శనివారం 06 జూన్ 2020
Mahabubnagar - May 24, 2020 , 02:35:20

పాలమూరు టు ఒడిశా

పాలమూరు టు ఒడిశా

కదిలి శ్రామిక్‌ రైలు

 ఉమ్మడి జిల్లా నుంచి స్వస్థలాలకు 1,750 మంది వలస కార్మికులు

 టిక్కెట్‌ ఖర్చులు భరించిన రాష్ట్ర సర్కారు

 పతి కార్మికుడికి ఫుడ్‌ కిట్ల అందజేత

 ఏర్పాట్లను పర్యవేక్షించిన పేట కలెక్టర్‌

 భరోసా కల్పించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

రెండు నెలల వలసకూలీల గోసకు తెరపడింది. లాక్‌డౌన్‌ కారణంగా ఉమ్మడి జిల్లాలో చిక్కుకున్న ఒడిశాకు చెందిన 1750 మంది వలసకార్మికులు ఎట్టకేలకు సొంతూళ్లకు శనివారం బయలుదేరారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేక రైలు కేటాయించి, పరీక్షలు నిర్వహించి, టికెట్‌ ఖర్చులు భరించి, దారి మధ్యలో తినడానికి ఆహార పొట్లాలను సైతం అందించింది. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ కూలీలకు భరోసా కల్పించగా, నారాయణపేట కలెక్టర్‌ హరిచందన ఏర్పాట్లను పర్యవేక్షించారు.

- మహబూబ్‌నగర్‌ ప్రతినిధి 

మహబూబ్‌నగర్‌ ప్రతినిధి : కరోనా మహమ్మారి కారణంగా వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు ప డుతున్నారు. కుటుంబాలు ఓ చోట.. వారు ఓ చోట ఉంటూ దాదాపు రెండు నెలలుగా బాధపడుతున్నా రు. అలాంటి వారికి తెలంగాణ ప్రభుత్వం వరమందించింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వలస కార్మికులు వందల కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్తూ అనేక కష్టాలు పడుతుంటే.. కేసీఆర్‌ సర్కారు మా త్రం వారిని కడుపులో పెట్టుకుంది. ఉమ్మడి జిల్లాలోని 1,750 మంది వలస కార్మికుల రైల్వే టిక్కెట్‌ ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వమే భరించింది. మహబూబ్‌నగర్‌ నుంచి శనివారం రాత్రి శ్రామిక్‌ రైలు ఏ ర్పాటు చేయించి వారి స్వరాష్ట్రమైన ఒడిశాకు పం పించారు. ఏర్పాట్లను నారాయణపేట కలెక్టర్‌ హరిచందన దగ్గరుండి పర్యవేక్షించారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మహబూబ్‌నగర్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకుని వలస కార్మికులతో మాట్లాడారు. వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఇప్పటికే రెండు నెలలుగా ఒక్కో వలస కార్మికుడికి నెలకు రూ.500, 12 కేజీల బియ్యం అందించిన సర్కారు.. ఇప్పుడు స్వస్థలాకు వెళ్లేందుకు ఖర్చులను కూడా భరించి పె ద్ద మనసును చాటుకుంటున్నది. 

ప్రత్యేక వాహనాల్లో రైల్వేస్టేషన్‌కు..

ఉమ్మడి జిల్లాలో లాక్‌డౌన్‌ కారణంగా వలస కార్మికులు వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. నారాయణపేట జిల్లాలో ఇటుక బట్టీల్లో పనిచేసే 1,600 మంది ఒడిశాకు చెందిన కూలీలు, మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి 100 మంది, వనపర్తి జిల్లా నుంచి 50 మంది.. మొత్తం 1,750 మందిని ఒడిషాలోని నవపహాడ్‌ జిల్లాకు పంపించేందుకు శ్రామిక్‌ రైలును ఏర్పాటు చేయించింది. శనివారం ప్రత్యేక వాహనాల్లో వలస కూలీలందరినీ ఆయా జిల్లాల నుంచి మధ్యాహ్నం వరకు మహబూబ్‌నగర్‌ రైల్వేస్టేషన్‌కు తరలించారు. భోజన వసతి సైతం కల్పించారు. వలస కార్మికులందరూ స్టేషన్‌కు చేరుకోవడంతో కిక్కిరిసిపోయింది. రైల్వే టిక్కెట్లన్నీ తెలంగాణ సర్కారే కొని వారికి ఉచిత ప్రయాణాన్ని ఏర్పాటుచేసింది. ప్రయాణం చేస్తున్న చిన్న పిల్లలతో సహా ప్రతి ఒక్కరికీ ఫుడ్‌ కిట్‌ అందించింది. ప్రతి కిట్‌లోనూ బిర్యానీ పాకెట్‌, బిస్కట్లు, 3 లీటర్ల తాగునీరు, చాక్‌లెట్లు, మాస్కులు, ఓఆర్‌ఎస్‌ పౌడర్‌ ఉన్నాయి. మహబూబ్‌నగర్‌ నుంచి రాత్రి బయలుదేరిన శ్రామిక్‌ రైలు ఎక్కడా ఆగకుండా వెళ్తుందని.. దాదాపుగా ఆ దివారం ఉదయం 10 గంటల్లోగా కార్మికులం తా తమ గమ్యస్థానాలకు చేరుకుంటారని అధికారులు తెలిపారు. ఇన్నాళ్లూ కుటుంబాలకు దూరంగా ఉన్న వలస కార్మికులంతా ప్ర భుత్వం అందించిన ఆపన్నహస్తానికి వలస కూలీలు కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలిపారు. 

