శుక్రవారం 05 జూన్ 2020
Mahabubnagar - Apr 05, 2020 , 03:33:00

హమ్మయ్యా... కొత్త కేసుల్లేవ్‌..!

హమ్మయ్యా... కొత్త కేసుల్లేవ్‌..!

  • శనివారం రోజు పాజిటివ్స్‌ నిల్‌ 
  • ఊపిరి పీల్చుకున్న ప్రజలు 
  • ప్రార్థనా మందిరాల్లో దాక్కున్న10 మంది ఉత్తరాది వారు
  • అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • తబ్లిగీ జమాత్‌కు వెళ్లివచ్చిన వారి కోసం గాలింపు

పాలమూరు ఊపిరి పీల్చుకుంది. శనివారం ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాకపోవడం కాస్తా ఉపశమనాన్ని కల్గించింది. ఉత్తరాది నుంచి వచ్చి మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రానికి వచ్చి ప్రార్థనా మందిరాల్లో తలదాచుకున్న పది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని వైద్య పరీక్షల నిమిత్తం జనరల్‌ దవాఖానకు తరలించారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరు గ్రామానికి చెందిన యాభై ఏండ్ల మహిళ కరోనాతో మృతి చెందిన విషయం విదితమే. ఆమె అంత్యక్రియలకు నవాబుపేట మండలం చేగూరుకు చెందిన  సమీప బంధువొకరు వెళ్లొచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆయనను క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు.

మహబూబ్‌నగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో శనివారం నాడు ఒక కొత్త కరోనా పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదు. ఉమ్మడి జిల్లాలో శుక్రవారం నాటికి 15 పాజిటివ్‌ కేసులు నమోదవగా.. శనివారం కొత్తగా కేసులు లేకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని సంతోషిస్తున్న సమయంలో తబ్లిగీ జమాత్‌కు వెళ్లివచ్చిన వారికి పాజిటివ్‌ రావడంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నారాయణపేట, వనపర్తి మినహా అన్ని జిల్లాల్లో తబ్లిగీ జమాత్‌ కారణంగా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.  

శనివారం నమోదు కాని కేసులు..

ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాలో శుక్రవారం వరకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 15. మహబూబ్‌ నగర్‌ 7, జోగుళాంబ గద్వాల 6, నాగర్‌ కర్నూలు 2 కేసులు నమోదు అయ్యాయి. పేట, వనపర్తి జిల్లాలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్‌ కేసులు లేవు. 

ప్రార్థనా మందిరాల్లో 10 మంది

మహబూబ్‌నగర్‌ పట్టణంలోని రెండు ప్రార్థనా మందిరాల్లో 10 మంది ఉత్తరాది వారు ఉన్నారనే పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. రామ్‌ మందిర్‌ చౌరస్తా సమీపంలో ఉండే ఓ ప్రార్థనా మందిరంలో 8 మంది ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ప్రార్థనా మందిరంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఇద్దరు, నారాయణపేట జిల్లా మక్తల్‌కు చెందిన వారు ఇద్దరిని అదుపులోకి తీసుకుని... అందరినీ ప్రభుత్వ జనరల్‌ దవాఖానకు తరలించారు. వారి నుంచి రక్త నమూనాలను  సేకరించి కరోనా నిర్ధారణ పరీక్షలకు పంపించనున్నట్లు డీఎస్పీ శ్రీధర్‌ ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. విచారణ తర్వాత వారు ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుస్తుందని ఆయన అన్నారు. 

కరోనాతో చనిపోయిన వృద్ధురాలి అంత్యక్రియలకు..

రంగారెడ్డి జిల్లా చేగూరుకు చెందిన ఓ మహిళ కరోనాతో మృతి చెందింది. ఆమె దగ్గరి బంధువైన నవాబ్‌పేట మండలం చౌడూరుకు చెందిన ఓ వ్యక్తి అంత్యక్రియలకు వెళ్లివచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు సదరు వ్యక్తిని, ఆయన కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్‌లో ఉండమని సూచించారు. వారి రక్త నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించారు. 


logo