e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 18, 2021
Home జోగులాంబ(గద్వాల్) స్వయంపాలనతో అభివృద్ధి

స్వయంపాలనతో అభివృద్ధి

ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
పెంటలకు అంబులెన్స్‌ ఏర్పాటు చేస్తాం
కలెక్టర్‌ శర్మన్‌చౌహాన్‌
చెంచుల అధ్యయన బాధ్యత పీయూది: వీసీ లక్ష్మీకాంత్‌రాథోడ్‌
భౌరాపూర్‌లో మెగా వైద్యశిబిరం

అచ్చంపేట, ఆగస్టు4: స్వరాష్ట్రంలో ఆదివాసీ చెంచుల జీవితాల్లో మార్పులు రావడంతోపాటు వారి సంస్కృతి, సాంప్రదాయాలు కాపాడేవిధంగా ముందుకువెళ్తున్నామని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. స్వయం పాలనతో చెంచుగూడెంలల్లో అభివృద్ధి కొనసాగుతుందన్నారు. రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆదేశాల మేరకు పాలమూరు యూనివర్సిటీ ఆధ్వర్యంలో నల్లమలలోని భౌరాపూర్‌ చెంచుపెంటలో మెగా మల్టీస్పెషాలిటీ వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. విప్‌ గువ్వల, కలెక్టర్‌ శర్మన్‌ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గువ్వల మాట్లాడుతూ గతంలో చెంచులను పట్టించుకునేవారు లేరన్నారు. భౌరాపూర్‌ జాతరకు రూ.10లక్షలు ప్రభుత్వం అందించి జాతర జరిపిస్తుందన్నారు. స్వయంపాలనలో అప్పాపూర్‌ గ్రామ పంచాయతీకి చెంచుయువకుడు బాలగురువయ్య సర్పంచ్‌గా సేవలు అందిస్తున్నారన్నారు. భవిష్యత్‌లో చెంచుజాతి నుంచి ఎంపీ, ఎమ్మెల్యేలు కావడం ఖాయమన్నారు. అటవీ ఉత్పత్తుల సేకరణకు వెళ్లి అగ్నిప్రమాదంలో గాయపడి మృతిచెందిన చెంచు కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామన్నారు. వారి పిల్లలకు మెరుగైన విద్య అందించేవిధం గా చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ శర్మన్‌చౌహాన్‌ అన్నారు. చెంచుపెంటల్లో వైద్యసేవల కోసం ప్రత్యేకంగా మొబైల్‌ అంబులెన్స్‌ ఏర్పాటు చేస్తామన్నారు. అప్పాపూర్‌లో తాగునీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు. 18ఏళ్లు నిండిన వారందరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని కోరారు.

- Advertisement -

చెంచులపై అధ్యయనం
పాలమూరు విశ్వవిద్యాలయం ద్వారా ఆదివాసీ చెంచుల స్థితిగతులపై ఎంఎస్‌డబ్ల్యూ విద్యార్థులచే అధ్యయనం చేయించే బాధ్యత తీసుకుంటానని పాలమూరు యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ లక్ష్మీకాంత్‌రాథోడ్‌ తెలిపారు. నల్లమలలోని చెంచు పెంటలను దత్తత తీసుకోని విద్యార్థులను ఇక్కడికి పంపించి అధ్యయనం చేసేవిధంగా ప్రోత్సహిస్తామన్నారు. గవర్నర్‌ సూచనల మేరకు 29మంది వైద్యుల బృందంతో క్యాంప్‌ నిర్వహించామన్నారు.

67శాతం మందిలో రక్తహీనత
చెంచుల ఆహారపోషకాలపై అధ్యయనం చేస్తున్నామని జాతీయ పోషకాహార సంస్థ రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ అన్నారు. చెంచులు తీసుకునే ఆకులు, అడవిలో లభించే పోషకారంపై అధ్యయనం చేశామన్నారు. 67శాతం మంది చెంచుల్లో రక్తహీనత ఉందన్నారు. గర్భిణులు, బాలింతలు అవగాహన లోపంతో ఇబ్బంది పడుతున్నారన్నారు. ఇప్పపువ్వును లడ్డుగా తయారు చేసి గిరిజనులకు అందించి వారిలో పోషక విలువలు పెంచే విధంగా కృషిచేస్తున్నామన్నారు. సగటు మనిషి జీవితకాలం 73 ఏండ్లు కాగా చెంచుల్లో మాత్రం 53ఏండ్ల జీవితకాలం ఉండడం బాధాకరమన్నారు.

దత్తత తీసుకున్న గవర్నర్‌
గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలోని అప్పాపూర్‌, భౌరాపూర్‌ చెంచు పెంటలతో పాటు ఆదిలాబాద్‌ జిల్లాలో రెండు గ్రామాలు, భద్రాది కొత్తగూడెం జిల్లాలో రెండు గ్రామాలను దత్తత తీసుకొన్నారని రాజ్‌భవన్‌ కార్యాలయం అధికారి సీతారాములు తెలిపారు. చెంచులకు సరైన పోషకాహారం, చదువు అందించడమే లక్ష్యంగా గవర్నర్‌ దృష్టిపెట్టారన్నారు. చెంచుల సమస్యల పరిష్కారానికి కలెక్టర్‌ ఆధ్వర్యంలో గవర్నర్‌కు నివేదిక అందజేస్తామన్నారు. మహబూబ్‌నగర్‌ జనరల్‌ దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాంకిషన్‌ మాట్లాడుతూ నల్లమలలోని చెంచుల వల్లే అడవి కాపాడబడుతుందన్నారు. నల్లమల ప్రాంతంలో 12చెంచుపెంటలు ఉన్నాయని ప్రపంచ జనాభా పెరుగుతుంటే చెంచుల జనాభా తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అప్పాపూర్‌ సర్పంచ్‌ బాలగురువయ్య మాట్లాడుతూ అప్పాపూర్‌లో పిల్లల కోసం బడి నడిపించాలని కోరారు. చెంచుపెంటల్లో వాగులు పారుతున్నాయని చెక్‌డ్యాంలు నిర్మిస్తే చెంచులు, జంతువులకు ఉపయోగం ఉంటుందన్నారు. అనంతరం విప్‌, కలెక్టర్‌ కొవిడ్‌ టీకా కేంద్రాన్ని ప్రారంభించారు. చెంచులకు రగ్గులు, మాస్కులు, దోమతెరలు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నిమ్స్‌ మాజీ డైరెక్టర్‌ దాసరి ప్రసాద్‌రావు, రెడ్‌క్రాస్‌ రాష్ట్ర కార్యదర్శి మదన్‌మోహన్‌, ఐఎంఏ రాష్ర్ట అధ్యక్షుడు డాక్టర్‌ లవకుమార్‌రెడ్డి, జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ సుధాకర్‌లాల్‌, పీయూ రిజిస్ట్రార్‌ పవన్‌కుమార్‌, ప్రొఫెసర్లు గుడూరు మనోజ, పీవో అశోక్‌, డీపీఆర్వో సీతారాం, రెడ్‌క్రాస్‌ కార్యదర్శులు రమేశ్‌రెడ్డి, నటరాజ్‌, చెంచులోకం శ్రీనివాసులు, గురువయ్య, డాక్టర్లు, పీయూ విద్యార్థి జేఏసీ నాయకుడు ప్రకాశ్‌, అచ్చంపేట త్రివేణి, చైతన్య కళాశాలల అధ్యాపకులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana