మంగళవారం 19 జనవరి 2021
Mahabubnagar - May 20, 2020 , 02:27:14

బైలెల్లిన బస్సులు

బైలెల్లిన బస్సులు

  • 58 రోజుల తర్వాత రయ్‌..రయ్‌..
  • తొమ్మిది డిపోల నుంచి కదిలిన బస్సులు
  • తొలి రోజు 46 శాతం నడిచిన వైనం
  • ఉదయం 6 గంటల  నుంచే సందడి
  • నిర్ణీతదూరం, మాస్కులు తప్పనిసరి
  • చార్జీలు యథాతథం

కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా 58 రోజుల పాటు డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు మంగళవారం ఉదయం 6 గంటలకు రోడ్డెక్కాయి. మహబూబ్‌ నగర్‌ రీజియన్‌ పరధిలోని తొమ్మిది డిపోల నుంచి 46 శాతం బస్సులు నడిచాయి. చార్జీలు పెంచకుండా ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ తొలిరోజు ప్రయాణాలు సాగాయి. నిర్ణీత దూరం అమలు చేస్తూ యాభై శాతం మంది ప్రయాణికులతో బస్సులు నడిపారు. రీజియన్‌ పరధిలోని గద్వాల, మహబూబ్‌ నగర్‌, నారాయణపేట, వనపర్తి, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్‌, నాగర్‌కర్నూల్‌, షాద్‌నగర్‌ డిపోల్లో సందడి నెలకొన్నది. తొమ్మిది డిపోల పరిధిలో 965 బస్సులకు గాను తొలిరోజు 447 బస్సులు నడిపారు. కొల్లాపూర్‌ డిపో నుంచి అత్యధికంగా 69శాతం, అచ్చంపేట డిపో నుంచి అత్యల్పంగా 43 శాతం బస్సులు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి.

-మహబూబ్‌నగర్‌ ప్రతినిధి


 లాక్‌డౌన్‌లో భాగంగా 58 రోజులుగా డిపోల నుంచి బయటకు రాని ఆర్టీసీ బస్సులు మంగళవారం నుంచి రోడ్లపైకి వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఆర్టీసీ బస్సులను నడిపించాలని ఆదేశించారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అన్ని డిపోల పరిధిలో బస్సులు పునఃప్రారంభమయ్యాయి. రీజియన్‌ పరిధిలోని 9 డిపోల నుంచి మొదటి రోజు కేవలం ప్రధాన రూట్‌లలో మాత్ర మే బస్సులు తిప్పినట్లు అధికారులు తెలిపారు. శానిటైజర్లు వినియోగిస్తూ, భౌతికదూరం పాటిస్తూ నడిపించారు. 50శాతం మంది ప్రయాణికులతో బస్సులను తిప్పినా చార్జీలు పెంచకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.  

58రోజుల తర్వాత...

కరోనా దెబ్బకు ఎక్కడి బస్సులు అక్కడే ఆగిపోయాయి. అప్పటికే సమ్మెతో దెబ్బతిన్న ఆర్టీసీ తిరిగి ప్రారంభమై కోలుకుంటున్న దశలో కరోనా వైరస్‌ ఊహించని విధంగా మరోసారి దెబ్బకొట్టింది. మార్చి 22న జనతా కర్ఫ్యూ నుంచి మొదలుపెడితే  లాక్‌డౌన్‌తో 58 రోజులు డిపోలకు పరిమితమయ్యాయి. మంగళవారం ఉదయం 6  గంటల నుంచే ఆర్టీసీ బస్సులు రోడ్లపైకి వచ్చాయి. ఉమ్మడి జిల్లా పరిధిలోని 9 డిపోల్లో ప్రైవేట్‌, ఆర్టీసీ బస్సులు కలిపి మొత్తం 965 ఉన్నాయి. మంగళవారం 447 బస్సులు నడిచాయి. అత్యధికంగా కొల్లాపూర్‌ డిపోలో 69శాతం తిరిగాయి. అత్యల్పంగా అచ్చంపేటలో 43శాతం. మొత్తంగా రీజియన్‌ పరిధిలో 46 శాతం బస్సులు నడిచాయి. 

శానిటైజర్లు.. భౌతికదూరం తప్పనిసరి

బస్సెక్కాలంటే ప్రయాణికులు మాస్కు ధరించి క్యూలో నిలబడి కండక్టర్‌ వద్ద ఉన్న శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవాలి. తర్వాతే బస్సెక్కాలి. బస్సులోనూ ముగ్గురు కూర్చునే చోట మధ్య సీటు వదిలేసి కూర్చోవాలి. ఇద్దరు కూర్చునే చోట ఒక్కరే. మాస్కు లేకుంటే బస్సులోకి నో ఎంట్రీ.  ప్రస్తుత పరిస్థితితో బస్సులో సీటింగ్‌ సామర్థ్యం సగానికి సగం తగ్గిపోతుంది. దీంతో ఆర్టీసీకి భారీగా నష్టం వాటిల్లుతుంది.  

