ఆదివారం 29 నవంబర్ 2020
Mahabubnagar - Sep 22, 2020 , 01:17:25

చిన్నారులందరికీ నులిపురుగుల నివారణ మాత్రలు

చిన్నారులందరికీ నులిపురుగుల నివారణ మాత్రలు

నారాయణపేట టౌన్‌ : జిల్లాలోని పాఠశాలల విద్యార్థు లు, అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులందరికీ నులిపురుగుల మాత్రలు వేయించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ హరిచందన అధికారులను ఆదేశించారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని పురస్కరించుకొని జిల్లా లో అక్టోబర్‌ 5 నుంచి 12వ తేదీ వరకు ఆల్బెండజోల్‌ మా త్రల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నా రు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా కో ఆర్డినేషన్‌ కమిటీ సమావేశంలో వివిధ శాఖల అధికారులతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా  కలెక్టర్‌ మాట్లాడుతూ కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ జిల్లాలోని 1-19 ఏండ్ల లోపు ఉన్న వారికి ఆల్బెండజోల్‌ మాత్రలను వేయించాలన్నారు. బడికి వెళ్లని చిన్నారులను గుర్తించి వేసేలా ఆశవర్కర్లు, ఏఎన్‌ఎంలకు అవగాహన కల్పించాలని సూచించారు. 

అనారోగ్యం ఉన్న చిన్నారులకు మాత్రలు వేయొద్దన్నారు. సీడీపీవోలతో సమావేశం ఏర్పాటు చేసుకోవాలని, వాట్సాప్‌ గ్రూపుల ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలన్నారు. అనంతరం డీఎంహెచ్‌వో జయచంద్ర మోహ న్‌ మాట్లాడుతూ జిల్లాలో 1,61,915 మంది చిన్నారులకు ఆల్బెండజోల్‌ మాత్రలు వేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి డాక్టర్‌ శైలజ మాట్లాడుతూ ఆల్బెంజడోల్‌ మాత్రల వల్ల ఎలాంటి దుష్పలితాలు కలుగవన్నారు. 1 నుంచి రెండేండ్ల లోపు చిన్నారులకు అర మాత్రను, 2-3 ఏండ్ల మధ్య ఉన్న వారికి ఒక మాత్ర పొడి చేసి నీటితో కలిపి మింగించాలన్నా రు.  3-19 ఏండ్లలోపు వారికి ఒక మాత్రను మింగించాలన్నారు. కొవిడ్‌ లక్షణాలు ఉన్న వారికి మాత్రలు వేయొద్దన్నారు. కార్యక్రమంలో శిశు, సంక్షేశాఖ శాఖాధికారి జైపాల్‌రెడ్డి, పంచాయతీ అధికారి మురళి, ప్రోగ్రాం అధికారులు సిద్దప్ప, రాఘవేందర్‌, రవీందర్‌, హెల్త్‌ సూపర్‌వైజర్‌ గోవిందరాజు, ప్రిన్సిపాళ్లు, హెచ్‌ఎంలు పాల్గొన్నారు.   

ప్రభుత్వ స్థలాల్లోనే నర్సరీల ఏర్పాటు

ప్రతి గ్రామంలోని ప్రభుత్వ స్థలాల్లోనే నర్సరీలను ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. పార్కుల పక్కనే నర్సరీలు కనిపించే విధంగా ఏర్పాటు చేయాలన్నారు. పట్టణంలోని కలెక్టర్‌ కార్యాలయం నుంచి అన్ని మండలాల ఎంపీవోలు, పంచాయతీ సెక్రటరీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడాన్ని ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు వారి వారి గ్రామాల్లోని ప్రభుత్వ భూములను గుర్తించాలని, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఎంపీవోలు రైతులతో మాట్లాడి పల్లె ప్రకృతి వనాలను త్వరితగతిన పూర్తి చేసేలా గ్రామాల్లో టాంటాం వేయించాలని సూచించారు. నాటిన ప్రతి మొక్కకూ జియో ట్యాగింగ్‌ తప్పని సరి అన్నారు. భూ సంబంధిత సమస్యలు ఉంటే పంచాయతీ అధికారిని సంప్రదించి సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. డంపింగ్‌ యార్డు, క్రిమిటోరియం, నర్సరీలు, ప్రకృతి వనాల పనులలో జాప్యం లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్డీవో కాళిందిని, డీపీవో మురళి, ఏపీడీ సరళ తదితరులు పాల్గొన్నారు.