ఆదివారం 23 ఫిబ్రవరి 2020
నేడే ‘సహకార’ పోలింగ్‌

నేడే ‘సహకార’ పోలింగ్‌

Feb 15, 2020 , 00:33:48
PRINT
నేడే ‘సహకార’ పోలింగ్‌

మహబూబ్‌నగర్‌, నమస్తే తెలంగాణ : సింగిల్‌విం డో ఎన్నికల పోలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యా హ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ ప్రక్రియ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం నుంచి కౌంటింగ్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. పోలింగ్‌ కేంద్రాల్లో విధులు నిర్వహించనున్న అధికారులు, సిబ్బంది శుక్రవారం జిల్లా కేంద్రంలోని బాలుర కళాశాల మైదానం నుంచి ఎన్నికల సామగ్రితో కేంద్రాలకు చేరుకున్నారు. జిల్లాలో మొత్తం 17 సహకార సంఘాల ఎన్నికల్లో 221 టెరిటోరిలాల్‌ నియోజకవర్గాలు (టీసీ) ఉన్నాయి. ఈ ప్రక్రియల్లో మొత్తం 106 టీసీ స్థానాలు ఏకగ్రీవం కాగా, బాలానగర్‌, గండీడ్‌ మండలాల్లో టీసీలు మొత్తం ఏకగ్రీవమయ్యాయి. ఈ టీసీలను మినహాయించి మిగతా టీసీలలో ఎన్నికల ప్రక్రియను నిర్వహించేందుకు అధికారులు అవసరమైన చర్యలు తీసుకున్నారు. 

పకడ్బందీ ఏర్పాట్లు

సింగిల్‌విండో ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం ఎలక్షన్‌ ఆఫీసర్లు 17 మంది, అసిస్టెం ట్‌ ఎలక్షన్‌ ఆఫీసర్లుగా 17 మంది, జోనల్‌ ఆఫీసర్లుగా ఏడుగురిని నియమించారు. మొత్తం 7 రూట్లను ఏర్పా టు చేశారు. 25 ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్‌ కేంద్రాలకు అధికారులు చేరుకున్నారు. ప్రిసైడింగ్‌ ఆఫీసర్లు 115 మంది ఏర్పాటు చేసుకోవడంతోపాటు మరో 22 మందిని అదనంగా అందుబాటులో ఉన్నారు. పోలింగ్‌ ఆఫీసర్లు 209 మందితోపాటు మరో 32 మంది అదనంగా ఉన్నారు. 

ఎన్నికల బరిలో 261మంది..

115 డైరెక్టర్‌ స్థానాల్లో మొత్తం 261 మంది పోటీ పడుతున్నారు. మొత్తం 25,513 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓటర్లు పూర్తిస్థాయిలో తమ ఓటు హక్కును ఉపయోగించుకునేలా ఇప్పటికే అభ్యర్థులు సంప్రదింపులు జరిపి ఓటర్లను పోలింగ్‌ కేంద్రానికి అందుబాటులో ఉంచారు. 

పటిష్ట పోలీస్‌ బందోబస్తు

సహకార ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండ పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మేరకు బాలుర కళాశాల మైదానంలో పోలీస్‌ సిబ్బందికి ఏఎస్పీ వెంకటేశ్వర్లు ప లు సలహాలు, సూచనలు ఇచ్చారు. 

ఎన్నికల నిర్వహణ సందర్భంగా ఎవరైన ఆందోళన చేస్తే వెంటనే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుని శాంతియుతమైన వాతావారణం నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని ఏఎస్పీ సూచించారు. 


logo