శనివారం 06 మార్చి 2021
Mahabubabad - Jan 27, 2021 , 01:43:17

ఘనంగా గణతంత్ర వేడుకలు

ఘనంగా గణతంత్ర వేడుకలు

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌, జనవరి 26: మహబూబాబాద్‌ జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో గణతంత్ర వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ స్టేడియంలో కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ జాతీయజెండాను ఆవిష్కరించారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి, ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌ హాజరై జెండాకు వందనం చేశారు. పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా వివిధ పాఠశాలల విద్యార్థులు ఆట, పాటలతో అలరించారు. అనంతరం కలెక్టర్‌ ప్రసంగించారు. ఏడాది కాలం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.... కరోనా నేపథ్యంలో వైద్యులు, సిబ్బంది అలుపెరుగని కృషి చేశారన్నారు. లాక్‌డౌన్‌లో జిల్లా పోలీస్‌ యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందని ఎస్పీ కోటిరెడ్డిని అభినందించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పనులతో ఆయా ప్రాంతాల్లో ఆహ్లాదాన్ని పంచే విధంగా అభివృద్ధి చేపట్టామన్నారు. మిషన్‌ భగీరథ ద్వారా అందరికీ శుద్ధమైన తాగునీరు అందించేందుకు కృషి చేశామన్నారు. గ్రామీణ ఉఫాధి హామీ పథకం ద్వారా ప్రజలకు ఎక్కువ రోజులు పని కల్పించి వారి జీవనోఫాదికి అవకాశం కలిగించామన్నారు. జాతీయ స్థాయి కళా ఉత్సవ్‌లో తృతీయ బహుమతి అందుకున్న కొత్తూరు జడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన ఆర్‌.సందీప్‌ను అభినందించి జ్ఞాపికను అందించారు. అనంతరం జిల్లాలోని వివిధ శాఖల్లో పని చేసిన ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందించి అభినందించారు. జడ్పీ చైర్‌పర్సన్‌ ఆంగోతు బిందు, మున్సిపల్‌ చైర్మన్‌ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ ఫరీద్‌, పీఏసీఎస్‌ చైర్మన్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.  మహబూబాబాద్‌ జిల్లా కోర్టులో 6వ అదనపు జడ్జి అనిల్‌కిరణ్‌కుమార్‌ మువ్వన్నెల జెండాను ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. కలెక్టర్‌ కార్యాలయంలో అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు జెండాను ఆవిష్కరించారు. మహబూబాబాద్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌, జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ నంద్యాల కోటిరెడి, ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో కొమురయ్య జాతీయ జెండా ఆవిష్కరించారు.  జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ కార్యాయలంలో జాతీయ జెండాను అదనపు కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ ఎగుర వేసి జెండాకు వందనం చేశారు. మరిపెడలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించిన జెండా వందన కార్యక్రమానికి డోర్నకల్‌ ఎమ్మెల్యే డీఎస్‌ రెడ్యానాయక్‌ హాజరయ్యారు. మరిపెడ మున్సిపల్‌ ఆఫీస్‌లో చైర్‌ పర్సన్‌ సింధూర జెండాను ఆవిష్కరించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ గుడిపూడి నవీన్‌రావు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ తదితరులు బుచ్చిరెడ్డి పాల్గొన్నారు. డోర్నకల్‌ మున్సిపాలిటీలో మున్సిపల్‌ చైర్మన్‌ వాంకుడోత్‌ వీరన్న, తొర్రూరులోని జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో జడ్జి సూర సుమలత, డీఎస్పీ కార్యాలయం వద్ద డీఎస్పీ వెంకటరమణ జెండాను ఆవిష్కరించారు. గూడూరు, గంగారం, గార్ల, కేసముద్రం, కురవి, మహబూబాబాద్‌, బయ్యారం, పెద్దవంగర, చిన్నగూడూరు, కొత్తగూడ, దంతాలపల్లి, నెల్లికుదురు, నర్సింహులపేట తదితర మండలాల్లోని అన్ని తహసీల్దార్‌, ఎంపీడీవో, పోలీస్‌స్టేషన్లు తదితర కార్యాలయాలు, పార్టీ కార్యాలయాల్లో జెండాను ఎగురవేశారు.

VIDEOS

logo