ఆ ఊరంతా ఉప్పరోళ్లే..!

- ఉప్పరగూడెంలో ఇంటికో తాపీ మేస్త్రీ
- 85శాతం మంది గ్రామస్తులకు జీవనాధారం
- సుతారి పనే అందరి ప్రధాన వృత్తి.. రూ.2 కూలి నుంచి నేడు 700 దాకా..
- మూడు దశాబ్దాలుగా వారసత్వాన్ని కొనసాగిస్తున్న కార్మికులు
- ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ప్రత్యేకం.. ఈ గ్రామం
ఉప్పరగూడెం.. మహబూబాబాద్ జిల్లాలో చిట్టచివరన, బస్సు సౌకర్యం కూడా లేని ఓ చిన్న ఊరు. పేరుకు తగ్గట్టే ఆ ఊరంతా ఉప్పరోళ్లే(తాపీ కార్మికులు) ఉన్నారు. చూడచక్కని, ఆకట్టుకునే భవంతులు కట్టడంలో వీళ్లంతా ఆరితేరారు. చేతికష్టాన్ని నమ్ముకొని అద్భుత నైపుణ్యంతో మూడు దశాబ్దాలుగా వారసత్వంగా నిర్మాణ రంగంలో రాణిస్తున్నారు. అందుకేనేమో ఎక్కడ తాపీమేస్త్రీ కనిపించినా ‘మీది ఉప్పరగూడెమా’ అని అడుగుతారంటే ఆ ఊరికి ఎంత గొప్పతనముందో అర్థమవుతుంది. ఇలా గ్రామ జనాభాలో 85శాతం ఉప్పర(సగర) కుటుంబాలు ఉండడంతో ఈ ఊరు ఉప్పరగూడెం అయింది.
- పెద్దవంగర, జనవరి 23
పెద్దవంగర, జనవరి 23: మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలోని ఉప్పరగూడెంలో 350 కుటుంబాలు ఉన్నాయి. ఓటర్లు 1400మందిపైనే. గ్రామ జనాభా 2వేలు ఉంటే అందులో 85శాతం మంది ఉప్పర కులస్తులే. మిగతా కులాల వారు కొందరున్నా అందరి ప్రధాన వృత్తి ఉప్పర పనే. ఈ కులం.. ఆ కులం అనే తేడా లేకుండా అందరూ తాపీపనినే నమ్ముకున్నారు. ఇలా తాపీమేస్త్రీలుగా పెద్ద పెద్ద భవంతులు, వాటర్ ట్యాంకులు, కట్టడాలు నిర్మించడంలో వీళ్లు రాటుదేలారు. మూడు దశాబ్దాలుగా వారసత్వంగా వస్తున్న ఈ వృత్తే వారికి జీవనాధారమైంది. చేతికష్టాన్నే పెట్టుబడిగా పెట్టి.. అద్భుత నైపుణ్యంతో భవన నిర్మాణం రంగంలో రాణిస్తున్నారు. ఇప్పుడు పంటలకు సరిపడా నీళ్లు అందుతుండడం వ్యవసాయం కూడా చూసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు.
చేతినిండా పని..
ఉమ్మడి వరంగల్ జిల్లాతోపాటు హైదరాబాద్, ఖమ్మం జిల్లాల్లో తాపీమేస్త్రీలుగా, బిల్డర్స్గా ఉప్పరగూడెం గ్రామస్తులు పని చేస్తున్నారు. రూ.2 నుంచి రూ.700 వరకు కూలీ రేట్లు పెరగడంతో భవన నిర్మాణ రంగ కార్మికులకు డిమాండ్ పెరిగింది. రోజురోజుకూ భవన నిర్మాణాలు పెరుగుతుండడంతో తాపీ మేస్త్రీలకు చేతినిండా పనిదొరుకుతున్నది. గ్రామంలోని ఉప్పర కులస్తులే కాకుండా ముదిరాజ్, కుమ్మరి, కమ్మరి, ఎస్సీ, గౌడ్స్, గంగెడ్లు, తదితర కులాల వాళ్లు భవన నిర్మాణ కార్మికులుగా మారిపోయారు. ఆడ, మగ తేడా లేకుండా పనులు చేస్తూ ఉప్పరగూడెం గొప్పతనాన్ని చాటుతున్నారు.
