మంగళవారం 02 మార్చి 2021
Mahabubabad - Jan 27, 2021 , 01:38:51

దారి మళ్లించి దందా..

దారి మళ్లించి దందా..

  • సర్కారు ఖజానాకు ఇసుకాసురుల గండి
  • ప్రభుత్వ రీచ్‌కు కాకుండా ప్రైవేట్‌ డంపులు
  • లారీలను అటకాయించి మరీ ఇసుక తరలింపు
  • ట్రాక్టర్‌ ట్రిప్పు రూ. 5500 నుంచి రూ.6వేల వరకు అమ్మకాలు
  • సామాన్యులపై భారం 

ఇష్టారీతిన తవ్వకాలకు చెక్‌ పెట్టి, సామాన్యులకు సైతం తక్కువ ధరకు ఇసుకను అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రాంతాల్లో రీచ్‌లు ఏర్పాటు చేసింది. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుని రీచ్‌ల వద్దే ఇసుక కొనుగోలుకు అవకాశం కల్పించింది. కానీ, ఇక్కడ అవేవీ పట్టించుకోని ఇద్దరు ఇసుకాసురులు, సర్కారు రీచ్‌లకు వెళ్లే  లారీలను అటకాయించి మరీ ప్రైవేట్‌గా డంపు చేసుకుంటున్నారు. నిర్మాణాలకు అత్యవసరం ఉన్నవారిని ఆసరా చేసుకుని ట్రాక్టర్‌ ఇసుకను రూ.5500 నుంచి రూ.6వేల వరకు అమ్ముకుని సొమ్ముచేసుకుంటున్నారు. 

- మహబూబాబాద్‌, జనవరి 26

మహబూబాబాద్‌, జనవరి 26 :  మహబూబాబాద్‌ జిల్లా కేంద్రం శివారు అనంతారం రోడ్డులో ‘తెలంగాణ స్టేట్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌' ఆధ్వర్యంలో ప్రభుత్వ ఇసుక రీచ్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ గుమస్తాలుగా పనిచేసే ఇద్దరు వ్యక్తులు ప్రభుత్వ రీచ్‌కు వచ్చే లారీలను ప్రైవేట్‌ రీచ్‌లకు మళ్లించి ట్రాక్టర్‌ ఇసుకను రూ.5500 నుంచి రూ.6వేలకు అమ్ముకుంటూ ప్రభు త్వ ఖజానాకు గండికొడుతున్నారు. స్థానికంగా ఉన్న ఆకేరు, మున్నేరు, పాలేరు వాగుల్లో ఇష్టారీతిన ఇసుక తవ్వకాలు చేపడితే భూగర్భ జలాలు అందకుండా పోతాయని భావించిన అధికారులు, ప్రజాప్రతినిధులు, నాణ్యమైన ఇసుకను గోదావరి పరీవాహక ప్రాంతాల నుంచి తెప్పించి ఇక్కడ ఏర్పాటు చేసిన రీచ్‌ ద్వారా విక్రయించాలనే నిబంధన పెట్టారు. కాగా, ఇదే రీచ్‌లో పనిచేసే ఇద్దరు కొందరు ప్రైవేట్‌ వ్యక్తులతో కలిసి ప్రభుత్వ రీచ్‌కు రావాల్సిన లారీలను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. డంపులు ఏర్పాటు చేసుకుని అక్రమంగా అమ్ముకుంటూ లక్షలు గడిస్తున్నారు. నిరుద్యోగ యువకులు గోదావరి పరీవాహక ప్రాంతాల నుంచి అనుమతులు తీసుకుని ఇసుక రవాణా చేస్తున్న లారీలను సైతం తమ ప్రైవేట్‌ రీచ్‌లకు బలవంతంగా తరలిస్తున్నారు. ‘మేం టాస్క్‌ఫోర్స్‌, విజిలెన్స్‌ అధికారులం’ అంటూ బెదిరించి ఇసుక తరలించుకుంటున్నారని సదరు యువకులు వాపోతున్నారు. రోజూ రాత్రివేళ దారికాచి బెదిరిస్తూ బలవంతంగా లారీలను మళ్లిస్తున్నారని, వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లారీలను ప్రైవేట్‌ రీచ్‌కు తరలిస్తున్నారని ఇటీవల కొన్ని వీడియోలు వాట్సాప్‌లో వైరల్‌కాగా ఆర్‌ఐ ప్రవీణ్‌రెడ్డి, వీఆర్వో విజయ్‌రెడ్డి సదరు స్థలానికి వెళ్లి విచారణ చేసినట్లు తెలిసింది. 

కఠిన చర్యలు తీసుకుంటాం

అనుమతులతో గోదావరి నుంచి ఇసుక తీసుకెళ్లే లారీలను ఎవరూ ఆపేందుకు వీలు లేదు. లారీలను దారి మళ్లించి ప్రైవేట్‌ రీచ్‌లకు తరలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. నిరుద్యోగ యువత ఉపాధి కోసం లారీలు పెట్టుకుని అనుమతులతో గోదావరి నుంచి ఇసుకను ప్రభుత్వ రీచ్‌లకు తరలిస్తున్నారు. తాము విజిలెన్స్‌ అధికారులమని కొందరు లారీలను ఆపి వాటిని దారి మళ్లిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఇలాంటి వారిపై నిఘా వేసి కఠిన చర్యలు తీసుకుంటాం. సామాన్యులు సైతం ఇండ్ల నిర్మాణాల కోసం లారీల్లో ఇసుక తీసుకొస్తే పర్వాలేదు.  డంప్‌ చేసి విక్రయాలు చేపడితే మాత్రం ఊరుకునేది లేదు. అవసరమైనంత మేరకే ఇసుక ఉంచుకోవాలి.

-రచ్చ రవీందర్‌, భూగర్భ జల వనరుల శాఖ జిల్లా ఇన్‌చార్జి అసిస్టెంట్‌ డైరెక్టర్‌, మహబూబాబాద్‌ 


VIDEOS

logo