అన్ని ప్రధాన రూట్‌లలో..

గద్వాల నుంచి హైదరాబాద్‌, వనపర్తి, మహబూబ్‌నగర్‌, కొల్లాపూర్‌, అలంపూర్‌ వరకు.. వనపర్తి నుంచి హైదరాబాద్‌, కొల్లాపూర్‌, నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌, అలంపూర్‌ వరకు.. కొల్లాపూర్‌ నుంచి నాగర్‌కర్నూల్‌, హైదరాబాద్‌ వరకు.. నాగర్‌కర్నూల్‌ నుంచి అచ్చంపేట, కల్వకుర్తి, హైదరాబాద్‌, కొల్లాపూర్‌ వరకు.. కల్వకుర్తి నుంచి దేవరకొండ, హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌ వరకు.. మహబూబ్‌నగర్‌ నుంచి హైదరాబాద్‌, అలంపూర్‌ చౌరస్తా, మక్తల్‌ వరకు ఇలా అన్ని ప్రధానరూట్‌లలో బస్సులు తిరిగాయి. అయితే గ్రామాలకు మాత్రం మొదటిరోజు బస్సులు నడుపలేదు. దీంతో ఆయా పట్టణ సమీపాల్లో దిగి వారి ఊళ్లకు సొంత వాహనాలు, ఆటోలు, జీపుల్లో ప్రయాణికులు వెళ్లారు. 

ఆర్టీసీ బస్సెక్కిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

మహబూబ్‌నగర్‌ పట్టణంలోని వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మంగళవారం తిరిగి హైదరాబాద్‌ వెళ్లే క్రమంలో ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద పరిస్థితిని పరిశీలించారు. కాసేపు ప్రయాణికులతో మాట్లాడారు. అనం తరం హైదరాబాద్‌ బస్సెక్కి పయనమయ్యారు. ప్రయాణికులు, కండక్టర్‌తో ముచ్చటిస్తూ మంత్రి హైదరాబాద్‌ చేరుకున్నారు. సాక్షాత్‌ మంత్రే బస్సెక్కడంతో ప్రయాణికులు అవాక్కయ్యారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణంపై ప్రయాణికుల్లో విశ్వసనీయత, భరోసా పెంచేందుకే ప్రయాణించినట్లు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. 

మాస్కు ఉంటేనే టికెట్‌

లాక్‌డౌన్‌ సడలింపుల మేరకు 58 రోజుల తర్వాత విధుల్లో చేరాం. బస్సు ఎక్కే వారికి మాస్కు ఉంటేనే టికెట్లు ఇస్తున్నాం. బస్సు ఎక్కే వారిని శానిటైజ్‌ చేస్తున్నాం. ప్రయాణి కులు నిబంధనలు పాటించాలి.

- సంపత్‌రెడ్డి, కండక్టర్‌, వనపర్తి డిపో

సులభతరంగా వెళ్తున్నాం

బస్సులు నడపడంతో గద్వాల నుంచి నాగర్‌కర్నూల్‌కు విధులకు సులభంగా వెళ్తున్నాం. లాక్‌డౌన్‌ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. బస్సులో భౌతిక దూరం పాటిస్తు మాస్కులు ధరించి ప్రయాణిస్తున్నాం. 

- ఇఫ్తార్‌ అహ్మద్‌, నీటిపారుదల శాఖ ఉద్యోగి

సులువుగా ప్రయాణం

బస్సులు నడపడంతో మా తాతయ్య దిన కార్యక్రమాలకు హాజరవుతున్నాను. బస్సులు నడపకపోతే వెళ్లేవాళ్లం కాదు. లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా బస్సులు నడుపడంతో ప్రయాణం సులువుగా సాగుతుంది. 

- బిందు, ప్రయాణికురాలు, పెబ్బేరు


నేటి నుంచి పల్లెలకు..

మంగళవారం 46 శాతం బస్సులు తిరిగాయి. అన్ని బస్సులు కూడా ప్రధాన రూట్‌లలోనే తిప్పాం. హైదరాబాద్‌ బస్సులు ఆరాంఘర్‌ వరకు మాత్రమే తిరుగుతున్నాయి. ఇక రీజియన్‌ పరిధిలోని అన్ని ప్రధాన రూట్‌లలో బస్సులు ప్రారంభమ య్యాయి. రాష్ర్టాల సరిహద్దుల్లో మాత్రం మన రాష్ర్టానికి సంబంధించిన చివరి ముఖ్యమైన స్టేజీ వరకు బస్సులను తిప్పాం. కర్నూ ల్‌ వైపు అలంపూర్‌ చౌరస్తా  వరకు, రాయిచూర్‌ వైపు మక్తల్‌ వరకు, శ్రీశైలం వైపు అచ్చంపేట వరకు  బస్సులు తిరిగాయి. నేటి నుంచి పల్లెలకు సైతం బస్సులు తిప్పుతాం. 

- ఉషాదేవి, ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్‌, మహబూబ్‌నగర్‌