e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 24, 2021
Home జిల్లాలు ఎల్‌ఆర్‌ఎస్‌

ఎల్‌ఆర్‌ఎస్‌

ప్లాట్ల క్రమబద్ధీకరణకు కసరత్తు
రెండు దశల్లో క్లస్టర్ల వారీగా విభజన
జిల్లాల్లో బృందాల నియామకం
నిబంధనల మేరకు దరఖాస్తులు వేరు చేసే ప్రక్రియ
ఇక ఎదురుచూపులకు మోక్షం
హర్షం వ్యక్తం చేస్తున్న భూ యజమానులు

మహబూబ్‌నగర్‌, జూలై31(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎల్‌ఆర్‌ఎస్‌కు కసరత్తు మొదలైంది. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను క్లియర్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిబంధనలకు లోబడి ఉన్న ఇండ్ల స్థలాలను, అనుమతి లేని లేఅవుట్లను జిల్లా అధికారులు ఇచ్చే రిపోర్టు ఆధారంగా క్రమబద్ధీకరించనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,71,881 దరఖాస్తులు అందాయి. మొదటగా బల్దియాల వారీగా జిల్లాలో అందిన దరఖాస్తులను పరిశీలించి సర్కారు ఇచ్చిన ఉత్తర్వుల ఆధారంగా వాటికి తుది రూపం ఇవ్వనున్నారు. ఇందుకోసం బృందాలను నియమించారు. దీంతో భూ యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

లేఅవుట్ల క్రమబద్ధీకరణ దరఖాస్తుల్లో నిబంధనలకు అనుగుణంగా ఉన్నవాటిని గుర్తించే ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నిబంధనల మేరకు ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనున్నది. ముందస్తు ప్రక్రియలో భాగంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో లేఅవుట్‌ క్రమబద్ధీకరణ పథకంలో వచ్చిన దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించే ప్రక్రియ ప్రారంభమైంది. తాజాగా ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల్లో నిబంధనలకు అనుగుణంగా ఉండి, క్రమబద్ధీకరణకు అవకాశం ఉన్నవాటిని గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు స్థానిక సంస్థలకు మార్గదర్శకాలు వచ్చాయి. ఆ మేరకు కలెక్టర్లు బృందాలను నియమించారు. సాగునీటి పారుదల, పంచాయతీరాజ్‌, రెవెన్యూ, పురపాలక శాఖల నుంచి ఈ బృందాల్లో ఉండే అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం వచ్చిన దరఖాస్తుల్లో ఏది సరైనదో, ఏది సరిగ్గా లేదో నివేదిక అందిస్తారు. క్లస్టర్‌ వారీగా ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను వర్గీకరించి లేఅవుట్ల క్షేత్ర స్థాయి పరిశీలన చేసి నిబంధనలు అనుగుణంగా ఉన్నవాటిని గుర్తించనున్నారు. సర్వే నెంబర్ల వారీగా వేరు చేసి వాటిని విభజించనున్నారు. అనంతరం అధికారులు వాటిని స్వయంగా పరీశీలించి, ఓకే చెప్పనున్నారు. బృందాలు పరిశీలించిన అనంతరం నివేదికలను ప్రభుత్వానికి అందజేస్తారు. సాధ్యమైనంత త్వరగా నివేదిక అందించేందుకు అధికారులు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు.

- Advertisement -

గద్వాలలో 28,663 క్రమబద్ధీకరణకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌
గద్వాల, జూలై31: అక్రమ లేఅవుట్లు, అనుమతిలేని ప్లాట్లలో నిర్మాణాలు చేసుకున్న వాటికి దరఖాస్తు చేసుకోవాలని గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే క్రమబద్ధీకరణకు లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకున్న సంగతి విధితమే. ప్రభుత్వం విధించిన గడువులోగా జిల్లాలోని నాలుగు పురపాలక సంఘాల్లో 28,663 మంది లబ్ధిదారులు క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్నారు. పెండింగ్‌ దరఖాస్తులను ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తుండడంతో లబ్ధిదారులకు ఊరట లభించింది. తమ పాట్లు,భూములు క్రమబద్థీకరణ చేసుకునే సమయంలో ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసి వాటి ఆధారంగా చెల్లించాల్సిన ఫీజులను నిర్ణయిస్తారు.

నాగర్‌కర్నూల్‌లో 23,445
నాగర్‌కర్నూల్‌, జూలై 31(నమస్తే తెలంగాణ): మున్సిపాల్టీల్లో ప్లాట్ల క్రమబద్ధీకరణ ప్రక్రియ కొలిక్కి వచ్చింది. ఎల్‌ఆర్‌ఎస్‌(లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌) దరఖాస్తుల పరిష్కారానికి మున్సిపల్‌ అధికారులు చర్యలు తీసుకోనున్నారు. గతేడాది సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో ప్రభుత్వం పురపాలికల్లో అనుమతులు లేని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు యజమానుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. దీనికి ప్రజల నుంచి భారీగా స్పందన వచ్చింది. ఒక్కో మున్సిపాల్టీలో వేల సంఖ్యలో లే అవుట్లకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు వచ్చాయి. దీంతో అప్పటి నుంచి రెగ్యులరైజేషన్‌ కోసం వేచిచూస్తున్న యజమానుల దరఖాస్తులకు పరిష్కారం లభించనున్నది. రాబోయే రెండు వారాల్లో మున్సిపాల్టీ అధికారులు ఈ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. ఇందుకోసం ప్రత్యేక అధికారుల బృందాలను ఏర్పాటు చేస్తారు. దీనికి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇందులో భాగంగా వచ్చిన దరఖాస్తులను మున్సిపల్‌ అధికారులు గ్రూపింగ్‌, క్లస్టరింగ్‌ చేయనున్నారు. ఇలా విభజించిన దరఖాస్తులను పరిశీలించిన అధికారులు ఎల్‌ఆర్‌ఎస్‌ నిబంధనల ప్రకారం ఉన్న వివరాలను సేకరిస్తారు. దరఖాస్తుదారులకు ఫోన్లు, మెయిళ్ల ద్వారా సమాచారం చేరవేస్తారు. ఇలా ప్లాట్ల క్రమబద్ధీకరకు అనుమతి ఉన్న వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తారు. దీనికి సంబంధించి యజమానులు చెల్లించాల్సిన చార్జీ వివరాలను కూడా తెలియజేస్తారు.

