e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home జనగాం కోడిగుడ్డు ధర పైపైకి

కోడిగుడ్డు ధర పైపైకి

కోడిగుడ్డు ధర పైపైకి

అంతకంతకూ పెరుగుతున్న రేటు
రూ.6 నుంచి గరిష్ఠంగా రూ.7కు విక్రయం
సెకండ్‌ వేవ్‌ తర్వాత అమాంతం పెరిగిన వినియోగం
ఉమ్మడి జిల్లాలో రోజుకు తింటున్నవి 15లక్షలపైనే..
అయినా పౌల్ట్రీ రైతులకు లాభాలు అంతంతే..

మహబూబాబాద్‌, జూన్‌ 11 (నమస్తే తెలంగాణ) : ఒకప్పుడు గుడ్డుకు గడ్డుకాలం ఉండేది. రోజు ఉత్పత్తి అయిన గుడ్లను అమ్మలేక కోళ్ల రైతులు ఇబ్బంది పడేవారు. ఇప్పుడు హాట్‌ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఉమ్మడి జిల్లాలో అమ్మకాలు జోరందకున్నాయి. రెండో దశ కరోనా నేపథ్యంలో పోషక విలువలు ఎక్కువగా ఉండే కోడిగుడ్లను విరివిగా వినియోగిస్తున్నారు. ఉమ్మడి వరంగల్‌లోని 86 కోళ్లఫారాల్లో 29 లక్షల కోళ్లు ఉన్నాయి. వీటి ద్వారా నిత్యం 25లక్షల కోడిగుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. మొదటి దశ కరోనా కంటే ముందు గుడ్ల వినియోగం అంతంత మాత్రంగానే ఉండేది. మొదటి దశ కరోనా వచ్చిన తర్వాత వినియోగం క్రమంగా పెరుగుతూ వస్తోంది. గుడ్డు తినాలని వైద్యులు కూడా అవగాహన కల్పిస్తుండడంతో ప్రజలు ఎక్కువగా వాడుతున్నారు. ఇదివరకు సగటున ఒక గుడ్డు తినేవారు.. ఇప్పుడు రెండు, మూడు కూడా తింటున్నారని డాక్టర్లు చెబుతున్నారు. రెండో దశకు ముందు ఉమ్మడి జిల్లాలో రోజుకు 8-9 లక్షల అమ్ముడుపోతే.. ప్రస్తుతం 16-17లక్షల కోడిగుడ్లు వినియోగిస్తున్నారు. మిగతా గుడ్లు మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌, మధ్యప్రదేశ్‌ రాష్ర్టాలకు ఎగుమతి అవుతున్నాయి.
కోళ్ల ఫారాల్లో రైతులు ఒక కోడిగుడ్డును రూ.5లకు విక్రయిస్తున్నారు. ఇక్కడి నుంచి కొనుగోలు చేసిన హోల్‌సేల్‌ వ్యాపారులు వీటిని బల్క్‌గా కొని తెస్తారు. ఇక్కడి నుంచి ఆటోలు, తదితర వాహనాల ద్వారా చిన్నచిన్న కిరాణా షాపులు, చికెన్‌ కేంద్రాలు, వారాంతపు సంతలు, మాల్స్‌లలో అమ్ముతున్నారు. కోళ్ల రైతుల నుంచి రూ.5ల కు కొనుగోలు చేసే హోల్‌సేల్‌ వ్యాపారులు రూ.6లకు విక్రయిస్తున్నారు. ఇక్కడినుంచి బహిరంగ మార్కెట్లో ఒక గుడ్డును రూ.7లకు విక్రయిస్తున్నారు. గుడ్ల అమ్మకాలు గతం కంటే సగానికిపైగా పెరిగినందుకు పౌల్ట్రీ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు వినియోగం పెరిగినా లాభాలు అంతగా ఉండడం లేదని చెబుతున్నారు. దళారులు మాత్రం లాభా లు అధికంగా అర్జిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అమ్మకాలు పెరిగాయి
ఉమ్మడి జిల్లాలో కరోనా కంటే ముందు రోజుకు 7-8లక్షల కోడిగుడ్లు అమ్మకాలు జరిగేవి. రెండో దశ కరోనా వచ్చినప్పటి నుంచి గుడ్ల వినియోగం విపరీతంగా పెరిగింది. సగటున 25లక్షల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో 16-17లక్షల గుడ్లు రోజూ అమ్ముడుపోతున్నాయి. మిగిలిన గుడ్లను ఇతర రాష్ర్టాలకు ఎగుమతి చేస్తున్నాం. కరోనాకు ముందు ఒక గుడ్డు రూ.4లకు అమ్మేవాళ్లం. కరోనా మొదలైన తర్వాత రూ.5లకు విక్రయిస్తున్నాం. ధరతో పాటు విక్రయాలు బాగుంటున్నా మాకు లాభాలు మాత్రం పెద్దగా ఉండడం లేదు.
చిట్టిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోళ్ల పెంపకందారుల సంఘం ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి
రోజూ గుడ్డు తింటున్నా..
కోడిగుడ్డులో పోషక విలువలు ఎక్కువగా ఉన్నాయని డాక్టర్లు చెప్పారు. అందుకే ఉదయం, రాత్రి రెండు పూటల ఉడికించి తింటున్నాను. ఇదివరకు నెలకు నాలుగైదుసార్లు తినే వాళ్లం. ఇప్పుడు వారానికి నాలుగుమార్లు తింటున్నాం. ఇంట్లో పిల్లలకు కూడా తినిపిస్తున్నాం. ఆరోగ్యంగా ఉంటున్నారు. చికెన్‌, మటన్‌ కంటే కోడిగుడ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఒక మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు గుడ్డు ఎంతో మేలు చేస్తుంది.
బొల్లికొండ చిరంజీవి, మహబూబాబాద్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కోడిగుడ్డు ధర పైపైకి

ట్రెండింగ్‌

Advertisement