సోమవారం 25 మే 2020
Mahabubnagar - Mar 30, 2020 , 01:33:10

వైద్యులకు వందనం

వైద్యులకు వందనం

  • కరోనా కట్టడికి అలుపెరుగని పోరు
  • రేయింబవళ్లూ శ్రమిస్తున్న డాక్టర్లు
  • అప్రమత్తంగా ఉన్న వైద్య సిబ్బంది
  • నిరంతరం పనిచేస్తున్న ఐసోలేషన్‌ కేంద్రాలు

‘వైద్యో నారాయణ హరి’ అన్న నానుడిని నిజం చేస్తున్నారు డాక్టర్లు. ప్రపంచాన్ని గడగడలాడిస్త్ను కరోనా కట్టడికి రేయింబవళ్లూ శ్రమిస్తున్నారు. అనుమానితులకు ఐసోలేషన్‌ కేంద్రాల్లో సేవలందిస్తున్నారు. సాటి మనిషిని బతికించాలన్న వృత్తి ధర్మాన్ని పాటిస్తూ కుటుంబాలకు దూరంగా ఉంటూ వైద్య చికిత్సలు చేస్తున్నారు. దవాఖానకు కరోనా అనుమానితులు వస్తేనే పారిపోతున్న ఈ తరుణంలో వారికి వైద్యసేవలందిస్తుండటంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తమ ప్రాణాలు ఫణంగా పెడుతున్న వైద్యులకు యావత్‌ సమాజం ప్రణమిల్లుతున్నది. 

మహబూబ్‌నగర్‌ ప్రధాన ప్రతినిధి/నమస్తే తెలంగాణ : కరోనా మహమ్మారి.. దీనికి ధనిక, పేద.. అమెరికా, ఇండియా.. నలుపు, తెలుపు.. పల్లె, పట్టణం అన్న తేడా లేదు. ఖండాంతరాలు వ్యాపించి ప్రపంచ మానవాళిని ఉక్కిరి బిక్కరి చేస్తున్న వైరస్‌. ఇది కంటికి కనిపించని వైరస్‌. ఈ వైరస్‌ను ఎదుర్కోలేక ఎన్నో దేశాలు వెనుకబడిపోయి దీనంగా దేవుడికి మొరపెట్టుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో 130 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో కేవలం 40వేల వెంటిలేటర్లున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా వైద్య సేవలు అందిస్తూ దేశ పౌరుల ప్రాణాలను కాపాడుతున్న వైద్యులు నిజంగా దేశ రక్షణలో విధులు నిర్వర్తిస్తున్న సిపాయిలతో సమానంగా భావించొచ్చు. వారు సరిహద్దుల్లో నిరంతరం కాపలా కాస్తూ శత్రువుల నుంచి దేశాన్ని రక్షిస్తూ ఉంటే.. కరోనా వైరస్‌తో నిత్యం పోరాటం చేస్తున్న ప్రజలను వైద్యులు రక్షిస్తున్నారు. ఎక్కడా వెనుకడుగు వేయకుండా ధైర్యంగా వైద్య సేవలు చేస్తున్నారు. అవసరమైన చోట డబుల్‌ డ్యూటీ చేస్తూ రోగులను రక్షిస్తున్నారు. అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తూ కరోనా మహమ్మారిపై పోరులో ప్రధాన పాత్ర వహిస్తున్నారు. అందుకే డాక్టర్ల సేవలు అభినందనీయం.

