శనివారం 06 మార్చి 2021
Mahabubabad - Jan 19, 2021 , 00:53:22

వాడివేడిగా మండల సభ

వాడివేడిగా మండల సభ

  • ఎంబీ అధికారుల సరెండర్‌కు తీర్మానం 
  • అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించిన ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌ 

గూడూరు/మహబూబాబాద్‌  రూరల్‌/కేసముద్రం/ నెల్లికుదురు, జనవరి18: గూడూరు మండల కేంద్రంలో ఎంపీపీ బానోత్‌ సుజాత అధ్యక్షతన సోమవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం వాడివేడిగా సాగింది. మండల సభకు మహబూబాబాద్‌ ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అధికారుల పనితీరుపై కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అధికారులు సమస్యలను పట్టించుకోవడంలేదని, ఎమ్మెల్యే స్పందించి గ్రామాల అభివృద్ధికి అధికారులు సహకరించే విధంగా చూడాలని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు కోరారు. వివిధ శాఖల అభివృద్ధి పనుల వివరాలను ఎమ్మెల్యే అధికారులను అడిగి తెలుసుకున్నారు. మండల కేంద్రంలో మూడు నెలలు కావస్తున్నా విద్యుత్‌ ఏఎల్‌ఎం, లైన్‌మెన్‌ లేరని, వెంటనే సిబ్బందిని నియమించాలని ఎమ్మెల్యేను, డీఈ సామ్యా నాయక్‌ను ప్రజాప్రతినిధులు కోరగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కొన్ని గ్రామాల్లో ఇప్పటి వరకు మిషన్‌భగీరథ ఓహెచ్‌ఆర్‌ ట్యాంకులు, మరికొన్ని గ్రామాల్లో పైప్‌లైన్లను పూర్తి చేయలేదని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. మిషన్‌ భగీరథ పథకంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులను సరెండర్‌ చేయాలని తీర్మానం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారులు సమన్వయంతో పనిచేసి సమస్యలను పరిష్కరించాలని అన్నారు. సమావేశంలో మండల ప్రత్యేక అధికారి ఛత్రునాయక్‌, ఎంపీడీవో స్వరూప, తహసీల్దార్‌ శైలజ, జడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు ఖాసీం, వైస్‌ ఎంపీపీ ఆరె వీరన్న, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు ముక్కా లక్ష్మణ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

సీసీ రోడ్డు, సైడ్‌ డ్రైనేజీ పనులు ప్రారంభం

మహబూబాబాద్‌  మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు సాలార్‌ తండాలో సీసీ రోడ్డు, సైడ్‌ డ్రైనేజీ నిర్మాణ పనులను ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ ప్రారంభించారు. అనంతరం తండా వాసుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ రామ్మోహన్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ ఎండీ ఫరీద్‌, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు గద్దె రవి, కార్యదర్శి గోగుల రాజు, వార్డ్‌ కౌన్సిలర్‌ బానోత్‌ చంగు పాల్గొన్నారు.

వ్యాక్సినేషన్‌ కేంద్రం ప్రారంభం

కేసముద్రం మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌  ప్రారంభించారు. రోడ్డుపై అంగడి నిర్వహించడంతో ఇబ్బుందులు ఎదురవుతున్నాయని, ఎకరం ప్రభుత్వ స్థలం కేటాయిస్తే సౌకర్యాలు కల్పిస్తామని తహసీల్దార్‌ కోమలకు సూచించారు. జిల్లా వైద్యాధికారులు శ్రీరాం, సీతామహాలక్ష్మి, ఎంపీపీ ఓలం చంద్రమోహన్‌, ప్రత్యేక అధికారి సుధాకర్‌, జడ్పీటీసీ రావుల శ్రీనాథ్‌రెడ్డి, సర్పంచ్‌ల ఫోరం జిల్లా అధ్యక్షుడు మాదారపు సత్యనారాయణరావు, సర్పంచ్‌లు ఎన్నమల ప్రభాకర్‌, భట్టు శ్రీనివాస్‌, పీహెచ్‌సీ వైద్యులు విజయ్‌, అనిల్‌ , టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. 

మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ ప్రారంభం 

నెల్లికుదురు మండలంలోని ఎర్రబెల్లిగూడెం గ్రామంలో ఎంపీటీసీ బత్తిని అనిల్‌ ఆధ్వర్యంలో బొమ్మగాని వెంకన్న ఏర్పాటు చేసిన వెంకటేశ్వర మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ను ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌ ప్రారంభించారు. ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి, వైస్‌ ఎంపీపీ వెంకటేశ్‌, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు అనిల్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, సర్పంచ్‌ అశోక్‌ పాల్గొన్నారు. 


VIDEOS

logo