గురువారం 03 డిసెంబర్ 2020
Mahabubnagar - Sep 27, 2020 , 07:02:58

చినుకై.. వ‌ర‌దై

చినుకై.. వ‌ర‌దై

  • ఉమ్మడి జిల్లాలో ఏకధాటిగా వర్షం
  • పొంగిపొర్లిన వాగులు, వంకలు
  • మత్తడి దుంకిన చెరువులు, కుంటలు
  • పలుచోట్ల నిలిచిపోయిన రాకపోకలు
  • కూలిన ఇండ్లు, నీటమునిగిన పంటలు
  • గొండ్యాల వాగులో వృద్ధుడి గల్లంతు

  ఉమ్మడి జిల్లాను వరుణదేవుడు వదలడం లేదు. రెండ్రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లు తున్నాయి. రోడ్లు కోతలకు గురవడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు లమయమయ్యాయి. మట్టి మిద్దెలు కూలిపడగా.. పంటలు నీట మునిగాయి. హన్వాడ మండలం గొండ్యాల సమీపంలోని వాగులో వృద్ధుడు గల్లంతయ్యాడు. 

కొన్ని చోట్ల వాగుల్లో చిక్కుకున్న వారిని స్థానికులు తాళ్ల సాయంతో ఒడ్డుకు చేర్చారు. భూత్పూరు మండలం పోతులమడుగు వాగులో ఆటో ట్టుకుపోయింది. మహబూబ్‌నగర్‌లో లోతట్టు ప్రాంతాల్లో కలెక్టర్‌ వెంకట్రావుతో కలిసి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పర్యటించారు. అనంతరం గొండ్యాల వాగునూ పరిశీలించారు. 

- మహబూబ్‌నగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ

మహబూబ్‌నగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చాలా చోట్ల రోడ్లపై వరద ప్రవహిస్తున్నది. మహబూబ్‌నగర్‌- నవాబ్‌పేట, వనపర్తి జిల్లా కొత్తకోట- ఆత్మకూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రాయచూరు ప్రధాన రహదారిపై మరికల్‌ వద్ద భారీగా వర్షం నీరు నిలిచిపోవడంతో కొంత సేపు రాకపోకలు ఆగిపోయాయి. నారాయణపేట జిల్లాలో అక్కడక్కడ పాత మట్టి మిద్దెలు కూలాయి. కోస్గిలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కోయిల్‌కొండ, నవాబ్‌పేట, గండీడ్‌, హన్వాడ మండలంలోని వాగులు, వంకలు ఉధృతంగా పారడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దేవరకద్ర మండలం కౌకుంట్ల పెద్ద చెరువు పూర్తిగా నిండి అలుగు పారుతుండడంతో కౌకుంట్ల, ఇస్రంపల్లి గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నందిన్నె వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మట్టిరోడ్డు కొట్టుకుపోవడంతో రెండు రాష్ర్టాల మధ్య రాకపోకలు ఆగిపోయాయి.  అల్వాలపాడు, మైలగడ్డ స్టేజి, పాతపాలెం, వెంకటాపురం, ఇర్కిచేడు, అర్సిగేరి మీదుగా వాహనాలను దారి మళ్లించారు.  మహబూబ్‌నగర్‌ పట్టణంలోని లోతట్టు ప్రాంతాలైన రామయ్యబౌలి, భగీరథకాలనీ, గణేశ్‌నగర్‌, బృందావన్‌కాలనీ, ఎంబీసీ కాంప్లెక్స్‌, బీకేరెడ్డి కాలనీలు జలమయమయ్యాయి. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, కలెక్టర్‌ వెంకట్రావు తదితర అధికారులు ఆ ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని గమనించారు. సమస్య లేకుండా చూడాలని మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ జోగుళాంబ గద్వాల జిల్లా ఆలంపూర్‌, వనపర్తి జిల్లాలో రైతులు తలపెట్టిన ట్రాక్టర్‌ ర్యాలీలు వాయిదా వేసుకున్నారు. మరోవైపు ఆదివారం తలపెట్టిన మహబూబ్‌నగర్‌, దేవరకద్ర, జడ్చర్ల నియోజకవర్గాల ట్రాక్టర్‌ ర్యాలీలను సైతం వర్షం ప్రభావం వల్ల వాయిదా వేసుకున్నట్లు రైతులు వెల్లడించారు. ఉమ్మడి జిల్లాలో కురుస్తున్న వర్షాలకు అధికార యంత్రాంగం అప్రమత్తమైనది. వాగులు పొంగిపొర్లుతున్న ప్రాంతాల్లో సిబ్బందిని పంపించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలను చేపడుతున్నారు. వాగులను దాటే ప్రయత్నం చేయొద్దని ప్రజలకు సూచిస్తున్నారు.

నేడు, రేపు మోస్తరు వాన

ఉపరితల ద్రోణి ప్రభావం వల్ల నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీని ప్రభావంతో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఉమ్మడి జిల్లాలో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.