మంగళవారం 20 అక్టోబర్ 2020
Mahabubnagar - Aug 18, 2020 , 02:26:38

పుట్టి మునక

పుట్టి మునక

  • g     కృష్ణానదిలో నలుగురు గల్లంతు
  • g     9 మందిని కాపాడిన మత్స్యకారులు
  • g     అందరూ కర్ణాటకకు చెందిన వారే.. 
  • g     మక్తల్‌ వచ్చి తిరిగి వెళ్తుండగా ఘటన
  • g     మరో ఐదు నిమిషాలైతే గమ్యస్థానానికి..
  • g     రాయిచూర్‌ ఎమ్మెల్యేతో ఫోన్లో 
  •          మాట్లాడిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ 
  • g     తుంగభద్ర నదిలో మరొకరు..

మరో ఐదు నిమిషాలైతేగమ్యస్థానాలకు చేరేవారు.. కానీ అంతలోనేవిధి వంచించింది. పుట్టి మునిగి పోవడంతో అందులోని నలుగురు గల్లంతు కాగా.. మరో 9 మందిని మత్స్యకారులు రక్షించిన ఘటన కర్ణాటకలోని రాయిచూర్‌ జిల్లా యాపల్‌ దిన్నె మండలం కురుమపురం సమీపంలో చోటు చేసుకున్నది. గల్లంతైన వారిలో సుమలత (24), రోజా (9), చిన్నక్క (35), నర్సమ్మ (28) ఉన్నారు. వీరందరూ కర్ణాటకకు చెందిన వారే.. మక్తల్‌కు నిత్యావసర సరుకుల కొనుగోలు నిమిత్తం వచ్చి తిరిగి వెళ్తుండగా సంఘటన చోటుచేసుకున్నది. వెంటనే అధికారులు అప్రమత్తమై గాలింపు చర్యలు చేపట్టారు.  మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ రాయిచూర్‌ ఎమ్మెల్యేతో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా తుంగభద్ర నదిలో మరో యువకుడు గల్లంతయ్యాడు. 


మహబూబ్‌నగర్‌ ప్రతినిధి/నమస్తే తెలంగాణ/మక్తల్‌ రూరల్‌ : మరో 5  నిమిషాల్లో ఇంటికి చేరుతామనే సమయంలో కృష్ణానదిలో పుట్టి బోల్తాపడిన ఘటనలో కర్ణాటకకు చెందిన నలుగురు గల్లంతయ్యారు. మరో 9 మందిని మత్స్యకారులు కాపాడారు. మిగతా వారికి కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. గల్లంతైన వారిలో ముగ్గురు మహిళలు, 8 ఏండ్ల చిన్నారి ఉన్నా రు. నది మధ్యలో ఉన్న దీవి గ్రామమైన కర్ణాటకకు చెందిన కురుమపురం నుంచి స్థానికులు 13 మంది సోమవారం ఉదయం పుట్టిలో మక్తల్‌ వైపునకు వచ్చారు. పనులు ముగించుకున్న తర్వా త సాయంత్రం తిరిగి వెళ్తుండగా..  కొన్ని నిమిషాల్లో నది దాటి గ్రామానికి చేరుకునే సమయంలో కర్ణాటకలోని రాయిచూర్‌ జిల్లా యాపల్‌ దిన్నె మండలం కురుమపురం సమీపంలో పుట్టి బోల్తా పడింది. ఈ సమయంలో 13 మంది ఉండగా... అందు లో అంతా గల్లంతయ్యారు. పుట్టి గల్లంతైన విషయాన్ని గుర్తించి న మక్తల్‌ మండలం పంచదేవ్‌ పహాడ్‌, పసుపుల గ్రామాలకు చెందిన మత్స్యకారులు శ్రీపాద్‌, నర్సింహ, ఆది, ఆంజనేయులు, పాండు, చందు, ఈదన్న రెండు పుట్టీల్లో నదిలోకి వెళ్లారు. అతి కష్టం మీద దళపతి, పుట్టి అంజప్ప, నాగప్ప, బుడ్డోడు, తిమ్మన్న, మోహన్‌, చిన్న నాగేషు, విష్ణు, అమ్మక్కను కాపాడారు. కానీ సుమలత (24), రోజా (9), చిన్నక్క (35), నర్సమ్మ (28)ను కాపాడలేకపోయారు. నాటు పడవలో నది దాటుతూ ప్రమాదం జరగడంతో గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు జరపడం  కష్టంగా మారింది. సోమవారం సాయంత్రం 5 గంటల ప్రాంతం లో ఘటన చోటు చేసుకోగా... సమాచారం అందుకున్న ఎస్పీ చేతన, ఆర్డీవో చీర్ల శ్రీనివాసులు, సీఐ శంకర్‌, ఎస్సై రాములు సిబ్బంది, పసుపుల సర్పంచ్‌ దత్తప్ప ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గాలింపు చర్యలు వీలు కాలేదు. ఘటనా స్థలానికి రాయిచూర్‌ ఎస్పీ, అధికారులు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. 

కండ్ల ముందే భార్య, కూతురు గల్లంతు

పుట్టి బోల్తా పడిన ఘటనలో దంపతులు విష్ణు, సుమలత (40), వారి కూతురు రోజా (8) ఉన్నారు. పుట్టి తిరగబడి బోల్తా పడిన వెంటనే విష్ణు తన భార్య, కూతురును కాపాడేందుకు విఫలయత్నం చేశాడు. కానీ ఇద్దరూ కండ్ల ముందే గల్లంతయ్యారని కన్నీరుమున్నీరయ్యాడు. నా బిడ్డ ముందుగానే కొట్టుకుపోయింది.. కనీసం భార్యను అయినా కాపాడుకుందామని చివరి వరకు ప్రయత్నం చేసినా లాభం లేకపోయిందని విష్ణు కన్నీటి పర్యంతమయ్యాడు. 

రాయిచూరు ఎమ్మెల్యేతో మాట్లాడిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

పుట్టి ప్రమాద ఘటనపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హైదరాబాద్‌ నుంచి నారాయణపేట జిల్లా అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ రాయిచూరు కలెక్టర్‌, ఎస్పీ, ఎమ్మెల్యే శివరాజ్‌పాటిల్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందంతో గాలింపు చేపట్టాలని సూచించారు. 


logo