వనపర్తి, సెప్టెంబర్5(నమస్తే తెలంగాణ): కన్ను పడితే చాలు కబ్జా కావాల్సిందే. కొండలు, గుట్టలు, ప్రభుత్వ భూములు, ఫారెస్టు భూములు ఇలా ఏవైనా సరే.. కబ్జాదారుల కబంధ హస్తాల్లో చిక్కుకోవాల్సిందే. ఉమ్మడి రాష్ట్రంలో కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా ఆక్రమించిన భూములు తమవేనంటూ మొరాయిస్తున్నారు. అభివృద్ధి పనులకు అడ్డం పడుతూ ప్రజలను రెచ్చగొడుతున్నారు. ఫారెస్టు, రెవెన్యూ అధికారులను బెదిరిస్తూ దాడులకు దిగేందుకు సమాయత్తమవుతున్నారు. కొండలు మాయం చేసి భూమిని దక్కించుకుంటున్నారు. పేదలంటే ఏదో పూటగడువక జీవనం కోసం సాగు చేసుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మాత్రం సీన్ వేరే.. ఫారెస్టు భూములను ఆక్రమించింది సాక్ష్యాత్తూ బడాబాబులు. ఆర్థికంగా నిలదొక్కుకున్న వ్యక్తులు. ఆక్రమించుకోవడమే చట్ట ప్రకారం నేరమైనప్పటికీ..ఇక ఆక్రమించుకున్న భూమిని తమ జాగీరులా ఇతరులకు లీజు ఇవ్వడం ఇక్కడ పెద్ద చర్చనీయాంశమైంది. పర్యావరణాన్ని ఆకాంక్షించి అర్బన్ ఫారెస్టును అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్లాంటేషన్ చేయడానికి పూనుకోవడంతో రైతుల పేరిట అడ్డుకుంటున్నారు.
వనపర్తి జిల్లా కేంద్రంలోని 55 సర్వే నెంబర్లో 1400ఎకరాల భూమి ఉన్నది. అందులో 1205ఎకరాల్లో అటవీ భూమి ఉన్నది. ఇప్పటికే సుమారు 90ఎకరాల ఫారెస్టు భూమి కబ్జా చేసినట్లు రెవెన్యూ, ఫారెస్టు అధికారులు తెలిపారు. ఫారెస్టు అధికారులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా సర్వే చేసి బౌండరీలు ఖరారు చేసి ఫారెస్టు అధికారులకు అప్పగించినట్లు తెలిసింది. దీని ఆధారంగా గుంతలు తీసి మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేయగా వాటిని రాత్రికి రాత్రే భూకబ్జాదారులు గుంతలను పూడ్చివేసి మొక్కలను రోడ్డుపై వేసి తొక్కించారు. మరికొన్ని మొక్కలను బావిలో పడేశారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సర్వే నెంబరు 55లో కొన్ని పంట భూములు ఉండగా, మరికొన్ని బీడు భూములు ఉన్నాయి. పంట భూముల జోలికి వెళ్లకుండా పంట ఉన్న ప్రాంతాన్ని వదిలేసి బీడుగా ఉన్న భూముల్లో మొక్కలు పెంచేందుకు అధికారులు ప్రయత్నాలు మొదలు పెట్టగా పనుల కోసం తెచ్చిన జేసీబీనీ తమ అనుచరులతో ఓ పార్టీకి చెందిన మాజీ ప్రజాప్రతినిధి బెదిరించి పంపించారు. తనకు బినామీలుగా ఉన్న వారిని అధికారులపైకి పంపించి దుర్భాషలాడి నానా హంగామా చేయించారు. అయితే కొంతమంది రైతులు మాత్రం తాము ఇదే భూమిని నమ్ముకుని జీవిస్తున్నామని, న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.
పోలీసులకు ఫిర్యాదు చేశాం
కబ్జాకు గురైన భూములను రెవెన్యూ శాఖతో కలిసి సంయుక్తంగా సర్వే చేయించాం. హద్దులు నిర్ణయించాం. అర్బన్ ఫారెస్టు డెవలప్మెంట్ కోసం గుంతలు తవ్వి మొక్కలు పెట్టేందుకు సిద్ధం చేశాం. రాత్రికి రాత్రే గుంతలను పూడ్చేశారు. పనులు చేసేందుకు వెళ్తే ఫారెస్టు అధికారులను సిబ్బందిని అడ్డుకుంటున్నారు. దీనిపై పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశాం. అర్బన్ ఏరియాలో అటవీ భూముల్లో మొక్కలు పెంచుతున్నాం. విధులకు ఆటంకం కలిగించిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. రెవెన్యూ అధికారులు సర్వే చేసి ఫారెస్టు భూమిగా నిర్ధారించిన భూమిలోనే మొక్కలు నాటుతున్నాం.
కేసు నమోదు చేశాం
ఫారెస్టు అధికారుల విధులకు ఆటంకం కలిగించినందుకు కేసు నమోదు చేపి దర్యాప్తు చేస్తున్నాం. అటవీశాఖ, రెవెన్యూ భూములు కబ్జా చేయడం నేరం. ఆయా విభాగాల అధికారులు ఇచ్చిన సమాచారం, స్థానికులతో సమాచారం సేకరించాం. బెదిరింపులకు పాల్పడినట్లు అధికారులు పేర్కొన్న వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపిస్తాం.