శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Mahabubnagar - Jun 23, 2020 , 01:50:41

పెద్ద ఎత్తున నకిలీ విత్తనాల పట్టివేత

 పెద్ద ఎత్తున నకిలీ విత్తనాల పట్టివేత

మహబూబ్‌నగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఇద్దరు రైతులు పత్తి విత్తనాల కోసం మక్తల్‌ మండలం దాసర్‌దొడ్డికి వెళ్లారు. గ్రామంలో ఓ వ్యక్తి తక్కువ ధరకు విత్తనాలు విక్రయిస్తున్నాడని తెలిసి ఆయన వద్దకు వెళ్లారు. మంచి పత్తి విత్తనాలు కావాలని అడిగారు. ప్యాకెట్‌ విత్తనాలు బ్రాండెడ్‌ అయితే రూ. 750. అదే రకానికి చెందిన కొత్త కంపెనీ అయితే రూ. 500లోపే వస్తయి. కంపెనీది ఏముంది ఇవి కూడా అట్లే పనిచేస్తయి. కంపెనీవి రేటు ఎక్కువ. మావి రేటు సగానికి సగం తక్కువ. అయినా డబ్బులు ఎందుకు వృథా చేసుకుంటవ్‌ కొత్త కంపెనీవి తీసుకో.. అని నకిలీ విత్తనాలు అమ్మె వ్యక్తి అనడంతో రైతు సరే అవే ఇవ్వు అని తీసుకున్నడు. వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేశారు. సదరు నకిలీ విత్తనాల విక్రయదారుడిని అదుపులోకి తీసుకొని జైలుకు తరలించారు. నకిలీ విత్తనాల విక్రయదారులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని చెప్పేందుకు ఇదో ఉదాహరణ మాత్రమే.. నకిలీ విత్తనాలు విక్రయించే వారి వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేసిన తరుణంలో వ్యవసాయ, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నకిలీ విత్తనాలను విక్రయిస్తున్న వారిపై దాడులు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న దాడులతో నకిలీ దందాకు పెద్ద ఎత్తున బ్రేకులు పడ్డాయి..

జోగుళాంబ గద్వాలలో వరుస దాడులు

నకిలీ విత్తనాల దందాపై నిఘా పెంచారు. పోలీసులు, వ్యవసాయ శాఖ సంయుక్తంగా టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేసి దాడులు చేస్తున్నారు. నకిలీ విత్తనాల దందాను గుట్టుగా నడుపుతున్నారనే సమాచారంతో దాడులు చేసి విత్తనాలను స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేస్తున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో కంపెనీల నుంచి ఫెయిల్‌ అయిన విత్తనాలను కొందరు ఆకర్శణీయంగా ప్యాకింగ్‌ చేసి అమాయక రైతులకు విక్రయిస్తున్నారు. జిల్లాకు చెందిన ఓ సీడ్‌ ఆర్గనైజర్‌ సైతం ఈ దందాలో ఉన్నారని సమాచారం. సదరు సీడ్‌ ఆర్గనైజర్‌ ఇంటిపై దాడులు నిర్వహించి 375 ప్యాకెట్ల నకిలీ పత్తి విత్తనాలు, 10 కిలోల రంగును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని అయిజ, గద్వాల మండలం  పరిధిలోని గోనుపాడు, మదనపల్లి, ధరూర్‌ మండలంలోని మార్లబీడు, ర్యాలంపాడు, కొత్తపల్లి తండా, దోర్నాలలో టాస్క్‌ఫోర్స్‌ అధికారులు వరుస దాడులు నిర్వహించారు. ఈ దాడులల్లో కీలక సమాచారం సేకరించిన అధికారులు నకిలీ విత్తనాలకు కారణమైన పలువురిని అదుపులోకి తీసుకున్నారు. గద్వాల ప్రాంతం నుంచి కర్ణాటక, ఏపీ రాష్ర్టాలకు సైతం నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్నారని సమాచారం. వివిధ ప్రాంతాల్లో పట్టుబడిన విత్తనాలకు గద్వాలతో సంబంధం ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. ఇప్పటికే జిల్లాలో 29కి పైగా కేసులు నమోదయ్యాయి. 2081 కిలోల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. 

అక్రమార్కులపై ఉక్కుపాదం

మహబూబ్‌నగర్‌ జిల్లాలో రూ. 86లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి సుచరిత తెలిపారు. నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపుతున్నామని స్పష్టం చేశారు. జిల్లాలో మొత్తం ఎనిమిది కేసులు నమోదయ్యాయి. ఇందులో ఓ కేసు విజిలెన్స్‌ అధికారులు నమోదు చేశారు. బాలానగర్‌ మండలంలో నకిలీ కూరగాయల విత్తనాలు సైతం స్వాధీనం చేసుకున్నారు. ఇక నారాయణపేట జిల్లాలోనూ నకిలీపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. మక్తల్‌ మండలం దాసరిదొడ్డిలో ఈ నెల 3న ఓ వ్యక్తి నుంచి 78 నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. అదేరోజు ఊట్కూరు మండలం తిప్రాస్‌పల్లిలో 62 ప్యాకెట్ల నకిలీ విత్తనాలను పట్టుకున్నారు. ఈ నెల 17న మక్తల్‌ పట్టణంలోని ఓ కూల్‌ డ్రింక్‌ షాపులో అక్రమంగా నిల్వ చేసిన 9 క్వింటాళ్ల 45 కిలోల కంది, 40 కిలోల పెసర విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. అదేరోజున ఊట్కూరు మండలం నాగిరెడ్డిపల్లిలో ఓ వ్యక్తి అక్రమంగా విక్రయించేందుకు సిద్ధం చేసిన ఐదు క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నారాయణపేట జిల్లాలో సుమారు రూ. 50లక్షలకు పైగా విలువైన విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. 

