గురువారం 04 జూన్ 2020
Mahabubnagar - Feb 23, 2020 , 23:42:18

శ్రీరామ కొండంత జనం

శ్రీరామ కొండంత జనం
  • శ్రీరామ నామస్మరణతో శ్రీరామకొండ పులకింత
  • ఆదివారం అమావాస్యకు లక్షకుపైగా భక్తుల రాక
  • దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లో..
  • ఆహ్లాదంగా గడిపిన భక్తులు
  • ప్రత్యేక పూజలు చేసిన జెడ్పీ సీఈవో, అధికారులు
  • భక్తుల సౌకర్యార్థం కొండపై తాగునీటి వసతి

శ్రీరామకొండ శ్రీరామ నామస్మరణతో మార్మోగిపోయింది. ఆదివారం అమావాస్యను పురస్కరించుకొని లక్షకుపైగా భక్తులు హాజరయ్యారు. ఉమ్మడి జిల్లాతోపాటు కర్ణాటక, ఇతర ప్రాంతాల నుంచి భక్తజనం తరలివచ్చారు. చిన్నారులు, పెద్దలు, వృద్ధులు అలుపు లేకుండా కొండపైకి చేరుకొని శ్రీ సీతారామచంద్రస్వామిని దర్శించుకున్నారు. గంటల తరబడి క్యూలైన్లో నిల్చొని స్వామిని దర్శించుకున్నారు. ముస్లింలు కూడా తరలిరావడం విశేషం. సాయంత్రం వరకు వారి వారి కుటుంబాలతో కలిసి పలువురు ఆహ్లాదంగా గడిపారు. మరికొందరు కొండపై ఉన్న ఔషధ మూళికలను ఇళ్లకు తీసుకెళ్లారు. జెడ్పీ సీఈవో యాదయ్య, ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. 

- కోయిలకొండ


కోయిలకొండ: శ్రీరామ నామస్మరణతో శ్రీరామకొండ గిరులు పులకించాయి. ఆదివారం అమావాస్య పర్వదినం సందర్భంగా లక్షలాదిమంది భక్తులు శ్రీరామకొండకు తరలొచ్చారు. ఏడాది తర్వాత వచ్చిన ఆదివారం అమావాస్య శ్రీరామకొండ దర్శనానికి శనివారం రాత్రి నుంచే వివిధ ప్రాంతాలనుంచి భక్తులు రామకొండకు తరలొచ్చి అఖండ భజనలు నిర్వహించారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులు కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీరామచంద్ర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. రామకొండపై స్వామిని దర్శించుకొని తమ వెంట పవిత్ర కోనేరు నీరు, ఔషదమూళికల కొమ్మలను ఇంటికి తీసుకెళ్లారు. ఎండ తీవ్రత లెక్క చేయడకుండా వృద్ధులు,  మహిళలు శ్రీరామకొండకు తరలివచ్చారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో భక్తులకు కొండ కింద, కొండపై భాగంలో తాగునీటి సౌకర్యం కల్పించారు. రామకొండ ఆదివారం అమావాస్యకు ముస్లింలు కూడా వచ్చి స్వామిని దర్శించుకున్నారు.


రామనామస్మరణతో పులకింత

శివరాత్రికి ఆదివారం అమావాస్య రావడంతో జిల్లా నుంచే కాకుండా ఇతర ప్రాంతాల భక్తులు రామకొండకు తరలివచ్చారు. రామదర్శనం చేసుకొని తన్మయం పొందారు. కోరిన కోర్కెలు తీర్చె శ్రీరామకొండ రామస్వామికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు రామ నామస్మరణతో రామకొండ గిరిలు పులకించాయి. శ్రీశైలం వెళ్లిన శివస్వాములు నేరుగా రామకొండకు వచ్చి దర్శనం చేసుకొన్నారు.


జెడ్పీ సీఈవో, ప్రజాప్రతినిధుల పూజలు

ఆదివారం అమావాస్య పర్వదినం సందర్భంగా శ్రీరామకొండ క్షేత్రాన్ని జిల్లా పరిషత్‌ సీఈవో యాదయ్య, జెట్పీటీసీ విజయభాస్కర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి, తాసిల్దార్‌ పాండు, ఎంపీడీవో హరిశ్చంద్రారెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు రాజేంద్రప్రసాద్‌గౌడ్‌, సర్పంచ్‌లు కృష్ణయ్య, కరుణాకర్‌రెడ్డి, నాయకులు భీంరెడ్డి, రాజవర్ధన్‌రెడ్డి రామచంద్రస్వామికి పూజలు చేశారు.


పోలీసుల సేవలపై ప్రశంసలు 

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేసి తొక్కిసలాట జరుగకుండా స్థానిక ఎస్‌ఐ సురేశ్‌గౌడ్‌ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేయడంపై సర్పంచ్‌ కృష్ణయ్య, ప్రజాప్రతనిధులు ప్రశంసించారు. భక్తులు అధిక సంఖ్యలో ఉన్న కొంతమంది పోలీసులతో బందోబస్తు నిర్వహించి భక్తులకు పోలీసులు సేవలు అందించడం హర్షణీయమన్నారు.


logo