దేశం గర్వించదగిన రోజు

- ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ కృషితోనే కరోనా వ్యాక్సిన్
- ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు తొలి ప్రాధాన్యం
- టీకాపై అపోహలు వద్దు
- రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
ఎంజీఎం దవాఖాన, తొర్రూరు, పాలకుర్తిలో వ్యాక్సినేషన్ ప్రారంభానికి హాజరుతొర్రూరు/వరంగల్ చౌరస్తా/ పాలకుర్తి రూరల్, జనవరి 16: ‘ప్రపంచాన్ని వణికించిన కరోనాకు దేశీయంగా మందు కనుగొని, వైరస్‌తో నేరుగా పోరాడిన వైద్య సిబ్బందికి ముందుగా అందించడం ఆనందంగా ఉంది.. ఇది నిజంగా దేశం గర్వించదగిన రోజు’ అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శనివారం ఉదయం ఆయన వరంగల్ ఎంజీఎం దవాఖానలోని అకడమిక్ హాల్లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మొదటి టీకాను కార్పెంటర్‌గా విధులు నిర్వహిస్తున్న సిద్ధయ్యచారి, రెండో టీకా ఆశ వర్కర్ సోనికి వేశా రు. అనంతరం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పీహెచ్సీలో జాయింట్ కలెక్టర్ అభిలాషఅభినవ్తో కలిసి, జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని పీహెచ్సీలో కలెక్టర్ నిఖిల, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డితో కలిసి వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. తొర్రూరు పీహెచ్సీలో తొలి టీకా డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ కోటాచలానికి వేయగా, మంత్రి పరిశీలించారు.
ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ.. దేశ ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ కృషి వల్లే ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 139 కేంద్రాల్లో, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 21 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రారంభించినట్లు తెలిపారు. తొలుత ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా కరోనా కష్టకాలంలో సేవలందించిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. జనవరి 18 నుంచి 150 బృందాలతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో 31,299 మంది వైద్య, అంగన్వాడీ, ఆశ వర్కర్లకు వ్యాక్సిన్ అందిస్తామన్నారు. రెండో డోసు తిరిగి 28వ రోజు ఇస్తామ ని అప్పటి వరకు అందరూ కరోనా నిబంధనలు తప్పని సరిగా పాటించాలని కోరా రు. రెండో విడుతలో పోలీసులు, మున్సిపల్ శానిటేషన్, రెవెన్యూ సిబ్బందికి అందించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని చెప్పారు. మూడో విడతలో 50 సంవత్సరాల వయస్సు పై బడిన వారితో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్ వేస్తామన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో వచ్చే చిన్నచిన్న సమస్యలను పరిష్కరించడానికి పది పడకలతో ప్రత్యేక ఐసీయూలను సిద్ధం చేశామన్నారు. వ్యాక్సిన్ నిల్వ చేయడానికి 26 కేంద్రాల్లో కోల్డ్ చైన్ బాక్కులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 46,579 మంది కరోనా బారిన పడ్డారని, వారిలో 45,768మంది కోలుకున్నారని చెప్పారు. వ్యాక్సిన్‌పై తప్పుడు ప్రచారాలను ఎవరూ నమ్మొద్దని, అన్ని రకాల పరీక్షలు నిర్వహించి తర్వాతే వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. వ్యాక్సిన్‌పై తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కరోనాతో చనిపోతే కుటుంబ సభ్యులు సైతం దగ్గరికి రాని రోజుల్లో కొందరు ప్రజాప్రతినిధులు, అధికారులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి దహన సంస్కారాలు నిర్వహించారని, అలాంటి వారికి తొలి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రజా సంక్షేమం కోసం కృషి చేసిన వరంగల్ తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, దాస్యం వినయ్‌భాస్కర్, మేయర్ గుండా ప్రకాశ్‌రావు, పలువురు వైద్యులు సైతం కరోనా బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొన్నారని మంత్రి గుర్తు చేశారు. తొర్రూరులో మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, తొర్రూరు, పెద్దవంగర ఎంపీపీలు, జడ్పీటీసీలు తుర్పాటి చిన్న అంజయ్య, ఈదురు రాజేశ్వరి, మంగళపల్లి శ్రీనివాస్, జ్యోతిర్మయి, పీఏసీఎస్ చైర్మన్ హరిప్రసాద్, వైస్ చైర్మన్ జినుగ సురేందర్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ దేవేందర్‌రెడ్డి, కమిషనర్ గుండె బాబు, వైద్యాధికారి డాక్టర్ దిలీప్‌కుమార్, డాక్టర్ నిరంజని, డాక్టర్ మీరాజ్, పాలకుర్తిలో డీసీపీ బీ శ్రీనివాస్‌రెడ్డి, ఏసీపీ గొల్ల రమేశ్, ఎంపీపీ నల్లా నాగిరెడ్డి, జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాసరావు, సర్పంచ్ యాకాంతారావు, మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాంబాబు, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు మధార్, అదనపు కలెక్టర్ హమీద్, జిల్లా వైద్యాధికారి మహేందర్, డీపీవో రంగాచారి తదితరులు పాల్గొన్నారు.