సోమవారం 06 జూలై 2020
Mahabubnagar - Jun 30, 2020 , 06:02:37

కానరాని ‘కొవిడ్‌' నిబంధనలు

కానరాని ‘కొవిడ్‌' నిబంధనలు

  • రోడ్లపై రద్దీగా తిరుగుతున్న జనాలు
  • బ్యాంకుల్లో బారులుతీరినఖాతాదారులు
  • అప్రమత్తతతోనే ఆరోగ్యం

ఆత్మకూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లౌక్‌డౌన్‌ను సడలించడంతో భౌతిక దూరం అన్న పదానికి అర్థం మారిపోయింది. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు భౌతికదూరం పాటించాలని ప్రభుత్వం సూచిస్తున్నా.. ప్రజలు పట్టించుకోవడం లేదు. దుకాణాల వద్ద, బ్యాంకులు, బస్సుల్లో, దవాఖానల్లో, కూరగాయల మార్కెట్‌, షాపింగ్‌ మాల్స్‌ తదితర ప్రాంతాల్లో భౌతికదూరం కనిపించడం లేదు.

రాకపోకల పునరుద్ధరణతో..

లాక్‌డౌన్‌ సడలించి రాకపోకలకు అనుమతివ్వడంతో వాహనాలు రోడ్డెక్కాయి. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్‌ వాహనాలు, ఆటోల్లో ప్రజలు భౌతికదూరం నిబంధన మరిచి కిక్కిరిసి ప్రయాణాలు సాగిస్తున్నారు. మొదల్లో ఆర్టీసీ బస్సుల్లో శానిటైజర్ల ఏర్పాటు, బస్టాండ్‌ పరిసరాల్లో హైపోక్టోరైట్‌ ద్రావణంతో శుభ్రం చేయడం లాంటివి ముమ్మరంగా చేపట్టారు. ప్రస్తుతం అవేవి కనిపించడం లేదు. ఇక ప్రైవేటు వాహనాల్లో పక్కపక్కనే కూర్చోని ప్రయాణిస్తున్నారు. శానిటైజేషన్‌, భౌతికదూరం అలంకార ప్రాయంగా మారడం ఆందోళన కలిగిస్తున్నది.

ఆదమరిస్తే అంతే..

లాక్‌డౌన్‌ సడలింపుల స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తే కరోనా వ్యాప్తి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. భౌతిక దూరం పాటించి, మాస్కు ధరించాలని సూచిస్తున్నారు. రానున్న రోజుల్లో కరోనా తీవ్రత అధికమయ్యే అవకాశం ఉన్నట్లు ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. 

మేల్కొనకుంటే ముప్పే..

కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వాతావరణ మార్పులతో మహమ్మారి వేగంగా విస్తరిస్తున్నది. హైదరాబాద్‌లో రోజుకు వెయ్యి కేసులు నమోదవుతున్నాయి. నిత్యం వ్యాపారులు, ప్రయాణికులు, వివిధ రకాల ట్రాన్స్‌పోర్టు సామగ్రి హైదరాబాద్‌ నుంచే దిగుమతి జరుగుతున్నది. ఇలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలి. మాస్కులు ధరించడం, చేతులు శానిటైజ్‌ చేసుకోవడంతో పాటు భౌతికదూరం పాటించాలి. రద్దీ ప్రాంతాల్లో జనాలు భౌతికదూరం పాటించడం లేదు. బ్యాంకులు, దుకాణాలు, టీ పాయింట్లు, హోటల్స్‌, కార్యాలయాల వద్ద జనాలు గుమిగూడుతున్నారు. ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోకపోతే కరోనా సోకే అవకాశం లేకపోలేదు. ఇప్పటికైనా ప్రజలు మేలుకొని భౌతికదూరం నిబంధనలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. logo