త్వరలో తనిఖీలు చేస్తాం
ప్లాట్ల రెగ్యులరైజేషన్‌పై ప్రభుత్వ మార్గదర్శకాలు వెలువరించింది. దీని ప్రకారం రాబోయే పక్షం రోజుల్లో క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలిస్తాం. అర్హతలు ఉన్న ప్లాట్ల వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తాం. ప్రజలు అనుమతులు ఉన్న వెంచర్లలోనే ప్లాట్లు కొనుగోలు చేయాలి.

  • అన్వేశ్‌, కమిషనర్‌, నాగర్‌కర్నూల్‌ మున్సిపాలిటీ

రెండు దశల్లో క్లస్టర్ల వారీగా విభజన
వనపర్తి, జూలై31(నమస్తే తెలంగాణ): ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల ప్రక్రియను క్లియర్‌ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి నిబంధనలకు లోబడి ఉన్న నివాస స్థలాలకు, అనుమతిలేని లేఅవుట్లకు వనపర్తి జిల్లా యంత్రాంగం నుంచి అందే రిపోర్టు ఆధారంగా క్రమబద్ధీకరించనున్నారు. మున్సిపాలిటీల వారీగా ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను పరిశీలించి వాటికి తుదిరూపం ఇవ్వనున్నారు. ఇప్పటికే వనపర్తి జిల్లాలోని వనపర్తి, కొత్తకోట, పెబ్బేరు, ఆత్మకూరు, అమరచింత మున్సిపాలిటీ పరిధిలో పెండింగ్‌లో ఉన్న ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిశీలన ప్రారంభమైంది. శుక్రవారం కలెక్టర్‌ షేక్‌యాస్మిన్‌ బాషా ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులపై సమీక్ష జరిపి మున్సిపల్‌ కమిషనర్లకు, రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని మున్సిపాలిటీల్లో 47,724 గ్రామీణ ప్రాంతాల్లో 21,540 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. గత సంవత్సరం అనుమతిలేని వెంచర్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అవకాశమిచ్చి దరఖాస్తులు కోరింది. వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలిస్తారు. వ్యక్తిగతంగా కొంతమంది ప్లాట్ల యజమానులు దరఖాస్తు చేసుకోగా, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు తమ వెంచర్లకు సంబంధించి దరఖాస్తులు సమర్పించారు. వీటిని పరిశీలించి 15రోజుల్లో నివేదిక అందజేస్తే క్రమబద్ధీకరణకు సంబంధించి మార్గదర్శకాలు అందిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

పరిశీలన దశలో ఉంది
త్వరలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తాం, కలెక్టర్‌ ఆదేశాలను అనుసరించి సర్వేనెంబర్లు, కాలనీలు, గ్రామాల వారీగా క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక అందజేస్తాం.క్రమబద్దీకరణ కోసం మా మున్సిపాలిటీ నుంచి 7,242 దరఖాస్తులు వచ్చాయి.

  • జాన్‌ కృపాకర్‌, మున్సిపల్‌ కమిషనర్‌, పెబ్బేరు

పరిశీలన పూర్తయింది
ఉత్తర్వుల ప్రకారం క్లస్టర్ల వారీగా పరిశీలన పూర్తయింది. అధికారులు పట్టణాలు, గ్రామాల్లోని కాలనీలు, వార్డుల పరంగా ఇంటింటికీ వెళ్లి పరిశీలిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఉన్న వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకుంటాం. క్రమబద్ధీకరణ నిబంధనలు ఉల్లంఘించిన దరఖాస్తులను తిరస్కరిస్తాం. పూర్తిస్థాయి పారదర్శకత ఉంటుంది. వీటి కోసం వివిధశాఖల అధికారులతో కమిటీలు వేసి నివేదిక తెప్పించుకుంటాం. పూర్తైన నివేదికను ప్రభుత్వానికి పంపిస్తాం.

  • షేక్‌యాస్మిన్‌ బాషా, కలెక్టర్‌, వనపర్తి జిల్లా

పరిశీలన చేస్తున్నాం
జిల్లాలో 3 మున్సిపాలిటీల నుంచి 50,445 ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు, 14 మండలాల పరిధిలోని 391 క్లస్టర్ల నుంచి 49,747 దరఖాస్తులు వచ్చాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుంచి మొత్తం 81141 దరఖాస్తులు వచ్చాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుంచి ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తులను వేరు చేసే ప్రక్రియ కొనసాగుతున్నది. క్షేత్ర స్థాయి పరిశీలన కోసం ఏర్పాటు చేసిన బృందాలు ప్రత్యక్ష పరిశీలన అనంతరం నివేదికలు తయారు చేస్తాయి.

  • తేజస్‌ నందలాల్‌పవర్‌, అదనపు కలెక్టర్‌, మహబూబ్‌నగర్‌
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana