మంగళవారం 04 ఆగస్టు 2020
Mahabubnagar - Jul 01, 2020 , 01:22:15

మొక్కల బాధ్యత కౌన్సిలర్లదే..

మొక్కల బాధ్యత కౌన్సిలర్లదే..

  • త్వరలో వాలీబాల్‌ అకాడమీ ఏర్పాటుకు చర్యలు
  • రోడ్లు, జంక్షన్ల అభివృద్ధితో పట్టణానికి కొత్త కళ
  • కౌన్సిల్‌ సమావేశంలో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌
  • టంకరలో రైతువేదిక నిర్మాణానికి భూమిపూజ
  • బండమీదిపల్లిలో మొక్క నాటిన మంత్రి

హరితహారంలో కౌన్సిలర్లు భాగస్వాములు కావాలని, ఎక్కడైనా మొక్కలు ఎండిపోతే కొత్త మున్సిపల్‌ చట్టం ప్రకారం వారే బాధ్యత వహించాలని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. మహబూబ్‌నగర్‌ మున్సిపల్‌ సమావేశ మందిరంలో జరిగిన కౌన్సిల్‌ సమావేశానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పట్టణంలో పార్కులు, జిమ్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని, రోడ్లు, జంక్షన్ల విస్తరణతో పట్టణాన్ని సుందరీకరిస్తామని పేర్కొన్నారు. బండమీదిపల్లి వద్ద పశుగణాభివృద్ధి కార్యాలయంలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటి, రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. హన్వాడ మండలంలోని టంకర గ్రామంలో మిషన్‌ భగీరథ ట్యాంకులను ప్రారంభించి, రైతు వేదిక భవనం నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. టంకర సర్పంచ్‌ అచ్చన్నతోపాటు పలువురు బీజేపీ వార్డు సభ్యులు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సమక్షంలో పార్టీలో చేరారు.

- మహబూబ్‌నగర్‌/మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ

/హన్వాడ

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ:  మహబూబ్‌నగర్‌ పట్టణంలో త్వరలో వాలీబాల్‌ అకాడమీ ఏర్పాటుచేసి క్రీడాకారులను ప్రోత్సహిస్తామని ఎక్సైజ్‌ శాఖ మంత్రి డాక్టర్‌ వీ శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. మంగళవారం మున్సిపల్‌ సమావేశ మందిరంలో మున్సిపల్‌ చైర్మన్‌ కేసీ నర్సింహులు అధ్యక్షతన జరిగిన కౌన్సిల్‌ సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పాలమూరు పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, పార్కులు, జిమ్‌లు,  మహిళలకు ప్రత్యేక జిమ్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు.  ఇప్పటికే మహబూబ్‌నగర్‌-జడ్చర్ల రోడ్డు విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయని, జంక్షన్ల విస్తరణతోపాటు సుందరీకరణ పనులు చేపడతామని తెలిపారు. హరితహారం కార్యక్రమంలో కౌన్సిలర్లు భాగస్వాములు కావాలని, అన్ని వార్డుల్లో మొక్కలు నాటాలని సూచించారు.  ఎక్కడైనా మొక్క చనిపోతే కొత్త మున్సిపల్‌ చట్టం ప్రకారం కౌన్సిలర్లను బాధ్యులను చేయాలని అన్నారు. కరోనా వ్యాప్తి చెందుతున్నందున ప్రతిఒక్కరూ భౌతికదూరం పాటించాలని, వార్డుల్లో పారిశుధ్యంపై డ్రై డే నిర్వహించాలన్నారు. అవసరమైన పేదలందరికీ డబుల్‌ బెడ్రూం ఇండ్లు కట్టిస్తామన్నారు. చిరు వ్యాపారులకు వారం రోజుల్లో రూ.70కోట్లతో రుణమేళా ఏర్పాటు చేస్తామన్నారు.  రోడ్లపై వ్యాపారం చేసుకునే వారికి పట్టణంలో చిన్న చిన్న షాపులను నిర్మించి ఉచితంగా విద్యుత్‌ సౌకర్యం కల్పిస్తామన్నారు. 

అభివృద్ధిలో భాగస్వాములవుదాం

పట్టణ అభివృద్ధిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని మున్సిపల్‌ చైర్మన్‌ కేసీ నర్సింహులు అన్నారు.  మహబూబ్‌నగర్‌ పట్టణ అభివృద్ధికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అత్యధిక నిధులు తెచ్చారని గుర్తు చేశారు. కౌన్సిల్‌ సమావేశంలో భాగంగా బీజేపీ కౌన్సిలర్లు రామాంజనేయులు, అంజయ్య, చెన్నవీరయ్య మాట్లాడుతూ వార్డుల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరారు.  టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు కట్టారవికిషన్‌రెడ్డి, వనజ, వేదవ్రత్‌, షబ్బీర్‌, అనంతరెడ్డి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి మంత్రి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ మొయిన్‌అలీ మాట్లాడుతూ ఎజెండాను ఉర్దూలో రూపొందించాలని కోరారు. ఎంఐఎం కౌన్సిలర్‌ సాదతుల్లా హుస్సేని మాట్లాడుతూ హజ్‌హౌస్‌ను అందరికీ అందుబాటులో ఉండేలా నిర్మించాలన్నారు. అంతకుముందు వీరజవాన్లకు నివాళులర్పించారు. సమావేశంలో అడిషనల్‌ కలెక్టర్‌ మోహన్‌లాల్‌, మున్సిపల్‌ కమిషనర్‌ సురేందర్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ టీ గణేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