అలుపెరగని పోరాటం

 కరోనా మహమ్మారిపై వైద్యులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. సాటి మనుషులను బతికించాలనే వృత్తి ధర్మాన్ని నమ్ముకున్న డాక్టర్లు.. వారి కుటుంబాన్ని ఫణంగా పెట్టి ప్రజా సేవ చేస్తున్నారు. దవాఖానలకు కరోనా అనుమానిత వ్యక్తులను చూస్తే ఆమడ దూరం వెళ్లిపోతున్న పరిస్థితుల్లో.. ప్రాణాంతక వైరస్‌ను పారదోలేందుకు వారు చేస్తోన్న సేవలు వెలకట్టలేనివి. మార్చి 2వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో మొదలైన కరోనా కలకలంతో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో జనరల్‌ దవాఖానతో పాటు జిల్లా, ఏరియా దవాఖానల్లో వైద్యులు, వైద్య సిబ్బంది, పారామెడికల్‌ స్టాఫ్‌, 108 సిబ్బంది ఎంతో కృషి చేస్తున్నారు. అనుమానితులను గుర్తించి వారికి వైద్య సేవలు అందిస్తూ జాతి క్షేమం కోసం 24 గంటలూ శ్రమిస్తున్నారు. సర్వం బంద్‌ పాటిస్తోన్న ప్రస్తుత సందర్భంలో తిండి తిప్పలకు ఓర్చుకొని ప్రజల మేలుకై పాటుపడుతున్నారు. కట్టుకున్న సంబంధాలైనా, రక్తం పంచుకు పుట్టిన వారైనప్పటికీ కరోనా వైరస్‌ ముందు ఏ బంధాలు నిలవలేకపోతున్నాయి. అమ్మా, నాన్న, అక్కా, చెల్లి, అన్నా, తమ్ముడు వంటి బంధాలు సైతం తోడు లేని ప్రత్యేక సందర్భంలో వైద్యులే అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. విదేశాల నుంచి ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు వచ్చిన సుమారు 500 మందిని స్వీయ పర్యవేక్షణలో ఉంచి నిరంతరం వారి సేవలోనే వైద్య సిబ్బంది పని చేస్తుండటం విశేషం. కంటికి రెప్పలా వారిని చూస్తూ ఇతరులకు కరోనా వ్యాపించకుండా అనేక జాగ్రత్తలను తీసుకుంటున్నారు. 

వైద్యులే మానవాళికి ప్రత్యక్ష దైవాలు

  కరోనా దెబ్బకు ప్రపంచమే లాక్‌డౌన్‌ అయిన ప్రత్యేక సందర్భంలో వైద్యులే మానవాళికి ప్రత్యక్ష దేవాలుగా నిలుస్తున్నారు. అన్ని మతాలకు చెందిన దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు, మసీదులు మూత పడగా కేవలం ఇప్పుడు దవాఖానలు మాత్రమే తెరుచుకుని ప్రజా సేవలో తరిస్తున్నాయి. మహబూబ్‌నగర్‌ జనరల్‌ దవాఖానతో పాటు నాగర్‌కర్నూలు, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లా దవాఖానల్లోని వైద్యులు 24 గంటల పాటు కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్నారు. వీరికి పారామెడికల్‌ సిబ్బంది తోడుగా నిలుస్తున్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేశారు. హోం క్వారంటైన్‌ ఉన్న సుమారు 500 మందిలో దాదాపు 400 మంది క్వారంటైన్‌ పీరియడ్‌ (14రోజులు) అయిపోయింది. సుమారు మరో 100 మంది క్వారంటైన్‌ పీరియడ్‌ సైతం వచ్చే నెల 5తో ముగుస్తుంది. క్వారంటైన్‌లో ఉన్న వారికి మెడికల్‌ ఆఫీసర్లు, ఆశ వర్కర్లు, సూపర్‌వైజర్లు, ఏఎన్‌ఎంలు క్షేత్ర స్థాయిలో అలుపెరగని సేవలు అందిస్తున్నారు. ఆర్‌బీఎస్‌కే బృందాలు సైతం కరోనాపై పోరులోనే పనిచేస్తున్నారు. కరోనా వ్యాధి బారిన పడకుండా నిరంతరం అప్రమత్తతతో వైద్యులంతా ప్రత్యక్ష దేవుళ్లుగా ప్రజలకు మేలు చేస్తున్నారు.

కరోనాపై పోరు సాగిస్తున్నాం

మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ జనరల్‌ దవాఖానలో 60 మందికిపైగా వైద్యులతో కరోనా లక్షణాలు ఉన్న వారికి వైద్యసేవలు అందిస్తున్నాం. 25 ఐసోలేషన్‌ బెడ్లతోపాటు ఐసీయూను ప్రత్యేకంగా ఏ ర్పాటు చేశాం. అన్ని రకాల వైద్యసేవలు ఉన్నాయి. కరోనా లక్షణాలతో వచ్చిన రోగిని మా అతిథిగా భావించి వైద్యసేవలు అందిస్తున్నాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దవాఖానలో ప్రతి ఒక్కరూ నిర్ణీత దూరం పాటించేలా చూస్తున్నాం. రోగికి మాస్క్‌తోపాటు శానిటరి కిట్‌, సబ్బులిస్తున్నాం. రోగికి దవాఖానాలోని కరోనా వార్డులో టీవీతోపాటు వైఫై సౌకర్యం కూడా కల్పించాం. క్రిటికల్‌ కేసు ఉంటే హైదరాబాద్‌ గాంధీ దవాఖానాకు తరలిస్తాం. 

