మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Mahabubnagar - Aug 10, 2020 , 02:32:15

ఇంటి అనుమ‌తులు మ‌రింత సులువు

ఇంటి అనుమ‌తులు మ‌రింత సులువు

  • పంద్రాగస్టు నుంచి టీఎస్‌ బీపాస్‌ 
  • 75 గజాలకు అనుమతి నో..
  • రూపాయి చెల్లిస్తేనే భవన రిజిస్ట్రేషన్‌ పత్రం జారీ
  • 21 రోజుల్లోనే అనుమతి
  • కలెక్టర్‌ అధ్యక్షతన కమిటీతో బహుళ అంతస్తులకు అనుమతులు
  • టాస్క్‌ఫోర్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌  బృందాల తనిఖీలు 

ఇకపై ఇంటి నిర్మాణ అనుమతి మరింత సులువు కానున్నది. పంద్రాగస్టు నుంచి టీఎస్‌-బీపాస్‌ విధానం రాష్ట్రమంతా అమలయ్యే అవకాశాలు ఉన్నాయి.పారదర్శకంగా అనుమతులు మంజూరు చేసేందుకు తెలంగాణ సర్కారు ఈ విధానాన్ని తీసుకురానున్నది. దీంతో దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లోనే ఇంటి నిర్మాణ అనుమతులు మంజూరు చేయనున్నారు. అయితే 75 గజాల్లోపువాటికి అనుమతి అవసరం లేదు.  కేవలం రూపాయి చెల్లిస్తే రిజిస్ట్రేషన్‌ పత్రం వస్తుంది. బహుళ అంతస్తుల నిర్మాణాల అనుమతులను కలెక్టర్‌ అధ్యక్షతన ఏర్పాటయ్యే కమిటీ మంజూరు చేయనున్నది. క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసేందుకు టాస్క్‌ఫోర్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలను ఏర్పాటు చేయనున్నారు. 

- మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ 


మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ : ఇక నుంచి ఇంటి నిర్మాణ అనుమతి సులభతరం కానున్నది. పారదర్శకంగా ఇంటి నిర్మాణ అనుమతులు మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం టీఎస్‌-బీపాస్‌ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నది. గతంలో మాదిరిగా మున్సిపల్‌ కార్యాలయం చుట్టూ తిరగకుండా ఇంటి నుంచి అనుమతులను టీఎస్‌ బీపాస్‌ విధానంతో పొందేలా ప్రణాళిక రూపొందించారు. నూతన విధానంతో దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లో ఇంటి నిర్మాణ అనుమతి లభించనున్నది. ఇందుకు సంబంధించి మూడు రోజుల కిందట టీఎస్‌-బీపాస్‌కు రాష్ట్ర క్యాబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. ఆగస్టు15 నుంచి రాష్ట్రమంతా టీఎస్‌ బీపాస్‌ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. 75 గజాలలోపు ఇంటి నిర్మాణం చేసుకునే వారికి ఎలాంటి అనుమతి అవసరం లేదని టీఎస్‌ బీపాస్‌ ద్వారా ప్రభుత్వం ప్రకటించింది. కేవలం  ఒక రూపాయి చెల్లిస్తే వెంటనే భవన నిర్మాణ రిజిస్ట్రేషన్‌ జారీ అవుతుంది. బహుళ అంతస్తుల నిర్మాణ అనుమతులను కలెక్టర్‌ అధ్యక్షతన ఏర్పాటయ్యే టీఎస్‌ బీపాస్‌ కమిటీ మంజూరు చేయనున్నది. క్షేత్రస్థాయిలో తనిఖీల కోసం టాస్క్‌ఫోర్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలను ఏర్పాటు చేయనున్నారు. అయితే, ఇప్పటికి వరకు భవన నిర్మాణాల అనుమతుల జారీలో కీలకంగా వ్యవహరించిన మున్సిపల్‌ శాఖకు ప్రస్తుతం కొత్తగా అమలు చేసే టీఎస్‌ బీపాస్‌లో ఎలాంటి పాత్ర లేకపోవడం గమనార్హం.

21 రోజుల్లో అనుమతి..

టీఎస్‌ బీపాస్‌ విధానంతో ఎలాంటి నిర్మాణానికైనా 21 రోజుల్లో అనుమతి లభించనున్నది. 21 రోజులు దాటిన తర్వాత పెండింగ్‌లో ఉన్నా అనుమతి ఇచ్చినట్టుగానే భావించాలని నిబంధన పెట్టారు. 21 రోజుల తర్వాత ఆన్‌లైన్‌లో అనుమతి పత్రాన్ని దరఖాస్తుదారుడు తీసుకునే అవకాశం ఉంటుంది. బహుళ అంతస్తుకు టీఎస్‌ బీపాస్‌ అనుమతి ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన కమిటీలో కలెక్టర్‌, కమిషనర్‌, రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్‌, పోలీసు శాఖల అధికారులు సభ్యులుగా ఉంటారు. టీఎస్‌ బీపాస్‌లో దరఖాస్తు చేసుకున్న వెంటనే కమిటీలో ఉన్న ఆయా శాఖల అధికారుల లాగిన్‌లోకి వెళ్తుంది. వారు దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి అనుమతి ఇవ్వనున్నారు