ప్రతి ఒక్కరిలో సేవాగుణం ఉండాలి 

మహబూబ్‌నగర్‌ : ప్రతిఒక్కరూ సేవాగుణం కలిగి ఉండాలని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బండమీదిపల్లి పశుగణాభివృద్ధి కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలోని పాడి పరిశ్రమ అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని, పాడి లేనిదే వ్యవసాయం లేదని పేర్కొన్నారు. అనంతరం రక్తదానం చేసి ప్రాణదాతలు కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు. కార్యక్రమంలో గోపాలమిత్ర చైర్మన్‌ చెన్నకిషన్‌రెడ్డి, పశు సంవర్ధక శాఖ సీఈవో మంజువాణి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి మధుసూదన్‌గౌడ్‌, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు గోపాల్‌యాదవ్‌, రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ లయన్‌ నటరాజు, ఈవో వెంకటయ్య, కౌన్సిలర్‌ యాదగిరి తదితరులు పాల్గొన్నారు. 

ఇంటింటికీ శుద్ధ జలాలు

హన్వాడ : తెలంగాణ ఆడబిడ్డలు నీటి కోసం బిందె పట్టుకొని బయటికి వెళ్లకుండా ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నామని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. మండలంలోని టంకరలో మిషన్‌ భగీరథ ట్యాంకులను ప్రారంభించి, రైతు వేదిక భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి మాట్లాడారు. రూ.1.43కోట్లతో వాటర్‌ట్యాంకుల నిర్మాణం, పైపులైన్లు, ఇంటింటికీ నల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది. రైతు వేదిక నిర్మాణానికి ప్రభుత్వం రూ. 22లక్షలు మంజూరు చేయడం జరిగిందన్నారు. పనులు నాణ్యతగా చేపట్టి త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ అచ్చన్న, ఎంపీటీసీ లక్ష్మమ్మ, ఉప సర్పంచ్‌ తిరుపతమ్మ, ఎంపీపీ బాల్‌రాజ్‌, ఎంపీడీవో నటరాజ్‌, తాసిల్దార్‌ శ్రీనివాసులు, సింగిల్‌ విండో చైర్మన్‌ వెంకటయ్య, రైతుబంధు సమితి మండల కన్వీనర్‌ రాజుయాదవ్‌, మిషన్‌ భగీరథ ఏఈ యాదయ్య, ఏవో కిరణ్‌కుమార్‌, ఆర్డీవో శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

అమ్మా పింఛన్‌ వస్తుందా..

ఓ వృద్ధురాలితో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాటామంతి

హన్వాడ : మండలంలోని టంకరలో పలు అభివృద్ధి పనులకు హాజరైన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ కార్యక్రమాల అనంతరం ఓ వృద్ధురాలితో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, పింఛన్‌పై మాటామంతి కలిపారు. 

మంత్రి  శ్రీనివాస్‌గౌడ్‌ : అమ్మా నెల నెలా రూ.2వేల పింఛన్‌ వస్తుందా లేదా అని ఓ వృద్ధురాలిని అడిగారు.

వృద్ధురాలు : నాకు గతంలో రూ.200 పింఛన్‌ ఇచ్చేవారు. కేసీఆర్‌ వచ్చిన తర్వాత నెలకు రూ.2వేలు ఇస్తున్నారు. ఆయన సల్లంగా ఉండాలి.

మంత్రి  శ్రీనివాస్‌గౌడ్‌ : నీకు ఎంతమంది కొడుకులు.. వాళ్లు నీకు డబ్బులు ఇస్తారా..

వృద్ధురాలు : ఐదుమంది కొడుకులు.. కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వరూ.. నెలకు వచ్చిన పింఛన్‌ సరిపోతుంది బిడ్డ. ఇక కొడుకుల మీద ఆధారపడను. 

మంత్రి  శ్రీనివాస్‌గౌడ్‌ : మరీ.. పింఛన్‌ డబ్బులు ఏం చేస్తున్నావు అమ్మ. 

వృద్ధురాలు : రోజూ పొద్దుగల, సాయంత్రం చాయ్‌ తాగుతాను, నా ఖర్చుల కోసం పెట్టుకుంటాను. నెల వచ్చే వరకు సరిపోతాయి. 

మంత్రి  శ్రీనివాస్‌గౌడ్‌ : పింఛన్‌ సరే.. మరి మీ ఊళ్లో పనులేమైనా చేస్తున్నారా..

వృద్ధురాలు : కేసీఆర్‌ సీఎం అయినంక మా ఊరిలో ప్రతి గేరికి సీసీరోడ్లు వేశారు. ఇంటింటికీ భగీరథ నీళ్లు వొస్తున్నాయి.. ఇంకేం కావాలి బిడ్డ. ఇంక ఎలాంటి ఇబ్బంది లేదు. 


logo