- డాక్టర్‌ రాంకిషన్‌, సూపరింటెండెంట్‌, మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ జనరల్‌ దవాఖాన

అన్ని ఏర్పాట్లు చేశాం

  కరోనా వైరస్‌ని అరికట్టేందుకు జిల్లాలో వై ద్య, ఆరోగ్య శాఖ తరుఫున అన్ని ఏర్పా ట్లు చేశాం. వ్యాధి నిర్మూలన కోసం అన్ని గ్రామా ల్లో వైద్య సిబ్బందితో అవగాహన కార్యక్రమాలు చేపట్టాం. వ్యాధిసోకినట్లు అనుమానాలు తలెత్తితే వెంటనే జిల్లా కేంద్రంలో దవాఖానకు తరలించేందుకు చర్య లు తీసుకున్నాం. అలంపూర్‌ హరిత హోటల్‌లో 10 పడకలతో ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటు చేశాం. ఇటిక్యాల మండలం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 78 పడకలతో క్వారంటైన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశాం

- సునీత, డీఎంహెచ్‌వో, జోగుళాంబ గద్వాల జిల్లా


 అబ్జర్వేషన్‌లో బాధితులు

కరోనా వ్యాధి లక్షణాలు కలిగి ఉన్న వారిని జిల్లా దవాఖానలోని ఐసోలేషన్‌ సెంటర్‌లో అబ్జర్వేషన్‌లో ఉంచాం. ప్రస్తుతం ఐదు మంది అనుమానితుల రక్త నమూనాలను పరీక్షా కేం ద్రానికి పంపించాం. నాగర్‌కర్నూల్‌ పట్టణానికి చెందిన ఒకే కుటుంబంలోని తల్లీ, కూతురు, తాడూరు మండలం గుంత కోడూరుకు చెందిన మరో వ్యక్తి, నాగర్‌కర్నూల్‌లోని రాంనగర్‌ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి చెందిన రక్త నమూనాలను పరీక్షల కోసం పంపించాం. వారి రిపోర్టు రావాల్సి ఉంది. నెగటీవ్‌గా వచ్చిన బాలుడిని మరిన్ని రోజులు అబ్జర్వేషన్‌లో ఉంచి డిశ్చార్జ్‌ చేస్తాం. 

- డాక్టర్‌ ప్రభు, సూపరింటెండెంట్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లా దవాఖాన 


లాక్‌డౌన్‌తోనే కట్టడి సాధ్యం

కరోనా నిర్మూలన కేవలం లాక్‌డౌన్‌, బయటకు వచ్చిన సమయంలో నిర్ణీత దూరాన్ని పాటించడం వల్లనే కట్టడి చేయగలం. వైరస్‌ నిర్మూలన సంబంధించి ప్రత్యేక మందులు ఇప్పటి వరకు ఏమీ లేవు. జాగ్రత్తలు పాటిస్తేనే వ్యాధిని దూరం చేయొచ్చు. దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే ప్రభుత్వ దవాఖానను సంప్రదించాలి.

- హరీశ్‌సాగర్‌, సూపరింటెండెంట్‌, వనపర్తి దవాఖాన 

కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నాం

జ్వరం, దగ్గు, జలుబు ఉన్న వారికి ప్రభుత్వ జనరల్‌ దవాఖానలో కరోనా వార్డు (జీరో ఓపీ)లో కోర్‌ కమిటీ వైద్య బృందం ఆధ్వర్యంలో నిరంతరం వైద్య సేవలు అందిస్తున్నాం. 3 లక్షణాలు ఉన్న వారికి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నాం. కరోనా లక్షణాలతో ఉన్న వారి నమూనాలను సేకరించి వైద్య పరీక్షలు అందిస్తాం. పాజిటివ్‌ వచ్చిన వారిని గాంధీ దవాఖానకు తరలిస్తున్నాం. 

- డాక్టర్‌ జీవన్‌, డిప్యూటీ సూపరింటెండెంట్‌, మహబూబ్‌నగర్‌


logo