గురువారం 04 జూన్ 2020
Mahabubnagar - Feb 10, 2020 , 04:00:52

కిక్కిరిసిన మన్యంకొండ

కిక్కిరిసిన మన్యంకొండ

మహబూబ్‌నగర్‌ రూరల్‌ : పేదల తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన మన్యంకొండ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు. కోరిన కోర్కెలు తీర్చే మన్యంకొండ వెంకన్న దర్శనం కోసంఎడ్లబండ్లు, ట్రాక్టర్లు తదితర వాహనాలతోపాటు, కాలినడక ద్వారా చేరుకున్నా రు. ముందుగా కోనేరులో పుణ్యస్నానాలు చేసి స్వా మి వారి దర్శనానికి క్యూ కట్టారు. స్వామివారి దర్శ నం అనంతరం దాసంగాలను సమర్పించి మొక్కు లు చెల్లించుకున్నారు. అలాగే, కొండపై ఉన్న రామలింగేశ్వర స్వామి దేవాలయం, మద్దిలేటి స్వామి, నర్సింహస్వామి, అలివేలి మంగమ్మ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం ఒక్కరోజే సుమారు లక్షా 50వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడం విశేషం. ఇంకా మూడు రోజులపాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు కొనసా

గనున్నాయి.

కనుల పండువగా గరుడ వాహన సేవ 

శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి గరుడ వాహన సేవను కనులపండువగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త అళహరి మధుసూదన్‌కుమార్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఆలయ ప్రధాన ముఖ ద్వారం నుంచి వేద మంత్రోచ్చారణల మధ్య స్వామివారికి పల్లకీసేవ నిర్వహించారు. 

భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు  

కొండపై భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. బస్టాండ్‌ నుంచి కొండపైకి వచ్చే భక్తులకు మినీ బస్సులను ఏర్పాటు చేశారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రశాంత వాతావరణం కల్పించడానికి 200 మంది పోలీసు సిబ్బంది సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అనారోగ్యానికి గురయ్యే భక్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేస్తున్నారు. దేవస్థానం దగ్గర, జాతరలో ఏర్పాటు చేసిన దుకాణాలు భక్తులతో కిటకిటలాడాయి. 

నిత్యాన్నదానం ప్రారంభం

మన్యంకొండ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు నిత్యాన్నదానం కార్యక్రమాన్ని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా చూడడంతోపాటు, ఎంత మం దికైనా అన్నదానం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అనంతరం స్వామి వారికి మంత్రి, ఎమ్మె ల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ ధర్మకర్త మధుసూదన్‌కుమార్‌ వారిని శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజేశ్వర్‌గౌడ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆంజనేయులు, మున్సిపల్‌ చైర్మన్‌ కేసీ నర్సింహులు, ఈవో వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు. 


logo