గురువారం 26 నవంబర్ 2020
Mahabubnagar - Oct 03, 2020 , 00:53:00

ఫిట్‌గా ఉందాం

ఫిట్‌గా ఉందాం

  • త్వరలోనే వాలీబాల్‌ అకాడమీ ఏర్పాటు
  • రూ.2కోట్ల 50లక్షలతో స్టేడియం అభివృద్ధి
  • ‘ఫిట్‌ తెలంగాణ రన్‌'ను ప్రారంభించిన క్రీడాశాఖ మంత్రి  శ్రీనివాస్‌గౌడ్‌
  • జనరల్‌ దవాఖానలో వైద్యులు,సిబ్బందికి సన్మానం

ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధిస్తారని, ఫిట్‌గా ఉండాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. మహబూబ్‌నగర్‌ స్టేడియంలో గాంధీజీ  చిత్రపటానికి నివాళులర్పించి, ఫిట్‌ తెలంగాణ రన్‌ను ప్రారంభించారు. రూ.2.50కోట్లతో స్టేడియం అభివృద్ధి చేస్తున్నామని, త్వరలోనే వాలీబాల్‌ అకాడమీని ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు. అనంతరం బస్టాండ్‌ సమీపంలో చేనేత మేళాను ప్రారంభించి, జనరల్‌ దవాఖానలో వైద్యులు, సెక్యూరిటీ, ఇతర సిబ్బందిని మంత్రి సన్మానించి వారి సేవలను కొనియాడారు.

- మహబూబ్‌నగర్‌/స్పోర్ట్స్‌/వైద్యవిభాగం

 మహబూబ్‌నగర్‌/స్పోర్ట్స్‌/వైద్యవిభాగం: మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో వాలీబాల్‌ అకాడమీని త్వరలోనే ఏర్పాటు చేస్తామని ఆబ్కారీ, క్రీడా శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. క్రీడాశాఖ, క్రీడాసంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక స్టేడియం మైదానంలో నిర్వహించిన ఫిట్‌ తెలంగాణ రన్‌ను మంత్రి ప్రారంభించారు. ముందుగా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రూ.2.50 కోట్లతో స్టేడియం మైదానాన్ని అభివృద్ధి చేస్తామని, రాష్ట్ర ప్రభుత్వం క్రీడాభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తుందన్నారు. ఎడ్యుకేషన్‌లో 0.5 కోటను అమలు చేస్తామని, ఎక్కడైనా కళాశాలలో క్రీడాకోటలో సీట్లు ఇవ్వకుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. క్రీడా సంఘాలతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి క్రీడాభివృద్ధిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అంతకు ముందు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సాట్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ తేజస్‌నందలాల్‌పవర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ కేసీ నర్సింహులు, వైస్‌ చైర్మన్‌ తాటిగణేశ్‌, డీవైఎస్‌వో శ్రీనివాస్‌, కౌన్సిలర్‌ రామ్‌లక్ష్మణ్‌, ఒలింపిక్‌ సంఘం జిల్లా చైర్మన్‌ కేఎస్‌ రవికుమార్‌, సెక్రటరీ రాజేంద్రప్రసాద్‌, క్రీడా సంఘాల ప్రతినిధులు రాములు, టోనీమార్టీన్‌, అమరేందర్‌రాజు, ఖాజాఖాన్‌, శ్రీరాములు, జియాఉద్దీన్‌, నర్సింహులు, గజానంద్‌, బాలరాజు, జగన్‌మోహన్‌గౌడ్‌, కోచ్‌లు సునీల్‌, ఖలీల్‌, అంజద్‌ తదితరులు పాల్గొన్నారు.
జంక్షన్‌ పనులకు శంకుస్థాపన..
జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్‌వో కార్యాలయం సమీపంలోని జంక్షన్‌ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. బస్టాండ్‌ సమీపంలోని చేనేత మేళాను ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పిలుపునిచ్చారు. జెడ్పీ సమావేశ మందిరంలో సనాతన సారథి సంస్థ ఆధ్వర్యంలో ప్రభులింగశాస్త్రి రచించిన దాంపత్యం, శ్రీకాంత్‌ రచించిన పుస్తకాలను ఆయన ఆవిష్కరించారు. అనంతరం 87 మంది దివ్యాంగులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఇటీవల 50 మంది దివ్యాంగులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినట్లు మంత్రి తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు, జెడ్పీ చైర్మన్‌ స్వర్ణసుధాకర్‌రెడ్డి, సనాతన సారథి సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు బాల్‌రాజ్‌, పుస్తక సమీక్షకులు డా.మహంతయ్య, సంస్థ కార్యదర్శి సనాతన బాలస్వామి, అనువాదకుడు జలజం సత్యనారాయణ, బాగన్నగౌడ్‌ పాల్గొన్నారు. 

నిమ్స్‌ తరహాలో తీర్చిదిద్దుతా 


మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ దవాఖానను ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌ తరహాలో తీర్చిదిద్దడమే లక్ష్యమని ఎక్సైజ్‌ శాఖ మంత్రి డాక్టర్‌ వి. శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. శుక్రవారం జిల్లా జనరల్‌ దవాఖానలో వైద్యులు, శానిటేషన్‌ వర్కర్లను సన్మానించారు. అనంతరం దవాఖానకు అందజేసిన రెండు నూతన వెంటిలేటర్లను మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ నర్సిములు, అదనపు కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌, దవాఖాన సూపరింటెండెంట్లు డాక్టర్‌ రాంకిషన్‌, డిప్యూటీ సూపరింటెండెంట్‌ డా.జీవన్‌ పాల్గొన్నారు.