శనివారం 11 జూలై 2020
Mahabubnagar - Mar 30, 2020 , 02:08:02

అన్ని వసతులూ కల్పిస్తాం.. సంతోషంగా జీవించండి

అన్ని వసతులూ కల్పిస్తాం.. సంతోషంగా జీవించండి

  • పేదలను ఆదుకునేందుకు ముందుకొస్తున్న దాతలు
  • ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌
  • పాలమూరులో 100 మంది నిరాశ్రయులకు దుస్తులు పంపిణీ  చేసిన మంత్రి

మహబూబ్‌నగర్‌, నమస్తే తెలంగాణ/మున్సిపాలిటీ : నిరాధారణకు గురయ్యామని ఆందోళన వద్దు.. అన్నం పెడుతాం.. దుస్తులు ఇస్తాం.. సంతోషంగా జీవించాలని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్‌ కమ్యూనిటీ హాల్‌లో అనాథ, యాచకులకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా వారితో మంత్రి మాట్లాడారు. మీరు ఏ ఇంటి గడప తొక్కకుండా అన్ని వసతులు కల్పిస్తామని, మీరు చేయాల్సిందల్లా మీకు కేటాయించిన భవనం నుంచి బయటకు రాకుండా పరిశుభ్రంగా ఉండాలని సూ చించారు. సీఎం కేసీఆర్‌ ఎక్కడా ఎవరూ ఆకలితో ఉండొద్దని చెప్పడం జరిగిందని గుర్తు చేశారు. పట్టణ కేంద్రంలో దాతలు పేదలను ఆదుకునేందుకు ముందుకొస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ రాజేశ్‌, కౌన్సిలర్‌ వేదవత్‌, రాంరెడ్డి, రమేశ్‌ సరోడే తదితరులు సహకారం చేసేందుకు ముందుకొస్తున్నారని తెలిపారు. రైల్వేస్టేషన్‌ పరిసర ప్రాంతంలో 100 మంది నిరాశ్రయులను గుర్తించి వారికి ప్రత్యేకంగా భవనంలో ఉంచి ఎయిర్‌కూలర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రోజు కూ రెండు మార్లు స్నానాలు చేయాలని, మీరు ఎలాంటి అనారోగ్యానికి గురైనా డాక్టర్లు మీ వద్దకు వచ్చి వైద్య పరీక్షలు చేయడం జరుగుతుందని తెలిపారు. కరోనా నివారణ తర్వాత మీకు మంచి జీవితం అందించేందుకుగాను అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అందజేసిన దుస్తులను పేదలు వేసుకుని సంతోషం వ్యక్తం చేశారు.  

రోడ్డు మరమ్మతులు చేపట్టండి

 జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేయాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆదేశించారు. బస్టాండ్‌ సమీపంలో జరుగుతున్న బ్రిడ్జి పనులను ఆయన పరిశీలించారు. యంత్రాల ఆధారిత పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మరమ్మతు పనులు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. యంత్రాల ఆపరేటింగ్‌ సిబ్బంది కరోనా పట్ల జాగ్రత్తలు పాటించాలన్నారు. మంత్రి వెంట అధికారులు ఉన్నారు. 

మెడికల్‌ కిట్ల పంపిణీ

  వైద్య అధికారులకు, మండల అధికారులకు కరోనా నివారణకు సంబంధించిన మెడికల్‌ కిట్లను కలెక్టరేట్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలు నియమ నిబంధనలు పాటించాలన్నారు. రాత్రి, పగలు భేదం లేకుండా ఉద్యోగులు శ్రమిస్తున్నారని, వారి సేవలు చిరస్మరణీయమన్నారు. ఉద్యోగులు ఆరోగ్యంగా ఉండేందుకు గాను కరోనా నివారణ కిట్లను అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. వ్యక్తిగత ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ వెంకట్రావు, ఉద్యోగులు పాల్గొన్నారు. 


logo