భరోసానిచ్చిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌..

వలస కూలీలంతా ఒడిశా వెళ్తున్నారని తెలుసుకున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకుని వారితో మాట్లాడారు. ఎక్కడెక్కడ పనిచేసేందుకు వచ్చారనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. కరోనా సమస్య తీరాక మళ్లీ పాలమూరుకు రావాలని కోరారు. తెలంగాణ నిర్మాణంలో వివిధ రాష్ర్టాల నుంచి వచ్చే శ్రామికులంతా తమ వంతు పాత్ర పోషించారని కొనియాడారు. తెలంగాణ సర్కార్‌ వలస కార్మికులను తమ సొంత బిడ్డాల్లాగే చూసుకుందని అన్నారు. ప్రభుత్వం తమకు అన్ని ఏర్పాట్లు చేసిందని కార్మికులు మంత్రికి వివరించారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ణ సుధాకర్‌రెడ్డి కూడా రైల్వేస్టేషన్‌కు చేరుకుని వలస కార్మికులతో మాట్లాడి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. 

పర్యవేక్షించిన పేట కలెక్టర్‌..

ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా వలస కార్మికు లు నారాయణపేటలోని ఇటుక బట్టీల్లో పనిచేసేందుకు వచ్చారు. ఒడిశాలోని నవపహాడ్‌ జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన సుమారు 1,600 మం ది గత డిసెంబర్‌లో జిల్లాకు వచ్చారు. వీరంతా తమ గమ్యస్థానాలు చేరుకునేందుకు గాను పేట జిల్లా కలెక్టర్‌ హరిచందనకు దరఖాస్తు చేసుకున్నారు. వలస కార్మికులను వారి వారి ప్రాంతాలకు తరలించేందుకు ప్రత్యేకంగా రైల్వే శాఖతో మాట్లాడి శ్రామిక్‌ రైళ్లను ఏర్పాటు చేసింది. అందులో భాగంగానే మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లాలోని 1,750 మంది కార్మికులను శనివారం ప్రత్యేక రైలులో తరలించారు. ఈ ఏర్పాట్లను కలెక్టర్‌ పర్యవేక్షించారు. కార్మికుల వివరాల సేకరణ నుంచి, రైల్వేటిక్కెట్ల వరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. 

ఎవరికీ ఇబ్బంది లేకుండా చూశాం..

నారాయణపేట జిల్లాలోనే అత్యధికంగా 1,600 మంది వలస కార్మికులు ఇటుక బట్టీల్లో పనిచేసేందుకు వచ్చారు. వీరంతా మరికల్‌, మక్తల్‌, మద్దూరు, కృష్ణా మండలాల్లోని బట్టీల్లో పనిచేశా రు. లాక్‌డౌన్‌ కారణంగా సొంత రాష్ర్టానికి వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం వారికి ప్రత్యేక శ్రామిక్‌ రైలు ఏర్పాటు చేసింది. మహబూబ్‌నగర్‌ రైల్వేస్టేషన్‌ నుంచి వారందరినీ ఒడిశాకు పంపించాం. ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించింది. టిక్కెట్‌ డబ్బులను సైతం ప్రభుత్వమే భరించింది. చిన్న పిల్లలతో సహా ప్రతి ఒక్కరికీ ఫుడ్‌ కిట్లను అందించాం. ట్రైన్‌లో ప్రతి బోగీకి ఎమర్జెన్సీ కిట్‌ అందించాం. ట్యాబ్లెట్లు కూడా అందుబాటులో ఉంచాం. 

- హరిచందన, కలెక్టర్‌, నారాయణపేట


కడుపులో పెట్టుకుని చూసుకుండ్రు..

ఇక్కడి సర్కారు మ మ్మల్ని చాలా మంచిగా చూసుకున్నది. బువ్వకు తిప్పల్లేకుండా చూసిం డ్రు. డబ్బులు, బియ్యం ఇచ్చిండ్రు. ఏమైనా మీకు మేము ఉన్నామని చెప్పిం డ్రు. మా దగ్గరికి వచ్చి బండ్లను తీసుకువచ్చి స్టేషన్‌కు తీసుకువచ్చిండ్రు. ఇక్కడి సీఎం కేసీఆర్‌ సారూకు చాలా రుణపడి ఉంటాం.   

- కిసన్‌, బలాగీర్‌ జిల్లా, ఒడిశా రాష్ట్రం

సర్కారు సల్లగుండాలి..

కరోనా వచ్చింది.. మా గ్రామానికి వెళ్లేది కష్టమే అనుకున్నాం. మేము మరికల్‌ సమీపంలో ఇటుకలు తయారు చేసుకుంటూ బతికినం. ప్రతి రోజూ మా గ్రామానికి ఎప్పుడు పోతాం అనుకున్నాం. తెలంగాణ ప్రభుత్వం మాపై చూపిన దయ మాటల్లో చెప్పలేం. రైలులో మా రాష్ర్టానికి పంపించేందుకు చాలా కష్టపడిండ్రు. టెస్టులు చేసి ఊరికి పంపుతున్నారు. గింత కంటే మాకు ఇంకేమి కావాలి. సర్కారు సల్లగా ఉండాలి.

- మంజు, బలాగీర్‌ జిల్లా, ఒడిశా రాష్ట్రం


logo