శుక్రవారం 30 అక్టోబర్ 2020
Mahabubnagar - Sep 27, 2020 , 07:02:58

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

  •  నాలాలపై  అక్రమ నిర్మాణాలను కూల్చాలి
  • జలమయమైన  ప్రాంతాలను గుర్తించండి
  • సెల్లార్‌ను వాహనాల పార్కింగ్‌కు ఉపయోగించాలి
  • ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌
  • పాలమూరులో లోతట్టు ప్రాంతాల్లో పర్యటన

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ : ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎక్సైజ్‌, క్రీడాశాఖ మం త్రి శ్రీనివాస్‌గౌడ్‌ సూచించారు. జిల్లా కేంద్రం లో భారీ వర్షానికి జలమయమైన రామయ్యబౌలి, బీకేరెడ్డి కాలనీ, భగీరథ కాలనీ, గణేశ్‌నగర్‌, బృందావన్‌ కాలనీ, ఎంబీసీ కాంప్లెక్స్‌ ప్రాంతాల్లో శనివారం కలెక్టర్‌ వెంకట్రావుతో కలిసి మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. నాలాలపై నిర్మించిన అక్రమ కట్టడాలను వెంటనే కూల్చివేయాలని ఆదేశించారు. గతంలో రామయ్యబౌలి ప్రాంతంలో నాలాపై నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేయడంతో వరద ప్రభావం చాలావరకు తగ్గిందన్నారు. ఎక్కడైనా నాలాలను ఆక్రమిస్తే ప్రజలు అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఆక్రమణలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వర్షాల కారణంగా ప్రజలకు ఎలాం టి ఇబ్బందులు తలెత్తకుండా పారిశుధ్యం, సహాయక చర్యలు యుద్దప్రాతిపదికన చేపట్టాలని సూచించారు. కాగా, ఎంబీసీ కాంప్లెక్స్‌లో వర్షపునీరు చేరిన సెల్లార్‌ను మంత్రి పరిశీలించారు. సెల్లార్లను వాహనాల పార్కింగ్‌కు మాత్రమే ఉపయోగించుకోవాలని, పైఅంతస్తుల్లో షాపులు నిర్వహించుకోవాలని సూచించారు. బండ్లగేరి చౌరస్తాలో రోడ్డు విస్తరణ పనులు, డీఎంహెచ్‌వో ప్రహరీని కలర్‌ పెయిటింగ్‌ తదితర హంగులతో సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. అనంతరం క్లాక్‌టవర్‌లో చౌరస్తా పనులను మంత్రి పరిశీలించారు. 

గల్లంతైన వ్యక్తి కుటుంబానికి పరామర్శ

హన్వాడ : మండలంలోని గొండ్యాల గ్రామానికి చెందిన కావలి రాములు ప్రమాదవశాత్తు గ్రామ సమీపంలోని వాగులో గల్లంతయ్యాడు. విషయాన్ని తెలుసుకున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అతడి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం రాములు గల్లంతైన వాగును పరిశీలించారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృం దం సహాయంతో గల్లంతైన వ్యక్తిని కాపాడాలని అధికారులను ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్‌ తేజస్‌ నండ్లాల్‌ పవార్‌, డీఆర్డీవో వెంకట్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మ న్‌ కేసీ నర్సింహులు, వైస్‌ చైర్మన్‌ తాటి గణేశ్‌, ఎంపీపీ బాలరాజు, కమిషనర్‌ సురేందర్‌, ఎంపీడీవో నటరాజ్‌, కౌన్సిలర్లు కట్టా రవికిషన్‌రెడ్డి, ముస్తాక్‌ రషీద్‌, వేదవ్రత్‌, రామ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కరుణాకర్‌గౌడ్‌, కార్యదర్శి శ్రీనివాసులు, సర్పంచ్‌ వెంకట య్య, ఎంపీటీసీ వడ్ల శేఖర్‌, అమర్‌, ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.