గురువారం 29 అక్టోబర్ 2020
Mahabubnagar - Oct 02, 2020 , 03:18:46

ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు?

ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు?

  • ఒక్కసారి ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుందాం
  • భవిష్యత్‌లో ఇబ్బందులు లేకుండా చేద్దాం
  • ఎల్‌ఆర్‌ఎస్‌పై పూర్తి స్థాయిలో అవగాహన

  • అక్రమ లేఅవుట్లలో పది శాతం రిజిస్ట్రేషన్లు తప్పని సరి

ఎల్‌ఆర్‌ఎస్‌..ఇప్పుడు అందరూ వింటున్న పదం..తెలియాల్సిన అంశం..తెలుసుకోవాల్సిన సందర్భం. తెలిసీ..తెలియక చాలా మంది అక్రమ లేఅవుట్లలో ప్లాట్లు కొని ఉంటారు. అయితే అలాంటి వాటికి బ్యాంక్‌ లోన్‌ సమయంలోకాని, విక్రయించాలనుకున్నప్పుడుగాని, సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి వాటికి భవిష్యత్‌లో ఇబ్బందులు పడకుండా అక్రమ లేవుట్లను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం కల్పించిన అవకాశం ఈనెల 15తో ముగియనున్నది. పట్టణ కేంద్రాలకు పరిమితమైన వెసులుబాటు పల్లెలకు కూడా కల్పించడంతో అధికార యంత్రాంగం గ్రామాల్లో సర్వే చేపట్టింది. ప్రజలు కూడా తమవంతుగా పూర్తి వివరాలు అధికారులకు తెలియజేసి ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

వనపర్తి, నమస్తే తెలంగాణ/మహబూబ్‌నగర్‌ : ఇక గ్రామపంచాయతీల దశ మారనున్నది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన చట్టాలతో అధిక నిధులు సమకూరనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న నిధులకు తోడు స్థానికంగానూ ఆదాయం లభించనున్నది. జీపీలు ఇది వరకు అందించే జనన, మరణ, వివాహ ధ్రువీకరణ ప్రతాలకు తోడు ఇక నుంచి కుల, ఆదాయ పత్రాలు కూడా అందించనున్నారు. దీంతోపాటు గ్రామాల్లో కూడా ఎల్‌ఆర్‌ఎస్‌ను అమలు చేయనున్నది. ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన సంస్కరణలతో గ్రామపంచాయతీలు ఆర్థికంగా అభివృద్ధి చెందనున్నాయి. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు, లంచాలను పూర్తిగా అరికట్టేందుకు, పరిపాలన సుగమం చేసేందుకు సీఎం కేసీఆర్‌ నూతన చట్టాలను అమలు చేస్తున్నారు. గతంలో ఉన్న వాటిని మార్చి నూతన చట్టాలను అమలుచేస్తూ పెనుమార్పులకు నాంది పలుకుతున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాలతో జీపీలకు మహర్దశ పట్టనున్నది. 

ఇది వరకు సమకూరుతున్న నిధులు..

ప్రస్తుతం ఉన్న సదుపాయాల ప్రకారం గ్రామపంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అధికంగా నిధులు సమకూరుతున్నాయి. స్టేట్‌ ఫైనాన్స్‌ కమిషన్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నిధులు, 15వ ఫైనాన్స్‌ కమిషన్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుతున్నాయి. వీటితోపాటు ఇంటి పన్ను, క్వారీలు, ఇసుక రీచ్‌, భవన నిర్మాణ అనుతుల ద్వారా ఆదాయం సమకూరుతున్నది. ఈ నిధుల ద్వారా గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వివిధ రకాల పథకాలు అమలు చేసేందుకు, పారిశుధ్య పనులు నిర్వహించేందుకు వీటిని వినియోగిస్తున్నారు. 

నూతన చట్టాలతో అధిక ఆదాయం..

గ్రామపంచాయతీల్లో నూతన చట్టాలు అమలు చేస్తున్నందున అధిక ఆదాయం సమకూరనున్నది. ఇది వరకు తాసిల్దార్‌ కార్యాలయాల ద్వారా జారీ చేస్తున్న కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఇక నుంచి జీపీల నుంచే అందించనున్నారు. పంచాయతీ కార్యదర్శి ద్వారా సులభంగాధ్రువపత్రాలను పొందే సదుపాయాలను కల్పించారు. ముఖ్యంగా గతంలో జీపీల పరిధిలో లేని ఎల్‌ఆర్‌ఎస్‌ను కూడా అమలు చేస్తున్నారు. స్టిరాస్థి రిజిస్ట్రేషన్లకు గ్రామపంచాయతీల అనుమతి తప్పనిసరి చేస్తూ చట్టాలను తీసుకురావడంతో పాత బకాయిలు భారీగా వసూలు కానున్నాయి. 

మహబూబ్‌నగర్‌లో 486 అక్రమ లే అవుట్లు..

మహబూబ్‌నగర్‌ జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీల పరిధిలో 486 అక్రమ లేఅవుట్ల ఉన్నట్లు జిల్లా పం చాయతీ అధికారులు గుర్తించారు. ఈ అక్రమ లేఅవుట్ల లో 10 శాతం ప్లాట్లు 28-08-2020 లోగా తప్పనిసరి గా రిజిస్ట్రేషన్లు అయ్యి ఉండాలని జీవో నెంబర్‌ 135 చె బుతుంది. నిబంధనల మేరకు అధికారులు లేఅవుట్లను పరిగణలోకి తీసుకుంటూ రిజిస్ట్రేషన్లు చేసుకున్న వారి స మాచారం సేకరించి ప్రత్యేకంగా ఫోన్‌లు చేసి ఎల్‌ఆర్‌ఎస్‌ ను తప్పనిసరిగా చేయాలని పేర్కొంటున్నారు. అక్రమ లేఅవుట్లతోపాటు రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వివిధ ప్లాట్ల విషయంలో ప్రజలకు ఎల్‌ఆర్‌ఎస్‌పై పూర్తి స్థాయి లో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కరపత్రాలు, ఫ్లెక్సీలు, టాంటాం వేయిస్తున్నారు. 

 ప్రతి ఒక్కరూ  ఎల్‌ఆర్‌ఎస్‌ చేసుకోవాలి..


 రిజిస్ట్రేషన్లు చేసుకున్న  ప్రతి ఒక్కరూ ఎల్‌ఆర్‌ఎస్‌ తప్పనిసరిగా చేసుకోవాలి. భవిష్యత్‌లో మీ ప్లాట్లను  విక్రయించాలి అనుకుంటే కచ్చితంగా ఈ నెల 15వతేదీలోగా రూ.1000 చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. తరువాత మీరు చెల్లించే ఎల్‌ఆర్‌ఎస్‌ డబ్బుల్లో ముందుగా చెల్లించిన డబ్బులు తీసివేసి  మిగిలిన వాటిని చెల్లించాల్సి ఉంటుంది. ప్రజలకు ఎలాంటి సందేహాలు ఉన్నా పంచాయతీ కార్యదర్శిని అడిగి తెలుసుకోవాలి. 

- వెంకటేశ్వర్లు, డీపీవో, మహబూబ్‌నగర్‌ 


logo