గురువారం 13 ఆగస్టు 2020
Mahabubnagar - Jul 09, 2020 , 03:19:55

ఆశ‌ల ‌సాగు..

ఆశ‌ల ‌సాగు..

  • ఆశాజనకంగా జూరాలకు ముందస్తు వరద 
  • ఇప్పటికే రిజర్వాయర్లు నింపే ప్రక్రియ షురూ
  • గతేడాదితో పోలిస్తే నిండుగా ప్రాజెక్టులు 
  • నెట్టెంపాడు, భీమాకు కొనసాగుతున్న పంపింగ్‌
  • ఉమ్మడి జిల్లాలో 8లక్షల ఎకరాల ఆయకట్టు అంచనా 

గతేడాది సరిగ్గా ఈ సమయానికి జూరాల ప్రాజెక్టులో కనీసం 2 టీఎంసీల నీరు కూడా లేదు. ఎగువన ఉన్న ప్రాజెక్టుల పరిస్థితి కూడా అంతంతే. ఈ ఏడాది మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉన్నది. ఆల్మట్టి, నారాయణపూర్‌ ప్రాజెక్టుల నుంచి వరద రాకపోయినా జూరాల ప్రాజెక్టులో బుధవారం నాటికి 7.70 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. దీంతో జూరాలపై ఆధారపడిన నెట్టెంపాడు, భీమా ఎత్తిపోతల పథకాలకు పంపింగ్‌ కొనసాగుతున్నది. ఎగువనున్న ప్రాజెక్టుల నుంచి వరద వచ్చేలోగా జూరాలలో ఉన్న నీటిని ఎత్తిపోతల పథకాలకు తరలించి వాటిని సిద్ధం చేసేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం పరిస్థితి ఆశాజనకంగా ఉండటంతో ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాజెక్టుల పరిధిలో సుమారు 8లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు ప్రభుత్వం సిద్ధమైనది. జూరాల ప్రాజెక్టుకు జలకళ సంతరించుకోవడంతో రైతులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

మహబూబ్‌నగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ

గతేడాదితో పోలిస్తే.. ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలు, నారాయణపుర పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 37.64టీఎంసీలు. గతేడాది జూలై 8న ఆల్మట్టిలో 40.90, నారాయణపూర్‌లో 19.09 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నది. ఈ ఏడాది మాత్రం మరింత ఆశాజనకంగా ఉంది. ఆల్మట్టిలో 76.59, నారాయణపూర్‌ 25 టీఎంసీలతో కళకళలాడుతున్నాయి. ఆల్మట్టిలో మరో 53.13 టీఎంసీల జలాలు వచ్చి చేరితే ప్రాజెక్టు పూర్తి నీటి మట్టానికి చేరుతున్నది. ఇక నారాయణపూర్‌కు 12.64 టీఎంసీలు వస్తే అది పూర్తి సామర్థ్యాన్ని సంతరించుకుంటుంది. ఎగువన వర్షాలు కురుస్తున్నందున మరో 10, 15 రోజుల్లో ఈ రెండు ప్రాజెక్టులు పూర్తిగా నిండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది జూలై 28న జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద రాగా.. ఈ ఏడాది అంతకంటే ముందే వచ్చే అవకాశం కనిపిస్తున్నది. అయితే జూరాలకు నారాయణపూర్‌ నుంచి వరద రాకున్నా వారం రోజుల నుంచి ప్రాజెక్టు ఎగువన కురుస్తున్న వర్షాల ప్రభావం వల్ల రోజుకూ 3 నుంచి 5వేల క్యూసెక్కుల వరద ఇన్‌ఫ్లో ఉంటున్నది. దీంతో క్రమంగా జూరాల నీటి మట్టం పెరుగుతున్నది. దీన్ని అవకాశంగా మార్చుకున్న అధికారులు నెట్టెంపాడు, భీమాకు నీటిని ఎత్తిపోస్తున్నారు. 

ఈ ఏడాది ఆయకట్టు అంచనా..

ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలోని ఆరు ప్రాజెక్టుల పరిధిలో సుమారు 8 లక్షల ఎకరాల ఆయకట్టుకు  నీరందించేలా అధికారులు అంచనా వేశారు. అత్యధికంగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పరిధిలో గతేడాదిలాగే 3.07లక్షల ఎకరాలకు, భీమా ఫేజ్‌-1, ఫేజ్‌-2 పరిధిలో గతేడాది 1.23 లక్ష ల ఎకరాలకు సాగునీరు అందించగా.. ఈ ఏడాది 31వేల ఎకరాల ఆయక ట్టును అదనంగా అందించేందుకు సిద్ధమయ్యారు. నెట్టెంపాడు పరిధిలో 20వేలు, కోయి ల్‌సాగర్‌ పరిధి లో 21వేల ఆయకట్టును అదనంగా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే 66వేల ఎకరాలకు ఉమ్మడి జిల్లాలో అదనపు ఆయకట్టు అందిం చేలా ప్రణా ళిక సిద్ధం చేశారు. ఇదంతా స్థిరీకరించిన ఆయకట్టు కాగా, స్థిరీకరించని ఆయకట్టు మరింత ఉండేందుకు అవకాశం ఉంది. ప్రాజెక్టుల పరిధిలోని చెరువులను నింపడం ద్వారా అదనంగా ఆయకట్టు పెరిగే అవకాశం ఉంది.

ఈ ఏడాది 8 లక్షల అంచనా..

జూలై చివరి నాటికి జూరాలకు వరద వస్తుందని అంచనా వేశాం. ఎగువన కురుస్తున్న వర్షాల వల్ల ఈసారి పరిస్థితి ఆశాజనకంగా ఉంటుందని అనుకుంటున్నాం. ఎంజీకేఎల్‌ఐ పరిధిలో అక్కడక్కడ ఉన్న పెండింగ్‌ పనులు పూర్తి చేశాం. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంతోపాటు అన్ని ప్రాజెక్టులకు సైతం నిర్దేశిత ఆయకట్టుకు సాగునీరు అందిస్తాం. గతేడాదితో పోలిస్తే ఈ సారి ఆయకట్టును పెంచేందుకు లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నాం. ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాజెక్టుల పరిధిలో సుమారు 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా అంచనా వేసుకున్నాం. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించి రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తాం. 

- అనంతరెడ్డి, ప్రాజెక్టుల సీఈ,  ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా 

  logo