సంబురల సంక్రాంతి

- ముంగిళ్లలో రంగవల్లులు
- పతంగులతో చిన్నారుల ఆటలు
- ఆకట్టుకునే గంగిరెద్దుల విన్యాసాలు
- భక్తజనంతో పోటెత్తనున్న జాతరలు
- నేడు భోగి, రేపు సంక్రాంతి..
- సొంతూళ్లకు పయనమవుతున్న జనం
- ప్రయాణికులతో కిటకిటలాడుతున్న బస్స్టేషన్లు
- కళకళలాడుతున్న మార్కెట్లు
- మది నిండుగా సంప్రదాయ పండుగ
సరదాల సంక్రాంతిని సంబురంగా జరుపుకునేందుకు ఉమ్మడి జిల్లాలో సర్వం సిద్ధమైంది. తెలతెలవారకముందే మగువల మునివేళ్ల నుంచి నేలజారే రంగవల్లులతో వాకిళ్లన్నీ పులకరించనుండగా, పసుపు కుంకుమ పులుముకున్న గొబ్బెమ్మలు చూడముచ్చటగొలుపనున్నాయి. ఇక ఇంటింటా సకినాలు, గారెల కరకరలు, అరిసెల ఘుమఘుమలు సరేసరి! సకల సౌభాగ్యాలు కలగాలని నోచే నోములు, తీరొక్క బొమ్మల కొలువులతో ఇంటింటా సందడి నెలకొననుండగా, గంగిరెద్దుల విన్యాసాలు, ఆకాశాన పతంగుల విహారాలు ఆకట్టుకోనున్నాయి.
- తొర్రూరు జనవరి 12 ధనుర్మాసం ముగిసి, సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజును మకర సంక్రాంతిగా పిలుస్తారు. భానుడు దక్షిణాయణం చాలించి, ఉత్తరాయణంలోకి అడుగుపెట్టే సంక్రాంతి పర్వదినాన్ని గురువారం ఘనంగా జరుపుకునేందుకు అంతా సిద్ధమయ్యారు. నేడు భోగి, ఎల్లుండి కనుము పండుగను కన్నులపండువగా నిర్వహించుకోనున్నారు.
- తొర్రూరు జనవరి 12 ఆకట్టుకునేలా రంగవల్లులు.. మహిళలు, యువతులు పొద్దున్నే లేచి అలుకు జల్లి, రంగురంగుల ముగ్గులు వేస్తారు. గొబ్బెమ్మలు పెట్టి, పూలు, పండ్లు, నవధాన్యాలతో పూజిస్తారు. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభంలో దేవతలు దివి నుంచి భువికి దిగివస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఆ సమయంలో అలంకరణ ఉన్న ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారని హిందువులు నమ్ముతారు. శివుడి నంది స్వరూపాలుగా భావించే గంగిరెద్దులు ఇంటి ఆవరణలో ప్రవేశించడాన్ని శుభసూచకంగా భావిస్తారు. హరిదాసును విష్ణుస్వరూపంగా భావించి ధాన్యాన్ని దానంగా సమర్పిస్తారు. హరిదాసు సంకీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు చిన్నా పెద్దలను ఆకట్టుకుంటాయి.
భోగిపళ్ల స్నానాలు... పిండి వంటలు
వేకువజామునే భోగిమంటలు కాచుకుని తలకు కొబ్బరినూనె పట్టించి ఒంటికి నలుగుపండి రాసి తలస్నానాలు చేయిస్తారు. కొడుకులకు, కొత్త అల్లుళ్లకు, పిల్లలు బాగుండాలని దీవెనలు అందిస్తారు. నీళ్లలో రేగుపళ్లు వేసి స్నానం పోస్తే దిష్టి పోతుందని నమ్మకం. కనుమ రోజున కొత్త ధాన్యం ఇంటికి చేరడంతో ప్రత్యేకంగా నైవేద్యం వండి దేవతలకు సమర్పిస్తారు. ధాన్యపు రాశులపై పసుపుతో చేసిన లక్ష్మీదేవిని పెట్టి పూజలు చేసి బియ్యం, బెల్లం, నెయ్యితో తయారు చేసిన పొంగళిని నైవేద్యంగా పెడుతారు.
