సోమవారం 08 మార్చి 2021
Mahabubabad - Jan 17, 2021 , 01:24:51

మార్చిలో వచ్చింది.. మార్చిలోనే పోతుంది..

మార్చిలో వచ్చింది.. మార్చిలోనే పోతుంది..

  • కొవిడ్‌ టీకా సురక్షితం.. ఆందోళన వద్దు 
  • అన్ని పరీక్షలు చేశాకే అందుబాటులోకి..
  • గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌

మహబూబాబాద్‌, జనవరి 16: ‘కరోనా మహమ్మారి మార్చిలో వచ్చింది.. మార్చిలో అంతమవుతుంది.. కొవిడ్‌ టీకా చాలా సురక్షితం.. అన్ని దశల్లో పరీక్షలు నిర్వహించిన తర్వాతే ప్రజలకు అందుబాటులోకి వచ్చింది’ అని  గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. శనివారం ఆమె మహబూబాబాద్‌ జిల్లా ప్రభుత్వ దవాఖానలో తొలి దశ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌తో కలిసి ప్రారంభించారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా వైరస్‌తో పది నెలలుగా ఆర్థిక వ్యవస్థ స్తంభించినా, అభివృద్ధికి ఆటంకం కలుగకుండా అవిశ్రాంతంగా శ్రమించి వ్యాక్సిన్‌ తయారు చేసినట్లు తెలిపారు. తెలంగాణలోని నాలుగు కోట్ల మందికి మార్చిలోగా వ్యాక్సిన్‌ అందించి, మార్చిలో మొదలైన కరోనాను మార్చిలోనే అంతమొందిస్తామన్నారు. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు సేవలందించిన వైద్యులు, సిబ్బందికి మొదట వ్యాక్సిన్‌ అందిస్తున్నట్లు తెలిపారు. ఒక్కో కేంద్రంలో ఐదుగురు వైద్య బృందం పర్యవేక్షణలో 30 మందికి టీకా అందించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం మహబూబాబాద్‌ జిల్లా ప్రధాన ఆసుపత్రి, తొర్రూరు, డోర్నకల్‌ హెల్త్‌ సెంటర్లు, కంబాలపల్లి పీహెచ్‌సీలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిరంతరంగా సాగుతుందని మంత్రి వివరించారు. 50 సంవత్సరాలు పై బడిన వారికి, షుగర్‌, బీపీలు ఉన్న వారికి కూడా టీకా ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వ్యాక్సిన్‌ వేసినప్పుడు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తే కంట్రోల్‌ చేసేందుకు మందులు, అంబులెన్స్‌లు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ అంగోతు బిందు, కలెక్టర్‌ వీపీ గౌతమ్‌, ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి, జిల్లా వైద్యాధికారి శ్రీరాం, మున్సిపల్‌ చైర్మన్‌ రాంమోహన్‌రెడ్డి, ఆసుపత్రుల కో ఆర్డినేటర్‌ భీమ్‌సాగర్‌, కొవిడ్‌ నోడల్‌ అధికారి రాజేశ్‌, అంటువ్యాధుల నియంత్రణాధికారి సీతామహాలక్ష్మీ, జడ్పీటీసీ ప్రియాంక, తహసీల్దార్‌ రంజిత్‌ పాల్గొన్నారు.

VIDEOS

logo