గురువారం 03 డిసెంబర్ 2020
Mahabubnagar - Oct 04, 2020 , 01:43:26

ఓటరు నమోదు ప్రక్రియ వేగవంతం

ఓటరు నమోదు ప్రక్రియ వేగవంతం

జడ్చర్లటౌన్‌ : హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఓటరు నమోదు ప్రక్రియ జడ్చర్ల మండలంలో వేగవంతంగా కొనసాగుతున్నది. మండలంలోని వివిధ గ్రామాల్లో సర్పంచులు, టీఆర్‌ఎస్‌ నాయకులు ఇంటింటికెళ్లి పట్టభద్రులను కలిసి ఓటరు నమోదు చేసుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు. అలాగే పట్టభద్రుల నుంచి ఓటరు నమోదు దరఖాస్తులను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. శనివారం జడ్చర్లలో జెడ్పీ వైస్‌ చైర్మన్‌ యాదయ్య ఆధ్వర్యంలో గ్రామ పార్టీ అధ్యక్షులతో సమీక్ష నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా అన్ని గ్రామాల్లో తిరుగుతూ పట్టభద్రులను ఓటరు నమోదు కోసం చైతన్యపర్చాలని సూచించారు. ఈ సందర్భంగా పట్టభద్రుల నుంచి సేకరించిన దరఖాస్తులను ఆయా గ్రామాలకు చెందిన సర్పంచులు, టీఆర్‌ఎస్‌ నాయకులు జెడ్పీ వైస్‌చైర్మన్‌కు అప్పగించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రఘుపతిరెడ్డి, నాయకులు ఇంతియాజ్‌, శ్రీకాంత్‌, శంకర్‌నాయక్‌, ఆంజనేయులు, శ్రీను, నర్సింహులు, వీరేశ్‌, గోపాల్‌రెడ్డి, శ్రీశైలం, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఓటు నమోదు చేసుకోవాలి

బాలానగర్‌ టౌన్‌ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హులైనవారు ఓటరుగా నమోదు చేసుకోవాలని తాసిల్దార్‌ రవీంద్రనాథ్‌ అన్నారు. శనివారం తాసిల్దార్‌ కార్యాలయంలో రాజకీయ పార్టీల నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదుకు అందరూ సహకరించాలని కోరారు. గ్రామాల్లో అర్హులైన వారిని గుర్తించి ఓటరుగా నమోదు చేసుకునేలా చూడాలన్నారు. సమావేశంలో ఆయా పార్టీల నాయకులు శ్రీనివాసరావు, దీప్లానాయక్‌, తిరుపతి తదితరులు ఉన్నారు. 

పట్టభద్రులు నమోదు చేసుకోవాలి

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం : ప్రైవేటు పాఠశాలల్లో పని చేస్తున్న పట్టభద్రులందరూ ఓటు నమోదు చేసుకోవాలని ట్రస్మా రాష్ట్ర గౌరవాధ్యక్షుడు జలజం సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌ అన్నారు.  శనివారం జిల్లా కేంద్రంలో ప్రైవేటు ఉపాధ్యాయుతో ఓటరు నమోదు చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభమైందని, ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌లో లేదా తాసిల్దార్‌ కార్యాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 

ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలి

దేవరకద్ర రూరల్‌: పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకొని తమ ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలని తాసిల్దార్‌ జ్యోతి అన్నారు. శనివారం తాసిల్దార్‌ మాట్లాడుతూ 2017 అక్టోబర్‌ కంటే ముందు డిగ్రీ, ఇంజినీరింగ్‌ పాసైన పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడానికి అర్హులని తెలిపారు. నవంబర్‌ 6వ తేదీవరకు అర్హులందరూ ఓటరు నమోదు చేయించుకోవాలని సూచించారు. 

పట్టభద్రులు ఓటుహక్కు పొందాలి

రాజాపూర్‌ : మండలంలోని అర్హులైన పట్టభద్రులు ఓటుహక్కు పొందాలని తాసిల్దార్‌ శంకర్‌ అన్నారు. శనివారం తాసిల్దార్‌ కార్యాలయంలో నిర్వహించిన రాజకీయ పార్టీల నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శ్రీశైలంయాదవ్‌, బీజేపీ మండల అధ్యక్షుడు రామకృష్ణ, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు రమేశ్‌, నరహరి, యాదగిరి, విజయ్‌, శేఖర్‌, లింగం, నర్సింహులు, ఆనంద్‌ తదితరులు ఉన్నారు.