అందరూ సుతారి పనికే..
గ్రామంలో ఉప్పర కులస్తులే గాక ఇతర కులాల వారు కూడా సుతారి పనినే నమ్ముకొని ఉపాధి పొందుతున్నారు. గ్రామంలో రెండు పరపతి సంఘాలను ఏర్పాటు చేసుకొని కుటుంబ అవసరాలకు నగదును వాడుకుంటున్నారు. ప్రతి నెల ఒకటో తేదీన తాపీ మేస్త్రీలకు సెలవు. ఆ రోజు గ్రామంలో సందడిగా ఉంటుంది. మిగతా రోజుల్లో ఉదయం 7గంటల్లోపే ఎవరి పనికి వారు వెళ్లిపోతారు.
- దుంపల జమున, గ్రామ సర్పంచ్, ఉప్పరగూడెం
నాడు కూలి రూ.2లే
మా తాతముత్తాతల నుంచి ఇదే పనిచేస్తున్నా. నా చిన్ననాడు రూ.2 కూలి నుంచి పని చేస్తున్న. అప్పుడు ఇండ్లు కట్టాల్నంటే శాన కష్టమయ్యేది. ఇప్పుడంతా మారిపోయింది. కొత్త కొత్త సామాన్లు వచ్చినయ్. పని కూడా అల్కగ అయితాంది. మాకు కూడా తొందర అయితాంది. మా ఊరిలో నేనే ఇప్పటికి పెద్ద. ఎందరికో మేస్త్రీ పని నేర్పిచ్చిన.
- సోమ సోమయ్య
కార్మికులను ఆదుకోవాలి..
అధికారులు, ప్రజాప్రతినిధులు బీమా సౌకర్యంపై భవన కార్మికులకు అవగాహన కల్పించాలి. ప్రభుత్వాలు బీమా సౌకర్యాలు కల్పిస్తున్నా నేటికీ ఆచరణలోకి రావడం లేదు. ప్రమాదాల బారిన పడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించి కార్మికులను ఆదుకోవాలి.
- దుంపల సమ్మయ్య, సగర సంఘం జిల్లా అధ్యక్షుడు, ఉప్పరగూడెం
పొదుపు సంఘం నడుపుకుంటున్నం..
మా ఊళ్లో ఉప్పరోళ్లమే ఎక్కువ మందిమి ఉన్నం. శ్రీరామ, భగీరథ పరపతి సంఘాల్లో దాదాపు 250 మంది కార్మకులు సభ్యులుగా ఉన్నా రు. ప్రతి నెల ఒకటో తారీఖు చిట్టి నడిపిస్తూ కుటుంబ అవసరాలు తీర్చుకుంటున్నాం. ప్రభుత్వం తాపీ కార్మికులను ఆదుకునేందుకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలి.
- వేముల వెంకన్న, మాజీ ఎంపీటీసీ ఉప్పరగూడెం, ఉప్పర సంఘం నాయకుడు
తాజావార్తలు
- నేడు దేశవ్యాప్త బంద్
- శభాష్ నర్సింలు..
- ఒక్క రోజు నెట్ బిల్లు రూ. 4.6 లక్షలు
- జాగ్రత్తతో సైబర్నేరాలకు చెక్: సీపీ సజ్జనార్
- ప్రభుత్వం పారిశ్రామికరంగానికి ప్రోత్సాహం
- అమ్మాయి మా బంధువే.. రూ.90 కోట్ల కట్నమిప్పిస్తాం..
- వేసవి తట్టుకునేలా.. మరో సబ్స్టేషన్
- ఎంఎస్ఎంఈ ద్వారా ఆన్లైన్లో టాయ్ ఫేయిర్
- వ్యాక్సినే సురక్షితమైన ఆయుధం
- రాష్ట్రంలో పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు