ఆదివారం 09 ఆగస్టు 2020
Mahabubnagar - Jul 05, 2020 , 04:15:16

అక్రమ కట్టడాలు తొలగించండి

అక్రమ కట్టడాలు తొలగించండి

  •  స్పెషల్‌ డ్రైవ్‌కు ప్రతి ఒక్కరూ సహకరించాలి 
  •  నాలాల కబ్జాతో ఇండ్లల్లోకి వర్షపునీరు
  • ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ 
  •  మున్సిపల్‌ అధికారులపై ఆగ్రహం

జిల్లా కేంద్రంలోని నాలాలను కబ్జా చేసి నిర్మించిన కట్టడాలను స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి వెంటనే తొలగించాలని అధికారులను మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆదేశించారు. మహబూబ్‌ నగర్‌ జిల్లా కేంద్రంలో శుక్రవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి పెద్దచెరువు అలుగు పారగా.. నాలాలు పొంగి ఇండ్లల్లోకి వచ్చిన రామయ్యబౌలి ప్రాంతంలో శనివారం మంత్రి పర్యటించారు. కొంత మంది ఇంటి యజమానులు పెద్దచెరువు నుంచి వచ్చే నీటి కాలువను ఆక్రమించి బాత్‌రూమ్‌ కట్టడాలను నిర్మించడంతో మున్సిపల్‌ అధికారులపై మంత్రి అగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ కట్టడాల తొలగింపు పనులు అధికారులు చేపడితే స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు సహకరించాలని ఆయన కోరారు. అంతకుముందు టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో ఎదిరకు చెందిన దాదాపు 200 మంది బీజేపీ, కాంగ్రెస్‌, టీడీపీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు.  

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ : పాలమూరు జిల్లాకేంద్రంలో నాలాలపై నిర్మించిన అక్రమ కట్టడాలను స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి తక్షణమే తొలగించాలని మున్సిపల్‌ అధికారులకు ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆదేశించారు. శుక్రవారం పట్టణంలో కురిసిన భారీ వర్షానికి పెద్దచెరువు అలుగు పారి నాలాలు పొంగి ఇండ్లల్లోకి నీళ్లొచ్చిన రామయ్యబౌలి ప్రాంతంలో మంత్రి పర్యటించారు. కొంత మంది ఇంటి యాజమానులు పెద్దచెరువు నుంచి నీరు ప్రవహించే డ్రైనేజీ కాలువలను ఆక్రమించి బాత్‌రూమ్‌లు నిర్మించడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పెద్ద చెరువు నుంచి రెండు వైపులా నీళ్లు వచ్చేందుకు రెండు అలుగులున్నాయని, భారీ వర్షాలు కురిసినప్పుడు అలుగుల ద్వారా నీరు బయటకు వెళ్తుందన్నారు. అయితే ఆక్రమణలతో నీరు పట్టణం బయటకు వెళ్లకపోవడంతో ఇండ్లల్లోకి చేరుతుందన్నారు. అర్ధరాత్రి భారీ వర్షాలు.. వరదలు వచ్చినా పట్టణంలో నాలాల ద్వారా సాఫీగా నీరు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

నాలాలు ఆక్రమించి నిర్మాణాలు చేపడితే వెంటనే కూల్చివేయాలన్నారు. నాలాలు అక్రమించి నిర్మాణాలు చేపట్టవద్దని ఇంటి యజమానులకు ఆయన విజ్ఞప్తి చేశారు. అక్రమ కట్టడాల తొలగింపు పనులను అధికారులు చేపడితే స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు సహకరించాలని కోరారు. పెద్దచెరువు చుట్టుపక్కల కంపచెట్లను తొలగించడంతోపాటు, మినీ ట్యాంక్‌ బండ్‌ను సుందరంగా మారుస్తామని, శిల్పారామం ఏర్పాటు చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ కేసీ నర్సింహులు, వైస్‌ చైర్మన్‌ తాటిగణేశ్‌, కౌన్సిలర్‌ ముస్తాక్‌ రాశీద్‌, ఆర్డీవో శ్రీనివాసులు, మున్సిపల్‌ కమిషనర్‌ సురేందర్‌, అధికారులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 


logo