సోమవారం 18 జనవరి 2021
Mahabubabad - Dec 03, 2020 , 02:07:05

మంచు పర్వతంపై మనోళ్లు

మంచు పర్వతంపై మనోళ్లు

  • కేదార్‌ఖండ్‌ను అధిరోహించిన తాట్యాతండా యువకులు

కురవి: మంచు పర్వతాన్ని మనోళ్లు అధిరోహించారు. సాధించాలనే తపన ఉంటే ఏదైనా సాధ్యమేనని నిరూపించారు కురవి మండలం కొత్తూరు(జీ) శివారు తాట్యాతండాకు చెందిన గిరిజన యువకులు. తండాకు చెందిన జాటోత్‌ చక్రవర్తి, గుగులోత్‌ హరీశ్‌కు చిన్నతనం నుంచి పర్వతాలను అధిరోహించాలనే  తపనకు తోడు హిమాలయం ఆంబీషన్‌ కంపెనీ తోడైంది. ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లా సాంక్రీ పట్టణ సమీపంలో ఉన్న కేదార్‌ఖండ్‌ పర్వతాన్ని అధిరోహించేందుకు గత నెలలో కంపెనీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. అనుమతి రావడంతో 23వ తేదీన ఉత్తరాఖండ్‌కు చేరుకున్నారు

26వ తేదీన పర్వతాన్ని అధిరోహించేందుకు గైడ్‌ వినోద్‌రాణాతో బయల్దేరారు. 27వ తేదీన మంచు తుఫాన్‌ వచ్చినా వారు వెనుకడుగు వేయలేదు. రెండు రోజుల సాహస యాత్ర విజయవంతమైంది. ఢిల్లీకి చెందిన మరో సాహసికుడు రోహిత్‌ కలిసి జాతీయ పతాకాన్ని చేతబట్టుకుని శిఖరాగ్రంపై  విజయకేతనం ఎగురవేశారు. ఈ సందర్భంగా జాటోత్‌ చక్రవర్తి, గుగులోత్‌ హరీశ్‌  మాట్లాడుతూ అవకాశం, తోడ్పాటు లభిస్తే భవిష్యత్‌లో మరిన్ని సాహసయాత్రలు చేసి పర్వతాలను అధిరోహిస్తామని అన్నారు. ఈ సందర్భంగా తండావాసులు వారిని అభినందించారు.