సౌభాగ్య నోములు..
సంక్రాంతికి మహిళలు బొమ్మల కొలువులు పెడతారు. ఇంటింటా చిన్నారులు బొమ్మల కొలువులు ఏర్పాటు చేస్తారు. సౌభాగ్యవంతులైన మహిళలు సంక్రాంతి నోములు నోచుకుని ముత్తయిదువులను పిలిచి వాటిని కానుకగా అందజేసి ఆశీర్వాదం తీసుకుంటారు. పసుపు, కుంకుమలతో సౌభాగ్యాన్ని స్వీకరిస్తారు. బెల్లం, నువ్వులు ప్రసాదాలుగా పంచిపెడుతారు. కలకాలం ద్వేషాలు తొలగి సంతోషాలతో కలిసి ఉండాలని ఆకాంక్షిస్తూ నోములు, వ్రతాలు చేస్తారు.
పూలకు ఫుల్ డిమాండ్
నగరానికి పూలు పోటెత్తాయి. మకర సంక్రాంతి మకరందాలు వెదజల్లే పూల మార్కెట్‌కు భలే డిమాండ్ ఉంది. దిగుబడి లేనందున ధర ఎక్కువగా ఉంది. దీంతో జిల్లాలతో పాటు పొరుగు రాష్ర్టాల నుంచి నగరానికి దిగుమతి అవుతున్నాయి. ముఖ్యంగా బంతి, చామంతి, గులాబీ పూలకు డిమాండ్ బాగా ఉంది. పండుగ రోజు ఇళ్లు, దుకాణాలను పూలతో అలంకరిస్తారు.
ఆర్టీసీకి ‘పండుగే’
ఆర్టీసీకి సంక్రాంతి సందడి నెలకొంది. సొంతూళ్లకు వెళ్లే వారితో బస్స్టేషన్లలో హడావుడి మొదలైంది. ముఖ్యంగా హైదరాబాద్, కరీంనగర్, ఏటూరునాగారం, ములుగు, భూపాలపల్లి, పరకాల, పాలకుర్తి, నిజామాబాద్, ఖమ్మం, నర్సంపేట రూట్లలో రద్దీ ఎక్కువగా ఉన్నందున బస్‌ల సంఖ్యను పెంచారు. సుమారు 500 వరకు అదనంగా బస్సులను తిప్పుతున్నారు. కరోనా వైరస్ కారణంగా నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీ.. సంక్రాంతితో సంస్థకు ఆదాయం మరింత పెరుగనుంది.
పతంగులతో పిల్లలు..
సంక్రాంతి పండుగకు పతంగులు ఎగురవేయడం ఆనవాయితీ. ప్రస్తుతం కరోనా కారణంగా పాఠశాలలు లేకపోవడంతో పిల్లలకు ఇంటికే పరిమితమయ్యారు. పండుగ కొద్ది రోజుల ముందునుంచే గాలిపటాలు ఎగురవేస్తూ సరదా తీర్చుకుంటారు. చిన్నారులను ఆకర్షించేలా ఈసారి మార్కెట్లోకి కొత్త కొత్త పతంగులు వచ్చేశాయి.
పోటెత్తనున్న జాతరలు
సంక్రాంతి సందర్భంగా పలుచోట్ల జరిగే జాతరలకు జనం పోటెత్తనున్నారు. ముఖ్యంగా వరంగల్ అర్బన్ జిల్లాలోని ఐనవోలు మల్లికార్జునస్వామి, కొత్తకొండ వీరభద్రస్వామి జాతరలు వైభవంగా సాగనున్నాయి. ఆయాచోట్ల నిర్వహించే ఈ ఉత్సవాలకు ఉమ్మడి వరంగల్ నుంచే గాక మిగతా జిల్లాల నుంచీ భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు.
పశువులను పూజించే పండుగ..
