గురువారం 04 జూన్ 2020
Mahabubnagar - Feb 27, 2020 , 23:40:23

రహదారులకు రాచఠీవి!

రహదారులకు రాచఠీవి!

  మహబూబ్‌నగర్‌ ప్రధాన ప్రతినిధి/ నమస్తే తెలంగాణ : బళ్లారి నుంచి కోదాడ వరకు ఉన్న 167వ నంబర్‌ జాతీయ రహదారి మహబూబ్‌నగర్‌ పట్టణం మీదుగా వెళ్తుంది. అత్యంత కీలకమైన ఈ రహదారి విస్తరణకు దశాబ్దానికిపైగా ఆటంకాలు ఎదురువుతున్నాయి. విస్తరణ లేక ట్రాఫిక్‌ సమస్యలు ఏర్పడుతున్నాయి. మహబూబ్‌నగర్‌ నుంచి జడ్చర్లకు 15 కిలోమీటర్ల ప్రయాణించేందుకు సుమారు 45 నిమిషాలకుపైగా సమయం పడుతోంది. ప్రస్తుతం మహబూబ్‌నగర్‌ మండలం అప్పన్నపల్లి నుంచి జడ్చర్ల వరకు నాలుగు రోడ్ల విస్తరణ పనులు వేగం పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో పట్టణంలో రోడ్డు విస్తరణకు ఉన్న ఆటంకాలను తొలగించేందుకు సర్కారు సిద్ధమైంది. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ చొరవతో రోడ్డు విస్తరణలో ప్రభావితమయ్యే భవనాల యజమానులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ప్రతిపాదించిన టీడీఆర్‌ (భూ బదలాయింపు) సర్టిఫికెట్లు తీసుకునేందుకు పట్టణ వాసులు పెద్ద ఎత్తున అంగీకరించారు. ఈ నేపథ్యంలో రోడ్డు విస్తరణ పనులు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. భవనాల యజమానుల నుంచి వస్తున్న స్పందన బాగుందని మున్సిపల్‌ అధికారులు తెలిపారు. మిగతా వారు సైతం వెంటనే స్పందిస్తే 15 రోజుల్లో విస్తరణకు బీజం పడుతుందని అధికారులు భావిస్తున్నారు.

స్వచ్ఛందంగా స్పందన 

  పట్టణంలో రోడ్డు విస్తరణకు (నాలుగు లేన్లు, 120 అడుగుల రోడ్డు) పదేళ్లకుపైగా అడ్డంకులు ఏర్పడుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఈనెల 8వ తేదీన రోడ్డు విస్తరణలో ప్రభావితమయ్యే భవనాల యజమానులతో జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో సమావేశం ఏర్పాటు చేశారు. రోడ్డు విస్తరణ ఆవశ్యకతను వారికి మంత్రి వివరించారు. విస్తరణ కోసం 2010లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆదేశాలు జారీ అయిన విషయాన్ని మంత్రి చెప్పారు. రోడ్డు విస్తరణ పట్టణానికి ఎంత అవసరమో వివరించారు. పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విధానాన్ని వర్ణించారు. రోడ్డు విస్తరణకు సహకరించాలని.. మీకు నష్టం లేకుండా టీఆర్‌ఆర్‌ సర్టిఫికెట్లు అందిస్తామన్నారు. నష్టపోతున్న ఏరియాకు నాలుగు రెట్లు టీడీఆర్‌ ఇవ్వడం వల్ల కలుగనున్న ప్రయోజనాన్ని వర్ణించారు. కొందరు మినహా మెజారిటీ భవనాల యజమానులు అంగీకరించారు. అక్కడిక్కడే 60 మంది సంతకాలు చేసి తమ అంగీకారం తెలిపారు. పట్టణంలో 420 ఆస్తులకు సంబంధించి 956 మంది రోడ్డు విస్తరణ వల్ల ప్రభావితం అవుతారు. వారిలో ఇప్పటికే 75 శాతం మంది స్వచ్ఛందంగా అంగీకార పత్రాలు ఇచ్చారని అధికారులు తెలిపారు. పది రోజుల కిందటి వరకు 52 టీడీఆర్‌ సర్టిఫికెట్లు సైతం సిద్ధం చేసినట్లు అధికారులు వివరించారు. 

టీడీఆర్‌ వల్ల ఉపయోగమేంటీ?

  నిబంధనల ప్రకారం అదనపు అంతస్తుల నిర్మాణానికి అనుమతులు రానివారు టీడీఆర్‌ సర్టిఫికెట్లు (భూ బదలాయింపు హక్కు) కొనుగోలు చేసి నిర్మాణాలు చేసుకునే వీలుంది. ఇంతకాలం  జీహెచ్‌ఎంసీ పరిధి వరకు మాత్రమే ఉన్న వీటి వినియోగ పరిధి తాజాగా జిల్లా కేంద్రంలో ప్రారంభమైంది. జీహెచ్‌ఎంసీ కొంతకాలంగా రోడ్ల విస్తరణ, ఇతర ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయే వారికి నష్టపరిహారం కింద డబ్బుకు బదులు  టీడీఆర్‌ సర్టిఫికెట్లను అందిస్తున్న విషయం విదితమే. వాస్తవానికి 2000లోనే ఈ విధానాన్ని ప్రవేశపెట్టినప్పటికీ భూ యజమానులు దీనిపై ఆసక్తి చూపక పోవడంతో 2017లో ప్రభుత్వం నిబంధనలు సవరించింది. ఇందులో భాగంగా డిసెంబర్‌ 2017లో వెల్లడించిన ఉత్తర్వుల ప్రకారం, మాస్టర్‌ ప్లాన్‌ రోడ్ల విస్తరణలో భూములు సేకరిస్తే బాధితులకు 400 శాతం టీడీఆర్‌  ఇవ్వాలని నిర్ణయించారు. అంటే 100 చదరపు గజాల స్థలం నష్టపోతే అందుకు పరిహారంగా 400 చదరపు గజాల బిల్డప్‌ ఏరియాకు సమానంగా టీఆర్‌ఆర్‌ ఇస్తారు. ఈ బాండ్ల ద్వారా సదరు యజమాని తనకున్న స్థలంలో అదనపు అంతస్తులు నిర్మించునేందుకు అనుమతులు లభిస్తాయి. లేదా వీటిని ఇతరులకు విక్రయించుకునేందుకు అవకాశం ఉంది. వేరే చోట నిర్మాణాలు చేపట్టేవారికి ఈ టీడీఆర్‌లను విక్రయించుకునడం ద్వారా యజమానులు ప్రయోజనం పొందవచ్చు. దీంతో టీడీఆర్‌ గిరాకీ పెరిగింది. టీడీఆర్‌ వల్ల భూయజమానులకు ప్రయోజనం కలగడమే కాకుండా మున్సిపాలిటీపై ఆర్థిక భారం కూడా ఉండదు. అదే విధానాన్ని  ఇప్పుడు మహబూబ్‌నగర్‌లో ప్రారంభించారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ చొరవతోనే ఈ అవకాశం లభించిందని చెప్పొచ్చు. స్థానికంగా ఇళ్లు, నిర్మాణాలు కోల్పోతున్న వారు నష్టపోవద్దనే ఉద్దేశంతో ఈ అవకావాన్ని కల్పించినట్లు మంత్రి ఇప్పటికే స్పష్టం చేశారు. 


logo