస్సుల్లో, ఆటోల్లో, ట్యాక్సీల్లో ప్రయాణించిన వారు ఇప్పుడు సొంతకార్లు, ద్విచక్రవాహనాల్లో ప్రయాణించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మహబూబ్‌నగర్‌ ఆర్టీఏ పరిధిలో గత నెలలో 1,664 బైక్‌లు, 188 కార్లు రిజిస్ట్రేషన్లు జరిగాయి. దసరా, దీపావళి సెంటిమెంట్‌తో వాహనాల అమ్మకాలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. 

- శ్రీనివాస్‌రెడ్డి, ఆర్టీవో, మహబూబ్‌నగర్‌

ఉచిత బీమా కల్పిస్తున్నాం..


కరోనా వల్ల వాహనాల విక్రయాలు భారీగా తగ్గాయి. అయితే కొన్ని రోజులుగా మళ్లీ విక్రయాలు ఊపందుకున్నాయి. దసరా, దీపావళి సందర్భంగా సుమారు 3500 వాహనాలు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికే అమ్మకాలు పెరిగాయి. దీపావళి వరకు ఈ విక్రయాలు కొనసాగుతాయని భావిస్తున్నాం. మరోవైపు వినియోగదారులను ఆకట్టుకునేందుకు 125సీసీ నుంచి అంతకంటే అధిక సీసీ ఉన్న బైక్‌లకు, అన్ని స్కూటర్లకు సుమారు 9వేల విలువైన ఉచిత ఇన్సూరెన్స్‌ ఆఫర్‌ చేస్తున్నాం.  

- దిలీప్‌, ఎండీ, అశ్విని హీరో షోరూం, మహబూబ్‌నగర్‌