సంక్రాంతి తర్వాతి రోజును కనుము పండుగగా జరుపుకుంటారు. దీనినే పశువులను పూ జించే పండుగ అంటారు. ‘కనుము’ అంటే పశువు అని అర్థం. పండుగను ఆనందంగా జరుపుకుంటున్నామంటే కారణం మన గాదెలన్నీ నిండుగా ఉండడం వల్లే కదా! మరి ఆ గాదెల్లో ధాన్యాన్ని నింపడంలో తోడ్పడేవి పశువులే. దుక్కి దున్నిన నాటి నుంచి పంట ధాన్యాన్ని గాదెలకు చేర్చేవరకు శ్రమించిన పశువులను ఆరాధించడమే కనుము పండుగలోని పరమార్థం. కనుము రోజున పశువులను కడిగి పసుపు, కుంకుమను కొమ్ములకు అలంకరించి ముఖానికి బొట్టు పెట్టి ఊరేగిస్తారు. అలాగే, కనుమ రోజు పితృదేవతలకు పూజలు చేస్తారు.
జనగామలో ఏర్పాట్లు పూర్తి
జనగామ చౌరస్తా : ఈ నెల 16న కరోనా టీకా పంపిణీకి వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జనగామ జిల్లా వ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తి చేశాం. మొదట ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులు, స్టాఫ్ నర్సులు, సిబ్బంది, ఐసీడీఎస్ అధికారులు, టీచర్లు, హెల్పర్లకు టీకా వేస్తాం. రెండో దశలో పోలీస్, మున్సిపల్, రెవెన్యూ సిబ్బందికి వేస్తాం. 16న జనగామ జిల్లా ప్రధాన వైద్యశాల, పాలకుర్తి సీహెచ్‌సీ రెండు చోట్ల మాత్రమే వాక్సినేషన్ ఉంటుంది. మొదటి రోజున సెంటర్‌కు 30 మంది చొప్పున 60 మందికి టీకా వేస్తాం. సోమవారం నుంచి జిల్లా వ్యాప్తంగా ఉన్న 13 పీహెచ్‌సీలు, 4 సీహెచ్‌సీలు, 1 అర్బన్ హెల్త్ సెంటర్, జిల్లా ప్రధాన వైద్యశాలతో కలిపి 18 చోట్లా రోజుకు వంద మందికి తగ్గకుండా టీకా వేస్తాం.
-డీఎంహెచ్‌వో మహేందర్
పండుగ సందడి షురూ..
సంక్రాంతి సందడి మొదలైంది. ఆకట్టుకునేలా రంగవల్లులు, చిన్నారుల ఆటపాటలు, బంధువుల రాకతో పల్లె, పట్టణాలకు పండుగ శోభ వచ్చింది. మరోవైపు పండుగ కోసం తీసుకొనే కొత్త బట్టలు, పిండి వంటలు, పూజా సామగ్రి.. ఇలా పండుగ షాపింగ్‌తో వ్యాపారం జోరందుకుంది. దీంతో మార్కెట్లు కళకళలాడుతుండగా, సొంతూళ్లకు పయనమవుతున్న వారితో బస్స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి.
మార్కెట్ల కళకళ..
పండుగ సందర్భంగా రోజుల ముందునుంచే మార్కెట్లు కళకళలాడుతున్నాయి. పతంగుల దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. పలుచోట్ల పతంగులు, మాంజా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అలాగే ముగ్గులు వేసేందుకు రంగులతో పాటు పూలు, రేగుపండ్లు, ఇతర సామగ్రి కొనుగోలు చేసేందుకు వచ్చిన వారితో మార్కెట్లో సందడి నెలకొంది.
తాజావార్తలు
- భద్రతలో భాగస్వామ్యం..
- 12 భాషల్లో రైల్వే హెల్ప్‌లైన్ సేవలు
- రోడ్డు భద్రతలో ఇక సామాన్యుడే ‘సేవియర్'
- మూడు డిగ్రీలు పెరగనున్న ఉష్ణోగ్రతలు
- సమాజంలో స్త్రీల పాత్ర గొప్పది
- 160 మంది అతివలకు చేయూత
- ఆత్మవిశ్వాసమేఆలంబనగా ఎదగాలి
- 09.03.2021, మంగళవారం మీ రాశిఫలాలు
- నారీశక్తి వర్ధిల్లాలి
- చదువులమ్మను చట్టసభకు పంపుదాం..