శుక్రవారం 05 జూన్ 2020
Mahabubnagar - Jan 19, 2020 , 01:17:11

పోలింగ్‌ స్టేషన్లలో వసతులు కల్పించాలి

పోలింగ్‌ స్టేషన్లలో వసతులు కల్పించాలి


మహబూబ్‌నగర్‌, నమస్తే తెలంగాణ: మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహిస్తున్న పోలింగ్‌ స్టేషన్లలో ఓటర్లకు సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ టౌన్‌లోని కార్యాలయంలోని సమావేశ మందిరంలో జోనల్‌ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారులు తమతమ పరిధిలోని పోలింగ్‌ స్టేషన్లను ప్రత్యేకంగా పరిశీలించి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. పోలింగ్‌స్టేషన్లలో విధులు నిర్వహించే సిబ్బందికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు ఏర్పాటు చేయాలన్నారు.

స్ట్రాంగ్‌రూం, కౌంటింగ్‌ కేంద్రాల పరిశీలన

జిల్లా కేంద్రంలోని బాలుర కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూం, కౌంటింగ్‌ కేంద్రాల ఏర్పాట్లను కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ శనివారం ప్రత్యేకంగా పరిశీలించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయాల్సిన పనుల గురించి అధికారులకు క్లుప్తంగా వివరించారు. ప్రతి పనిని నోట్‌ చేసుకుని తప్పకుండా చేయాలన్నారు. ఇబ్బందులుంటే తక్షణమే తమకు తెలియజేయాలన్నారు. అంతకు ముందు పోస్టల్‌ బ్యాలెట్‌కు సంబంధించి ఆన్‌లైన్‌ ప్రక్రియను మున్సిపల్‌ కార్యాలయంలో ప్రత్యేకంగా పరిశీలించారు. డీఆర్‌డీఏ పీడీ క్రాంతి, ఆర్డీవో శ్రీనివాసులు, మున్సిపల్‌ కమిషనర్‌ సురేందర్‌, భూత్పూర్‌ మున్సిపల్‌ కమిషనర్‌ మున్ని, జోనల్‌ అధికారులు, సంబంధింత అధికారులు తదితరులు ఉన్నారు.

ఓటరు స్లీప్‌ను అందుకున్న కలెక్టర్‌

జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ ఎన్నికలు ఈ నెల 22వ తేదీన జరుగుతున్న క్రమంలో ఓటర్లకు ఓటరు స్లిప్‌లను బీఎల్‌వోలు అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓటరు స్లీప్‌ను కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌కు తన క్యాంపు కార్యాలయంలో బీఎల్‌వో శైలజ అందజేశారు. ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లు స్టిప్‌లను అందించాలని బీఎల్‌వోకు సూచించారు.

ఇసుక సందేహాలకు కాల్‌ చేయండి

ఇసుక రవాణాలో ఎలాంటి సమస్యలున్న వినియోగదారులు 08542-241165 నెంబర్‌కు కాల్‌ చేసి సమాచారాన్ని పొందవచ్చని కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఇసుక రవాణాతోపాటు ఎలాంటి సమస్యలైన నివృత్తి చేసుకునేందుకు ఈ నెంబర్‌కు కాల్‌ చేసి పరిష్కరించుకునేందుకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు.


logo