ధ్రువీకరణలేని విత్తనాలతో టోపీ..

నాణ్యమైన విత్తనాలకు ప్రభుత్వం నుంచి గుర్తిం పు ఉంటుంది. మొలకశాతం, విత్తన స్వచ్ఛత, జన్యు ధ్రువీకరణ చేసి సర్టిఫై చేస్తారు. పత్తి విత్తనా లకు అదనంగా బీటీ ధ్రువీకరణ చేయాలి. అయితే ఇవన్నీ ఏమీ లేకుండా అక్రమ దందా చేసే వారు జిన్నింగ్‌ మిల్లు వద్ద పత్తి విత్తనాలు తెచ్చి ఆకర్శ ణీయంగా ప్యాకింగ్‌ చేసి విక్రయిస్తారు. 450 గ్రాములుండే కంపెనీ విత్తనాల ఫ్యాకెట్‌  ధర రూ. 750 ఉంటుంది. దాదాపుగా వ్యాపారులు ఎమ్మా ర్పీకి తక్కువగా ఇవ్వరు. అదే నకిలీ విత్తనాలు అయితే ధర అమాంతరం పెంచేసి రూ. 900 ధర ప్రింట్‌ వేసి రూ.400 వరకు విక్రయిస్తారు. వీటి వల్ల మొలక రాదు. రైతులు పెట్టిన పెట్టుబడి నష్ట పోతారు. అదే కంపెనీ విత్తనాలు అయితే కేసు వేసి నష్టపరిహారం వసూలు చేయొచ్చు. లాట్‌ నెం బర్‌, బిల్‌ నెంబర్‌ తో కేసు వేసేందుకు అవకాశం ఉంటుంది. నకిలీ విత్తనాలు తీసుకుంటే ఎవరిపై కేసు వేయాలి.. ఎవరి నుంచి నష్టపరిహారం వసూ లు చేయాలి. ఈ పరిస్థితుల్లోనే అప్పులు చేసి వ్యవసాయం చేసే రైతులు ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్యలు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి వాటిని అరికట్టేందుకు సీఎం కేసీఆర్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతుబంధు సమితులు, రైతులు నకిలీ విత్తనాలపై ఎప్పటి కప్పుడు సమాచారం అందించాలని కోరుతు న్నారు. రైతులు కూడా సర్టిఫైడ్‌ విత్తనాలు మాత్రమే వాడాలని సూచిస్తున్నారు. 

టాస్క్‌ఫోర్స్‌ బృందాలతో నిఘా

నకిలీ విత్తనాలను పట్టుకునేందుకు పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులతో కలిపి టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేశారు. టీంలో ఒక ఏడీఏ, ముగ్గురు ఏవోలు, ఒకసీఐ, నలుగురు కానిస్టేబుళ్లు ఉంటారు. వీరికి సమాచారం వచ్చిందంటే వెంటనే అక్కడ వాలిపోతారు. రైతుల మాదిరిగా వెళ్లి విత్తనాలు కొనుగోలు చేస్తారు. నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకుని స్థానిక ఏవో ద్వారా కేసు నమోదు చేయిస్తారు. 

దందా చేయాలంటే భయపడాలి

జిల్లాలో బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదట నకిలీ విత్తనాలు విక్రయిం చే వారిపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చే శాను. ఇప్పటివరకు జిల్లా లో 24 కేసులు నమోదయ్యాయి. నకిలీ విత్తనాల దందా చేసే వారిపై దాడులు కొనసాగుతాయి. పోలీసులు, వ్యవసాయశాఖ తరఫున ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్‌ బృందాలు పనిచేస్తున్నాయి. అదనంగా పోలీసుశాఖ నుంచి ప్రత్యేకంగా ఓ బృందం పనిచేస్తున్నది. సీడ్‌ ఆర్గనైజర్ల మీద సైతం కేసులు నమోదు చేశాం. నకిలీ దందా చేయాలంటేనే భయపడాలి.

- రంజన్‌ రతన్‌కుమార్‌, ఎస్పీ, జోగులాంబ గద్వాల జిల్లా 

రైతులుగా వెళ్లి దాడులు చేస్తున్నాం

నకిలీ విత్తనాల గుట్టు రట్టు చేసేందుకు రైతుల మాదిరిగా వెళ్లి విత్తనాలు కొనుగోలు చేసి పట్టుకుంటున్నాం. మక్తల్‌ మండలం దాసర్‌దొడ్డి లో అలాగే ఓ నకిలీ విత్తనాలు అమ్మే వ్యక్తిని పట్టుకున్నాం. టాస్క్‌ఫో ర్స్‌ బృందంలోని సభ్యులు సాధారణ రైతుల్లా గ్రామాల్లో తిరుగుతూ నకిలీ విత్తన దందా చేసే వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. 

- జాన్‌ సుధాకర్‌, వ్యవసాయాధికారి, నారాయణపేట జిల్లా 


logo