శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Mahabubnagar - Jul 08, 2020 , 00:54:05

ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేస్తాం

ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేస్తాం

  • కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు ఎత్తు పెంచుతాం
  • ‘పాలమూరు’ త్వరగా పూర్తి 
  • గత పాలకుల నిర్లక్ష్యం వల్లే అభివృద్ధికి దూరం
  • ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌
  • బండర్‌పల్లి చెక్‌డ్యాం జలాలకు పూజలు 

 దేవరకద్ర రూరల్‌ : కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు ఎత్తును పెంచి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని త్వరగా పూర్తి చేసి ఏడాదంతా నీరుండేలా చర్యలు తీసుకొని ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. మంగళవారం మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్నచింతకుంట మండలం బండర్‌పల్లి సమీపంలోని ఊకచెట్టు వాగులో నిర్మించిన చెక్‌డ్యాం వారం రోజులుగా కురిసిన వర్షాలతో జలకళను సంతరించుకోగా.. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి మంత్రి గంగా జలాలకు పూజలు చేసి పూలు చల్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెక్‌డ్యాంలు నిర్మించడం వల్ల పరిసరాల్లో భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. 

ఈ ఏడాది వర్షాలు సకాలంలోనే కురుస్తున్నాయన్నారు. ఈ తరుణంలో సర్కారు రైతుబంధు కింద పంటపెట్టుబడి సాయం డబ్బులు అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తుండటంతో సాగు పనులు జోరుగా కొనసాగుతున్నాయన్నారు. కోయిల్‌సాగర్‌ ఎత్తును పెంచేందుకు సీఎం కేసీఆర్‌ అంగీకరించారని, రాబోయే కాలంలో కర్వెన రిజర్వాయిర్‌ నుంచి ఒక టీఎంసీ నీటిని తీసుకునేందుకు రూపకల్పనుకు ఆమోదం తెలిపారన్నారు. దీంతో కోయిల్‌సాగర్‌ నుంచి రామన్‌పాడు వరకు ఊకచెట్టు వాగుపై 36 కిలోమీటర్ల మేర ఎప్పుడూ జలకళ సంతరించుకోనున్నదన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రాజేశ్వరి, దేవరకద్ర మండల పార్టీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, మాజీ అధ్యక్షుడు శ్రీకాంత్‌ యాదవ్‌, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, ఆంజనేయులు, నాయకులు పాల్గొన్నారు.  

మంత్రి కేటీఆర్‌ పర్యటనకు పక్కాగా ఏర్పాట్లు 

  మహబూబ్‌నగర్‌/మున్సిపాలిటీ/మెట్టుగడ్డ : ఈనెల 13న పాలమూరులో మంత్రి కేటీఆర్‌ పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని అధికారులను మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆదేశించారు. మంగళవారం జెడ్పీ మైదానంలో, మయూరీ నర్సరీలో మంత్రి పర్యటన ఏర్పాట్లను కలెక్టర్‌ వెంకట్రావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు నిర్ల క్ష్యం అనే మాటకు తావు లేకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అవసరమైన సూచనలు, సలహాలు ఇచ్చారు. అలాగే జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. మహబూబ్‌నగర్‌-జడ్చర్ల రోడ్డు విస్తరణ పనులు వేగంగగా కొనసాగుతున్నాయని తెలిపారు. 

రోడ్డు విస్తరణ, చౌరస్తాలు విస్తరించి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆవిర్భావ వేడుకలలో మంత్రి పాల్గొని ఏనుగొండలోని అంబేద్కర్‌ విగ్రహానికి నివాళి అర్పించి జెండాను ఎగురువేశారు.  రెడ్‌క్రాస్‌ అనాథ శరణాలయంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో మంత్రి పాల్గొని విద్యార్థులతో కలసి సహపంక్తి భోజనం చేశారు. పలువురు విద్యార్థులకు ఆప్యాయంగా తినిపించారు. కార్యక్రమాల్లో అడిషనల్‌ కలెక్టర్‌ సీతారామరా వు, ఆర్డీవో శ్రీనివాసులు, డీఎఫ్‌వో గంగారెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ నిజాంపాషా, వైస్‌ చైర్మన్‌ కోరమోని వెంకట య్య, మున్సిపల్‌ చైర్మన్‌ నర్సింహులు, వైస్‌ చైర్మన్‌ తాటి గణేశ్‌, జెడ్పీ సీఈవో యాదయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ సురేందర్‌, పాలమూరు తాసిల్దార్‌, ఎంఈ సత్యనారాయణ, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆంజనేయులు, కౌన్సిలర్‌ రాము, ఎమ్మార్పీఎస్‌ జాతీయ కార్యదర్శి జంబులయ్య, జిల్లా అధ్యక్షుడు రమేశ్‌, నరేందర్‌, కొత్త యాదవ్‌, చెన్నయ్య, రామచంద్రయ్య, పురుషోత్తం, జైపాల్‌రెడ్డి, రాజు, వెంకట్‌, జగపతిరావు పాల్గొన్నారు. 


logo