బుధవారం 28 అక్టోబర్ 2020
Mahabubnagar - Sep 27, 2020 , 07:02:46

30 నుంచి బీఈడీ పరీక్షలు

30 నుంచి బీఈడీ పరీక్షలు

  • పీయూ రిజిస్ట్రార్‌ పవన్‌కుమార్‌

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం : పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలో ఈనెల 30వ తేదీ నుంచి బీఈడీ, బీపెడ్‌ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని రిజిస్ట్రార్‌ పిండి పవన్‌కుమార్‌ ఆదేశించారు. శనివారం పీయూలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఈడీ పరీక్ష నిర్వహణకు కావాల్సిన సామగ్రిని సిద్ధం చేయాలని సూచించారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి డిగ్రీ విద్యార్థులకు అవకాశమిచ్చినట్లుగానే బీఈడీ, బీపెడ్‌ విద్యార్థులకు చదువుకున్న కళాశాలల్లోనే సెల్ఫ్‌ సెంటర్‌లో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. నాల్గో సెమిస్టర్‌ రెగ్యూలర్‌, బ్యాక్‌లాగ్‌, రెండు, మూడో సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ పరీక్షల టైం టేబుల్‌ను విడుదల చేశామన్నారు. ఈనెల 30 నుంచి వచ్చే నెల 10 వరకు జరిగే బీఈడీ పరీక్షలకు 3,126 మంది అభ్యర్థులు, వచ్చే నెల 5 నుంచి 13 వరకు కొనసాగే బీపెడ్‌ పరీక్షలకు 289 మంది హాజరు కానున్నారని తెలిపారు. కొవిడ్‌-19 నిబంధనల ప్రకారం విద్యార్థులు మాస్కులు ధరించి, శానిటైజర్‌, వాటర్‌ బాటిల్‌ తీసుకొని హాజరుకావాలని సూచించారు. సమావేశంలో పరీక్షల నియంత్రణ అధికారి నాగం కుమారస్వామి, రాజ్‌కుమార్‌, శ్రీనాథాచారి, వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు, కరస్పాండెంట్లు పాల్గొన్నారు. 

30న గురుకుల కళాశాల ప్రవేశ పరీక్ష

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం : మహాత్మా జ్యోతిబాఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశం కోసం ఈనెల 30న పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా ప్రాంతీయ సమన్వయకర్త లింగయ్య ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 19 జూనియర్‌ కళాశాలల్లో 12 బాలుర, 7 బాలికలు, ఒక మహిళా డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఉమ్మడి జిల్లాలో 47 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మొత్తం 7,722 విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని పేర్కొన్నారు. విద్యార్థులు గంట ముందు కేంద్రాల వద్దు చేరుకోవాలని, కొవిడ్‌-19 నిబంధనలు పాటించాలని సూచించారు. logo