గురువారం 13 ఆగస్టు 2020
Mahabubnagar - Jul 08, 2020 , 00:54:07

అప్పుల్లేని రైతును చూడాలె

అప్పుల్లేని రైతును చూడాలె

  • అందుకోసమే సీఎం కేసీఆర్‌ ప్రయత్నం
  • రైతుకు అండగా నిలవాలి
  • ఆరేండ్లలోనే అద్భుతంగా వ్యవసాయం 
  • అన్నదాతలకు సమాచారం చేరవేసేందుకే రైతు వేదికలు
  • వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి 
  • రైతు వేదిక భవన నిర్మాణాలకు శంకుస్థాపనలు

తిమ్మాజిపేట/బిజినేపల్లి/తాడూరు : ఆరుగాలం శ్రమిస్తూ తాను పంట పండించి.. అందరినీ బతికిస్తున్న రైతును బతికించుకోవాలన్నది సీఎం కేసీఆర్‌ అభిమతమని, అందుకు అనుగుణంగా అనేక పథకాలను ప్రవేశపెట్టారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మంగళవారం తిమ్మాజిపేట మండలం పోతిరెడ్డిపల్లిలో మత్స్యసహకార భవనానికి, మారేపల్లి, తాడూరు మండలం భలాన్‌పల్లి, యాదిరెడ్డిపల్లి, బిజినేపల్లి మండలం పాలెం, వట్టెం గ్రామాల్లో నిర్మించనున్న రైతు వేదిక భవన నిర్మాణాలకు నాగర్‌కర్నూల్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ పద్మావతి బంగారయ్య, ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డితో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. 

అలాగే యాదిరెడ్డిపల్లిలో రూ.59 లక్షల వ్యయంతో నిర్మించిన మిషన్‌ భగీరథ మంచినీటి ట్యాంక్‌ను, రూ.5 లక్షల వ్యయంతో నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించి భూగర్భ డ్రైనేజీ వ్యవస్థకు శంకుస్థాపన చేశారు. ఆధునీకరించిన ఎల్‌ఈడీ విద్యుత్‌ దీపాలను ఆవిష్కరించారు. అనంతరం హరితహార కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ రైతు బాగుంటేనే రాష్ట్రం, దేశ ఆర్థిక పరిస్థితి బాగుంటుందన్నారు. అందుకే సీఎం కేసీఆర్‌ రైతును అప్పుల పాలు కాకుండా రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంట్‌, సాగునీరు, సబ్సిడీ విత్తనాలను అందిస్తున్నారన్నారు. రైతుబంధు కింద 56.94 లక్షల మంది రైతులకు రూ.7వేల 183 కోట్లను వారి ఖాతాల్లో జమ చేసినట్లు మంత్రి తెలిపారు.

సీఎం సగటు పేద రైతుగా ఆలోచనలు చేస్తారని, రైతు కష్టం గుర్తిస్తారన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా యాసంగిలో రైతు పండించిన ప్రతి గింజా కొనుగోలు చేశామని గుర్తు చేశారు. రైతుబంధు ద్వారా వానకాలం పంట పెట్టుబడి సాయం అందించామన్నారు. వ్యవసాయాన్ని లాభసాటి చేసేందుకు రాష్ట్రంలో నూతన వ్యవసాయ విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తయితే దేశంలో దక్షిణాదిలో ఎక్కువగా ధాన్యం పండించే ప్రాంతంగా పాలమూరు నిలుస్తుందన్నారు. సమైక్య రాష్ట్రంలో నాగర్‌కర్నూల్‌ ప్రాంతంలో యాసంగిలో 7 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పండితే, కేఎల్‌ఐ సాగునీళ్లు అందాక 1.72 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పండిందన్నారు. 

ఇదంతా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి అన్నారు. రైతును రాజు చేసే దిశగా ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. అనంతరం మారేపల్లిలో పది వేల మెట్రిక్‌ టన్నుల వేర్‌హౌస్‌ గోదాంను మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ పెద్దపల్లి పద్మావతి బంగారయ్య మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారన్నారు. ఆయన కోరిక మేరకు రైతులు నియంత్రిత వ్యవసాయ విధానాన్ని పాటిస్తున్నారని, రైతు వేదికలో కూడా రైతులకు ఉపయోగపడే విధంగా ఉంటాయన్నారు. ఎమ్మెల్యే మర్రి మాట్లాడుతూ రైతులు వ్యాపారస్తుడిలా తాను పండించిన పంటలకు తానే ధర నిర్ణయించే పరిస్థితి రావాలన్నారు. గతంలో వర్షం కోసం రైతు ఆకాశం వైపు చూసేవాడని, నేడు కాలువల వైపు చూస్తూ, ధీమాతో సాగు చేస్తున్నాడన్నారు. వ్యవసాయాన్ని పండుగలా చేసుకునే పరిస్థితి సీఎం కేసీఆర్‌ తీసుకువచ్చారన్నారు. అంతకుముందు పోతిరెడ్డిపల్లిలో పీర్లచావిడికి శంకుస్థాపన చేశారు. 

పోతిరెడ్డిపల్లిలో పాడి రైతులకు గడ్డి కోనాలను మంత్రి పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్‌ హన్మంత్‌రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్‌ జక్కా రఘునందన్‌రెడ్డి, ఆర్డీవో నాగలక్ష్మి, మార్కెట్‌ చైర్మన్‌ ఈశ్వర్‌రెడ్డి, ఎంపీపీలు రవీంద్రనాథ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, శ్రీదేవి, జెడ్పీటీసీలు రోహిణి, దయాకర్‌రెడ్డి, హరిచరణ్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీలు శ్రీనివాస్‌ యాదవ్‌, చిన్నారెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, కన్వీనర్‌ వెంకటస్వామి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు వేణుగోపాల్‌గౌడ్‌, ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు మల్లయ్య, పీఏసీసీఎస్‌ చైర్మన్‌ బాలరాజుగౌడ్‌, సర్పంచులు నాగమణి, ప్రవీణ్‌రెడ్డి, బాల్‌రాజ్‌, స్వప్న, ఎంపీటీసీలు ఉమాదేవి, తిరుపతయ్య, తాసీల్దార్లు సరస్వతి, అంజిరెడ్డి, ఎంపీడీవోలు కరుణశ్రీ, హరినాథ్‌గౌ డ్‌, ఏవో నీతి, నేతలు కుర్మయ్య,  మహేశ్వర్‌రెడ్డి, లా వ ణ్య నాగరాజు, బాలస్వామి, అధికారులు పాల్గొన్నారు. 


logo