మహబూబాబాద్, మే16 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని ప్రతి మండలంలో కస్టమ్ హైరింగ్ సెంటర్ (సీహెచ్సీ) ఏర్పాటు చేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఇప్పటికే జిల్లాలోని నెల్లికుదురు, మరిపెడ, తొర్రూరు మండలాల్లో ఉండగా, మిగిలిన 13 మండలాల్లో ఈ ఏడాది నెలకొల్పనున్నారు. ప్రభుత్వం నుం చి అనుమతులు కూడా మంజూరయ్యాయి. వీటి నిర్వహణ బాధ్యతను మహిళా మండల సమాఖ్యలు చూసుకోనున్నాయి. వీటి కోసం మండలానికి కనిష్ఠంగా రూ.20 లక్షలు, గరిష్ఠంగా రూ.30లక్షల వరకు రుణా లు మంజూరు చేయనున్నారు. ఇందులో 25 శాతం సబ్సిడీ పోను మిగిలిన మొత్తం స్త్రీ నిధి, బ్యాంకుల ద్వా రా రుణంగా ఇవ్వనున్నారు. ఇలా ఇచ్చిన రుణాలతో మండల సమాఖ్యలు మండలానికో సీహెచ్సీని ఏర్పా టు చేసి, వ్యవసాయ యంత్రపరికరాలను కొనుగోలు చేస్తాయి. వీటిని మార్కెట్లో ప్రైవేట్ వ్యక్తుల కిరాయి కం టే అతి తక్కువకే రైతులకు ఇవ్వనున్నారు. దీంతో రైతులకు మేలు జరుగడంతోపాటు మహిళా సమాఖ్యలకు ఉపాధి లభించి ఆర్థికంగా బలోపేతమవుతాయి.
జిల్లాలో 16 మండలాలుండగా, ఇప్పటికే నెల్లికుదురు, తొర్రూరు, మరిపెడ మండలాల్లో కస్టమ్ హైరింగ్ సెంటర్ (సీహెచ్సీ)లను ఏర్పాటు చేశారు. మిగిలిన గంగారం, కొత్తగూడ, బయ్యారం, గార్ల, పెద్దవంగర, గూడూరు, కేసముద్రం, మహబూబాబాద్, డోర్నకల్, కురవి, చిన్నగూడూరు, నర్సింహులపేట, దంతాలపల్లి మండలాల్లో ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్లాన్ రూపొందించారు. వానకాలం సీజన్ ప్రారంభం వరకు 13 మండలాల్లో యంత్రాలు, పరికరాలు మహిళా మండల సమాఖ్యకు కొనుగోలు చేసి ఇవ్వనున్నారు. వీటిని రైతులకు తక్కువ కిరాయికి అందించనున్నారు. ట్రాక్టర్, రోటవేటర్, స్ప్రేయర్ల వంటి పరికరాలు ఉన్నాయి. ఈ ఏడాది ఏర్పాటు చేయనున్న సీహెచ్సీల్లో వ్యవసాయ యంత్రాలు, పరికరాలతోపాటు ఇంటి నిర్మాణ సామగ్రిని అందుబాటులో ఉంచనున్నారు. గడ్డపారలు, పారలు, డబ్బాలు, ఇనుప నిచ్చెనలు, తాళ్లు, స్టూళ్లు వంటి పరికరాలు కొనేవిధంగా సెర్ప్ అధికారులు యోచిస్తున్నారు.
13 మండలాల్లో ఏర్పాటు చేస్తాం
మండలానికో కస్టమ్ హైరింగ్ సెంటర్ (సీహెచ్సీ) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచించింది. గతేడాది నెల్లికుదురు, తొర్రూరు, మరిపెడ మండలాల్లో ప్రారంభించాం. ఈ ఏడాది మిగిలిన 13 మండలాల్లో ఏర్పాటు చేస్తం. వీటి నిర్వహణ బాధ్యత మహిళా మండల సమాఖ్యలక అప్పగించాం.కొత్తగా ఏర్పాటు చేసే సీహెచ్సీలో వ్యవసాయ యంత్రాలు, పరికరాలతోపాటు గృహవసరాలకు ఉపయోగపడే పరికరాలు కూడా అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నం. సీహెచ్సీలతో రైతులకు మేలు జరుగనుంది.
– గ్రామీణాభివృద్ధి జిల్లా అధికారి, సన్యాసయ్య