శుక్రవారం 05 జూన్ 2020
Mahabubnagar - Mar 17, 2020 , 02:52:36

‘డబుల్‌' ఆనందం

‘డబుల్‌' ఆనందం

నిరుపేదల సొంతింటి కలను సీఎం కేసీఆర్‌ సాకారం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోనే అత్యధికంగా 7,783 ఇండ్లు మంజూరు చేశారు. నిర్మాణానికి ప్రభుత్వం రూ.11,917కోట్లు కేటాయించింది. ఇప్పటి వరకు జిల్లాలో 2,342 ఇండ్లను ప్రభుత్వం నిర్మించింది. క్రిష్టియన్‌ పల్లిలో 310, మూసాపేట మండలం నిజలాపూర్‌లో 20 ఇండ్లు నిర్మించి కేటాయించారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉంటున్నది. మిగతా ఇండ్లను పూర్తి చేసి త్వరలోనే అందించేందుకు సర్కారు సన్నాహాలు చేస్తున్నది.

  • ఉమ్మడి జిల్లాలోనే పాలమూరు ఫస్ట్‌
  • పారదర్శకంగా ‘డబుల్‌' ఇండ్ల కేటాయింపు
  • జిల్లాకు 7,783 గృహాలు మంజూరు
  • ఇప్పటికే పూర్తయినవి 2342..కేటాయించినవి 330
  • త్వరలో మరింత మందికి ఇండ్లు

మహబూబ్‌నగర్‌ ప్రధాన ప్రతినిధి/నమస్తే తెలంగాణ : పేదల కళ్లల్లో ఆనందాలు డబుల్‌ అయ్యాయి. ఇన్నాళ్లు ఉం డేందుకు నిలువ నీడలేని నిరుపేదలకు సీఎం కేసీఆర్‌ స ర్కారు తీసుకువచ్చిన ఉచిత డబుల్‌ బెడ్రూం ఇండ్ల పథకం వల్ల ఆసరా లభిస్తున్నది. జిల్లాలో ఇప్పటి వరకు 7783 డబుల్‌ బెడ్రూం ఇండ్లు మంజూరు కాగా.. ఇప్పటికే 2342 ఇండ్ల నిర్మాణం పూర్తయ్యింది. ఇక 330 మంది లబ్ధిదారులు జిల్లాలో గృహ ప్రవేశాలు సైతం చేసి ఆనందంగా జీవిస్తున్నారు. త్వరలో మరో 2వేలకు పైగా ఇండ్లను లబ్ధిదారులకు అందజేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పేదల పాలిట వరంగా లబ్ధిదారులు పేర్కొంటున్నారు. మరోవైపు ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో డబు ల్‌ బెడ్రూం ఇండ్ల కోసం రూ. 11917 కోట్లు కేటాయించడంపై జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వర కు ప్రభుత్వమే స్థలం సేకరించి ఇండ్లు నిర్మించి లబ్ధిదారులకు అందజేయగా.. ఇకపై సొంత జాగా ఉన్న వారు ఇండ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇవ్వనున్నట్లు ప్రకటించడంతో పేదలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

జిల్లాకు 7783 ఇండ్లు మంజూరు

మహబూబ్‌నగర్‌ జిల్లాకు పెద్ద సంఖ్యలో డబుల్‌ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం కేటాయించింది. ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా జిల్లాలో 7783 డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వగా, ఇందులో 7473 ఇండ్ల నిర్మాణానికి అధికారులు టెండర్లు పిలిచారు. వీటిలో 7057 ఇండ్ల నిర్మాణానికి టెండర్లు ఖరారు చేశారు. 4469 ఇండ్ల నిర్మాణం ప్రారంభించారు. వాటిలో 2342 ఇండ్ల నిర్మాణం పూర్తయ్యింది. మరో 2121 ఇండ్లు వివిధ దశల్లో ఉన్నాయి. అత్యధికంగా మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంలో 2095 ఇండ్ల నిర్మాణాలు ప్రారంభం కాగా.. 1994 ఇండ్లు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు 310 ఇండ్లను లబ్ధిదారులకు అందజేశారు. మరో 1684 ఇండ్లు లబ్ధిదారులకు అందజేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇక దేవరకద్ర నియోజకవర్గంలో 950 ఇండ్లు మంజూరు కాగా... 648 ఇండ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచారు. 598 ఇండ్ల నిర్మాణం ప్రారంభమైంది. ఇందులో 20 మూసాపేట మండలం నిజాలాపూర్‌లో గత నవంబర్‌ 23న లబ్ధిదారులకు అందజేశారు. నియోజకవర్గంలో మరో 578 ఇండ్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇక జడ్చర్ల నియోజకవర్గానికి 2760 ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేయగా... 2752 ఇండ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచారు. వీటిలో 1296 ఇండ్ల పనులు ప్రారంభమయ్యాయి. అందులో 328 ఇండ్ల నిర్మాణం పూర్తయ్యింది. వీటిని త్వరలో లబ్ధిదారులకు అందజేయనున్నారు. 

సొంత జాగా ఉంటే డబుల్‌ ఇంటికి అవకాశం..

