గురువారం 29 అక్టోబర్ 2020
Mahabubnagar - Jul 20, 2020 , 05:42:04

ప్రిస్క్రిప్షన్‌ లేకున్నా.. మందులు

ప్రిస్క్రిప్షన్‌ లేకున్నా.. మందులు

  • మెడికల్‌ దుకాణాదారుల ఇష్టారాజ్యం
  • డాక్టర్‌ చీటి లేకుండానే మందుల విక్రయాలు
  •  ప్రజల ప్రాణాలతో వ్యాపారుల చెలగాటం
  • కరోనా లక్షణాలు ఉంటే మందులు ఇవ్వొద్దనే నిబంధన
  • పట్టించుకోని ఔషధ నియంత్రణ అధికారులు 

కరోనా సమయంలో కొందరు మెడికల్‌ దుకాణాదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌ లేకుండానే.. సొంత వైద్యంతో రోగులకు మందులు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి లక్షణాలు ఉన్న వారికి తప్పకుండా డాక్టర్‌ రాసిన మందులనే ఇవ్వాలి.. కానీ నిబంధనలు గాలికి వదిలి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 1500కుపైగా మెడికల్‌ షాపులు ఉండగా.. వీటిలో 95 శాతం మందికి కనీస అవగాహన లేని వారు ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయినా ఔషధ నియంత్రణ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. 

మహబూబ్‌నగర్‌ క్రైం: కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో మెడికల్‌ దుకాణాల వ్యాపారులు సొంత వైద్యంతో డాక్టర్‌ చీటి లేకుండానే జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి లక్షణాలు ఉన్న రోగులకు మందులు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. లక్షణాలు ఉన్న రోగులకు మందులు విక్రయించొద్దని, డాక్టర్‌ చీటి ఉంటేనే మందులు ఇవ్వాలని ప్రభుత్వ నిబంధన ఉన్నా.. కొందరు మెడికల్‌ దుకాణాల యజమానులు తమకు ఏమీ పట్టనట్లు రోగులకు మందులు ఇస్తున్నారు. ప్రభుత్వ దవాఖానలో వైద్యసేవలు పొందిన వారికి ఉచితంగా ప్రభుత్వం మందులు అందిస్తున్నప్పటికీ రోగులు మెడికల్‌ దుకాణాలను ఆశ్రయించి మందులు తీసుకుంటున్నారు. మెడికల్‌ షాపులకు  ఎవరైనా కరోనా లక్షణాలు జ్వరం, దగ్గు, గొంతునొప్పి, జలుబు ఉన్నవారు వస్తే వారిని ప్రభుత్వ దవాఖానలకు పంపించాలని ప్రభుత్వం ఆదేశిస్తున్నా యథేచ్ఛగా రోగులకు మందులు విక్రయిస్తున్నారు.

ఎక్కువ డోసు ఉన్న  మందుల విక్రయాలు 

జ్వరం, దగ్గు, జలుబు, గొంతునొప్పి వచ్చిన వారికి మెడికల్‌ దుకాణాల వ్యాపారులు ఎక్కువ మోతాదు ఉన్న మందులు విక్రయిస్తున్నారు. యాంటీ బయాటిక్‌ మందులను అధిక ధరలు విక్రయిస్తున్నారు. ఎవరైనా లక్షణాలు ఉంటే వారితో డాక్టర్‌ చీటి ఉంటేనే మందులు ఇవ్వాలని ఔషధ నియంత్రణ అధికారులు సూచించినా మెడికల్‌ దుకాణాల వ్యాపారులు యథేచ్ఛగా అమ్ముతున్నారు. ప్రజలు సొంత వైద్యంతో మందులు తీసుకుంటున్నారని, డాక్టర్లు సూచించిన మందుల చీటితోనే మందులు కొనుగోలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు..

నిబంధనలు తప్పనిసరి 

కరోనా నేపథ్యంలో మెడికల్‌ దుకాణాల వ్యాపారులు తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలి. ఉమ్మడి జిల్లాలో  1500 మెడికల్‌ దుకాణాలు ఉన్నాయి. ఫార్మసిస్టుగా ఆర్హత ఉన్నవారికే మెడికల్‌ షాపు ఏర్పాటును ప్రోత్సహించాల్సిన అధికారులు నిబంధనలు తుంగలో తొక్కుతున్నారన్న ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ముడుపులు తీసుకుని దుకాణాలకు అనుమతి ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి  జిల్లాలోని మెడికల్‌ దుకాణాల్లోని 95శాతం మంది కనీసం అవగాహన లేనివారు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. లాభాలే ధ్యేయంగా వ్యాపారులు లక్షణాలు ఉన్న రోగులకు మందులను అంటగడుతున్నారు. 

నిబంధనలు ఇలా..

మెడికల్‌ దుకాణాల్లో ఫార్మసిస్టులు తప్పనిసరిగా మందులు విక్రయించాలి. ఫార్మసీ కంపెనీలు ఇచ్చే శాంపిళ్లను విక్రయించొద్దు. కాలం చెల్లిన మందులను అమ్మకుండా సంబంధింత కంపెనీలకు వాపసు చేయాలి. లక్షణాలు ఉన్నవారికి మందులు విక్రయించరాదు. డాక్టర్‌ చీటి లేకుండా మందులు ఇవ్వొద్దు. తప్పనిసరిగా రశీదులు ఇవ్వాలి. ఆ రశీదుల్లో మందులకు సంబంధించిన బ్యాచ్‌ నెంబర్‌, కాలం చెల్లిన తేదీ, మ్యాన్‌ప్యాక్షరింగ్‌, కంపెనీ పేరు. పేషంట్‌ పేరు, డాక్టర్‌ పేరు, ఖరీదు ధర రాయాలి. ఇది కేవలం ప్రాథమిక నిబంధనలు మాత్రమే.

చీటి ఉంటేనే మందులు ఇవ్వాలి


కరోనా వైరస్‌కు సంబంధించిన మందులు డాక్టర్ల చీటి ఉంటేనే రోగులకు ఇవ్వాలి. అధిక మోతాదు మాత్రలు ఇవ్వొద్దు. డాక్టర్‌ చీటి లేకుండా మందులు విక్రయించొద్దని మెడికల్‌ దుకాణాలకు ఆదేశాలు జారీ చేశాం. కరోనా లక్షణాల మందుల ప్రతి మెడికల్‌ దుకాణాల్లో ఉండాలని ప్రభుత్వ నిబంధన ఉంది. కానీ డాక్టర్లు సూచనల మేరకే మందులు ఇవ్వాలి. 

- అరవింద్‌, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌,  మహబూబ్‌నగర్‌ జిల్లా