టోల్‌ఫ్రీ నెంబర్‌ ఏర్పాటు

భవన నిర్మాణ అనుమతుల్లో ఇబ్బందులు ఉంటే ఫిర్యాదులు చేసేలా టోల్‌ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేశారు. భవన నిర్మాణ అనుమతుల్లో ఇబ్బందులు కలిగితే వెంటనే టీఎస్‌ బీపాస్‌ టోల్‌ఫ్రీ నెంబర్‌ 22666666కు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. భవన నిర్మాణ అనుమతులు సులభంగా, పారదర్శకంగా మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం టీఎస్‌ బీపాస్‌ను అమల్లోకి తీసుకువస్తున్నది.  

రూపాయి చెల్లిస్తే 

రిజిస్ట్రేషన్‌ పత్రం

టీఎస్‌ బీపాస్‌ విధానంతో పేదలకు ఇంటి నిర్మాణం మరింత సులభతరం కానున్నది. 75 గజాల స్థలంలో జీప్లస్‌-1 వరకు ఇంటిని నిర్మించుకునే వారికి ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్‌ పత్రాలు టీఎస్‌ బీపాస్‌ సైట్‌లో అప్‌లోడ్‌ చేసి ఒక రూపాయి చెల్లిస్తే వెంటనే భవన నిర్మాణ రిజిస్ట్రేషన్‌ పత్రం వస్తుంది. ఇంటి నక్ష, లింక్‌ డ్యాకుమెంట్‌ లాంటి పత్రాలు అవసరం లేకుండానే అనుమతులు పొందే అవకాశం కల్పించారు. మున్సిపల్‌ సర్వేయర్ల పని లేకుండానే మీ సేవ కేంద్రాల ద్వారా భవన నిర్మాణాల అనుమతుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. 75 నుంచి 200 గజాల వరకు (జీప్లస్‌-1) టీఎస్‌ బీపాస్‌తో దరఖాస్తు చేసుకుని ఫీజు చెల్లించిన వెంటనే అనుమతి పత్రం పొందే అవకాశం ఇచ్చారు. 

స్వీయ ధ్రువీకరణ ద్వారా అనుమతులు

200 చదరపు మీటర్ల నుంచి 500 చదరపు మీటర్ల స్థలాల్లో స్వీయ ధ్రువీకరణ ద్వారా  అనుమతులు మంజూరు చేయనున్నారు. జీప్లస్‌-2 భవన నిర్మాణాలకు స్వీయ ధ్రువీకరణతో తక్షణమే అనుమతులు ఇవ్వనున్నారు. నిబంధన మేరకు నిర్మాణం పూర్తయిన తర్వాత ఆక్వుపెన్సీ సర్టిఫికెట్‌ జారీ చేయనున్నారు. 500 చదరపు మీటర్ల ప్లాట్‌లో జీప్లస్‌ కంటే ఎక్కువ (10 మీటర్ల ఎత్తు) అంతస్తుల నిర్మాణ అనుమతులకు సింగిల్‌విండో విధానంలో టీఎస్‌ బీపాస్‌ కమిటీ ద్వారా అనుమతులు మంజూరు చేయనున్నారు.

క్షేత్రస్థాయిలో తనిఖీ

స్వీయ ధ్రువీకరణలతో తక్షణ అనుమతులు జారీ చేస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలను ఏర్పాటు చేయనున్నారు. వాస్తవాలను తప్పుగా చూపినా, నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టినా కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతలు, భారీ జరిమానా  విధించనున్నారు. 

త్వరలోనే అమలుకు అవకాశం

ప్రభుత్వం అమలు చేయనున్న టీఎస్‌ బీపాస్‌ విధానంతో పేదలకు ఇంటి నిర్మాణం మరింత సులభతరం కానున్నది. ఇప్పటికే టీఎస్‌-బీపాస్‌కు రాష్ట్ర క్యాబినెట్‌ ఆమోద ముద్ర వేసింది.  ఫోన్‌, మీ సేవ కేంద్రాల ద్వారా భవన నిర్మాణాల అనుమతుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. 75 నుంచి 200 గజాల వరకు(జీప్లస్‌1) టీఎస్‌ బీపాస్‌ ద్యారా దరఖాస్తు చేసుకుని ఫీజు చెల్లించిన వెంటనే అనుమతి పత్రం పొందే అవకాశం ఉంటుంది. త్వరలోనే అమలు చేసే అవకాశం ఉంది. 


logo