ఇప్పటి వరకు సర్కారు స్థల సేకరణ చేసి ఇండ్ల నిర్మాణం చేసి లబ్ధిదారులకు ఉచితంగా అందిస్తూ వచ్చింది. అయితే, చాలా మంది సొంత స్థలం ఉన్న పేదలు తమకు డబుల్‌ బెడ్రూం ఇండ్లు కట్టుకునేందుకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో బడ్జెట్‌లో రూ. 11917 కోట్ల కేటాయించారు. ఈ ఏడాది సుమారు లక్ష ఇం డ్లు కట్టించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో జిల్లా కు సుమారు 3వేలకు పైగా ఇండ్లు వచ్చే అవకాశం ఉంది. సొంత జాగా ఉన్న పేదలు ఇక తమకు ఇండ్లు కట్టుకునే అవకాశం లభిస్తుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు పారదర్శకంగా ఇండ్ల కేటాయింపు చేస్తూ వచ్చిన సర్కారు.. సొంత జాగాల్లో నిర్మించుకునే వారికి సైతం పారదర్శకంగా ఇండ్లను కేటాయించనున్నారు. 

లబ్ధిదారుల్లో సంతోషం

జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్‌పల్లిలో 310, దేవరకద్ర ని యోజకవర్గం మూసాపే ట మండలం నిజాలాపూర్‌లో 20 మంది లబ్ధిదారులకు ఇండ్లను కేటాయించారు. లబ్ధిదారులు ఆయా ఇండ్లలో ప్రస్తు తం సంతోషంగా జీవిస్తున్నారు. పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా డబుల్‌ ఇండ్లు నిలుస్తున్నాయి. 

కిరాయికి ఉండేదాన్ని...

గతంలో పాత పాలమూరులో సుమారు 40 ఏండ్లు కిరాయి ఇంట్లో ఉండేటోళ్లం. కేసీఆర్‌ సర్కారు వచ్చిన తర్వాత పేదలకు ఉచితంగా డబుల్‌ బెడ్రూం ఇండ్లు కట్టిస్తామని చెప్పినా నమ్మలేదు. కానీ మేం కలలో కూడా అనుకోని విధంగా మాకు డబుల్‌ బెడ్రూం ఇచ్చినారు. క్రిస్టియన్‌పల్లిలో కట్టిన 310 ఇండ్లలో మాకు ఒకటి అందించారు. మా లాంటి పేదల కోసం సర్కారు కట్టించిన ఈ డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల వల్ల మాకు ఓ నీడ లభించింది. సీఎం కేసీఆర్‌, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. 

- బాలనాగమ్మ, మహబూబ్‌నగర్‌

సమైక్య పాలనలో ఆగం చేసిండ్రు...

సమైక్య పాలనలో పాలమూరును గత పాలకులు ఆగం చేసిండ్రు. మా లాంటి నిరుపేదలు నివసించేందుకు పక్కా గృహాలు అడిగినా పట్టించుకోలేదు. అగ్గిపెట్టె లాంటి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వగా, అవి ఎవరికి ఇచ్చారో కూడా తెలియదు. పేదల కష్టాలు తెలిసిన ఈ ప్రభుత్వం ఇప్పుడు మాకు ఇచ్చిన డబుల్‌ బెడ్రూం ఇంటిలో ఆనందంగా ఉంటున్నాం. స్వరాష్ట్రం వస్తే ఏమొస్తుందన్న వారికి మాలాంటి నిరుపేదలకు ఇచ్చిన డబుల్‌ బెడ్రూం ఇండ్లే ఓ సాక్ష్యం. సీఎం కేసీఆర్‌ లాంటి పాలకులుంటే పేదలకు ఎప్పటికీ న్యాయం జరుగుతుంది. 

- పృథ్వీ, డిగ్రీ విద్యార్థి, మహబూబ్‌నగర్‌

మాకు పెంకుటిల్లు ఉండేది

మేము అంతగా డబ్బులు ఉన్నోళ్లం కాదు. మాకు పెంకుటిల్లు ఉండేది. ఆ ఇంట్లో ఉన్నం త కాలం వర్షం వచ్చినా.. పెద్దగా గాలులు వ చ్చినా అంతా మట్టి రాలి పడేది. తినే సమయంలో కూడా మట్టి రాలిన సందర్భాలు ఉ న్నాయి. ఉన్న ఇల్లు కూలిపోవడానికి రావడం తో వేరే వాళ్ల ఇంట్లో ఉండేటోళ్లం. మాకు డబుల్‌ బెడ్రూం ఇల్లు మం జూరు చేసిన తర్వాత ఇప్పుడు ఆ ఇంట్లో సంతోషంగా ఉంటున్నాం. 

- డంకూరి నాగమ్మ, నిజాలాపూర్‌

మాకు ఇల్లు లేకుండే..

మాకు ఉండేందుకు ఇల్లు లేకుండే. గ్రామంలోనే కిరాయికి ఉండేవాళ్లం. ఇల్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డాం. మాకు రెండో విడతలో డబుల్‌ బెడ్రూం ఇల్లు వచ్చింది. దీంతో గృహ ప్రవేశం చేయకపోయినా మాకు ఇల్లు లేకపోవడంతో  తాత్కాలికంగా వచ్చి మాకు లక్కీడిప్‌ ద్వారా వచ్చిన ఇంట్లో ఉంటున్నాం. మాకు ఇల్లు రావడంతో సొంత ఇంటి కల నెరవేరింది. 

- పల్లె వరలక్ష్మి, నిజాలాపూర్‌


logo